చరిత్ర సృష్టించిన సైనా

ఇప్పుడు భారత క్రీడా రంగాన్ని ఏలుతున్నది ఇద్దరు యువతులు. ఒకరు సానియా మీర్జా. మరొకరు సైనా నెహ్వాల్. అంతర్జాతీయ టెన్నిస్ లో ప్రత్యేకించి మహిళా డబుల్స్ లో వరుస టైటిల్స్ తో దూసుకుపోతున్న క్రమంలో సానియా మీర్జా రాజీవ్ ఖేల్ రత్నఅందుకోగా సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ లో మన దేశం తరఫున చరిత్ర సృష్టించారు.

జకార్తాలో ఈ మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సైనా నెహ్వాల్ ఎవరూ ఊహించని రీతిలో రజత పతకం సాధించింది. దాదాపు ముప్పై రెండేళ్ళ క్రితం ప్రకాష్ పదుకొనె కాంస్యం సాదిస్తే 28 ఏళ్ళ తర్వాత మన దేశానికి బ్యాడ్మింటన్ లో జ్వాలా – అశ్విని పతకం కరువు తీర్చారు. అనంతరం మన తెలుగమ్మాయి సింధు వరుసగా రెండు కాంస్యాలతో చరిత్ర సృష్టించింది. అయితే ఇప్పుడు సైనా నెహ్వాల్ ఈ పతక గ్రహీతలనందరినీ అధిగమించి రజత పతకం అందుకుని చరిత్రను తిరగరాయడం విశేషం.

సైనా విజయాలకు పట్టుదల, కృషి, అంకిత భావం, అన్నింటినీ మించి ఆత్మవిశ్వాసం ప్రధాన ఆయుధాలు.

1990 మార్చి పదిహేడో తేదీన సైనా హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలోని దిందర్లో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు ఉషా నెహ్వాల్, హర్విర్ సింగ్. ఆ తర్వాత సైనా కుటుంబం తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాదుకు చేరుకుంది. ఆమె తల్లిదండ్రులు ఆమెకు బ్యాడ్మింటన్ క్రీడా పట్ల ప్రేమ, ప్రతిభ జీన్స్ లో ఉంది. కారణం ఆమె తల్లిదండ్రులు ఒకప్పుడు హర్యానా రాష్ట్ర మాజీ ఛాంపియన్స్. సైనా తన ఎనిమిదో ఏటా ఆడటం ప్రారంభించింది. ఆమె తండ్రి డాక్టర్ హర్విర్ సింగ్ సైంటిస్ట్. ఆయన ప్రోత్సాహంతోనే సైనా బ్యాడ్మింటన్ లో రంగప్రవేశం చేసింది. మొదట్లో నాని ప్రసాద్ దగ్గర శిక్షణ పొందిన సైనా ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత ఎస్ ఎం ఆరిఫ్ వద్ద కూడా తర్ఫీదు పొందింది. ప్రస్తుతం ఆమె గోపీచంద్ అకాడమీలో మరింత మెరుగులు దిద్దుకుంటోంది.

ఆమె అనేక స్కూల్స్ లో చదువుకుంది. హిసార్ లోని సి సి ఎస్ క్యాంపస్ స్కూల్ లో లోయర్ కేజీ నుంచి మూడో క్లాస్ వరకు చదువుకుంది. నాలుగో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు భారతీయ విద్యా భవన్ విద్యాశ్రమం స్కూల్ లో చదువుకుంది. స్కూల్ రోజుల్లో ఆమె కేవలం చదువు పట్లే అత్యంత శ్రద్ధ చూపుతుండేది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేది కాదు.

అయితే 2006 లో జాతీయ ఛాంపియన్ షిప్ లో పందొమ్మిది ఏళ్ళలోపు విభాగంలో ఛాంపియన్ కావడంతో సైనా ఎవరనేది అందరికీ తెలియడం మొదలైంది. అలాగే ఆసియన్ శాటిలైట్ టోర్నమెంట్లో మరో గొప్ప విజయం సాధించడంతో అంతర్జాతీయంగాను ఆమెకో గుర్తింపు వచ్చింది. అంతే కాదు మరో రెండేళ్లకు
2008 లో ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో టైటిల్ సాధించినప్పుడు మన దేశం నుంచి ట్రోఫీ దక్కించుకున్న తొలి క్రీడాకారిణి అయ్యింది. 2012 లో లండన్ లో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకున్న సైనా అనేక టోర్నమెంట్ లలో తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఈ ఏడాది మొదట్లో ప్రపంచ నెంబర్ -1 గా ఎదగింది.అందుకే ఆగస్ట్ నెలలో జకార్తా లో నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీ పడినప్పుడు ఆమెపై ఉండిన అంచనాలు ఎక్కువే. మంచి ఫాం లో ఉండటంతో పాటు స్మాష్ లు ఆడటం లో కాస్త ఇబ్బంది పడుతుందన్న అభిప్రాయం ఉన్నా సైనా సుదీర్ఘ ర్యాలీలతో ప్రత్యర్ధులను ఓ పట్టు పడుతుందనే మాటా లేకపోలేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ఇప్పటికే ఎన్నో “మొదటి” ఘనతలు సొంతం చేసుకున్న సైనా ఇప్పుడు మరో కొత్త చరిత్ర సృష్టించింది. 38 ఏళ్ళ ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో ఫైనల్ కు చేరుకున్న మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన సైనా స్వర్ణం కోసం జరిగిన పోరులో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిం చేతిలో 16-21, 19-21 తేడాతో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సైనా తన స్థాయికి తగిన ప్రతిభ ప్రదర్శించలేకపోయింది. ఈ విషయాన్ని ఆమే చెప్పుకుంది. లెక్కలేనన్ని తప్పిదాలు చేయడమే కాకుండా ఓర్పు కోల్పోయి ఆట మీద పట్టు తప్పిందని సైనా ఒప్పుకుంది. రెండో గేమ్ లో ఆధిక్యం సంపాదించినా నిలబెట్టుకోలేక పోయిన సైనా కీలక సమయాల్లో దిద్దుకోలేకపోయిన తప్పులు చేసి స్వర్ణానికి దూరమైంది. ప్రత్యర్ధికి గత అనుభవం కలిసోచ్చినట్టు సైనా చెప్పింది.

అయితే ఒక్కటి…మొత్తం మీద ఈ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఉత్తమ ప్రదర్శన చూపడం గర్వంగానే ఉన్నట్టు చెప్పుకున్న సైనా తన జీవితంలో ఇది ఓ గొప్ప ఘనతే అని, తొలిసారిగా రజతం సాధించడం సంతోషంగా ఉందని తెలిపింది.

గట్టి డ్రా ఎదురైనా చివరి వరకు బాగానే ఆడుతూ వచ్చిన సైనా తనను తుది పోరులో ఓడించిన కరోలినా పై మరో సారి తలపడే అవకాశం వస్తే గెలిచి ప్రతీకారం తీర్చుకుంటానని వెల్లడించింది. జకార్తా టోర్నీతో ఆత్మవిశ్వాసం పెరిగినట్టు చెప్పుకున్న సైనా స్ట్రోక్స్, ర్యాలీలు వేగంగా ఆడగాలుతోంది. దాడులు కూడా చేయగాలుగుతోంది. ఫీట్ నెస్ కూడా మెరుగుపడింది. తన ఆట తీరులో మార్పుకి ప్రధాన కారణం కోచ్ విమల్ కుమార్ అని చెప్పుకున్న సైనా ప్రతీ దశలోనూ కోచ్ “నేనే ఛాంపియన్” అని స్ఫూర్తి నిస్తూ వచ్చారని, అలాగే గెలుపోటములకు ప్రాధాన్యం ఇవ్వకుండా అత్యుత్తమ ఆట ప్రదర్శించడం ఒక్కటే ముఖ్యమని ఆయన చెప్పిన సూత్రం తనకెంతో లాభించిందని చెప్పింది. కోచ్ విమల్ కుమార్ సైనా ఆట మీద ప్రత్యెక శ్రద్ధ చూపారు. ఆమె శిక్షణ కోసం ఎక్కువ సమయమే కేటాయించారు. బలహీనమనుకున్న అంశాల్లో సైనా మెరుగు పడేలా చేశారు. వొత్తిడి నెలకొనే వేళల్లో కోచ్ మీద ఆధార పడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా ఆమెను తీర్చిదిద్దారు. ఆయన కనుసన్నల్లో శిక్షణ పొందిన తర్వాత సిన నెంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోవడమే కూడా ఎన్నో అగ్రశ్రేణి ఛాంపియన్ షిప్స్ లో ఆమె విజయబావుటా ఎగుర వేసింది కూడా.

సైనా నెహ్వాల్ అంశాలు…

పుట్టిన తేదీ – 1990 మార్చ్ 17 (హర్యానా రాష్ట్రం)
ప్రస్తుతం ఉంటున్న ప్రదేశం – హైదరాబాద్, తెలంగాణా రాష్ట్రం
ఎత్తు – 167 సెంటీమీటర్లు
బరువు – అరవై కిలోలు
రాకెట్ – యోనెక్స్
బాల్యంలో కోచ్ లు – నానీ ప్రసాద్, ఎస్ ఎం ఆరిఫ్
ప్రస్తుత కోచ్ – పుల్లెల గోపీచంద్
ఇష్టమైన చిత్రం – చక్ దే ఇండియా
ఇష్టమైన నటుడు – షారూక్ ఖాన్
ఫేవరిట్ క్రీడాకారులు – టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, గోపీచంద్
సెలవులప్పుడు గడపాలనుకునే ఫేవరిట్ ప్రదేశం – సింగపూర్
ఇష్టమైన మరో క్రీడా – టెన్నిస్
ఇష్టమైన అన్నం – పెరుగన్నం

Send a Comment

Your email address will not be published.