చిత్ర జీవన రధ సారధి ..బాపు

ఆయన కుంచెలోంచి పుట్టుకురావాలని ఎంత మంది అప్సరసలు ఎందరు దేవుళ్ళు, దేవతలు పోటీ పడ్డారో లెక్కే లేదు. సురలు అసురలు అనే భేదం లేదు భూమ్మీద మరెవరి దృష్టిలోనైనా  పడాలనుకున్నా  అందాల బొమ్మలన్నీ బాపూ వాకిట్లో క్యూ కట్టాయంటే అందులో అతిశయోక్తి లేదు.
అదేదో అలవాటుగా బొమ్మలు వేస్తూ వచ్చిన బాపూ వాళ్ళ నాన్న ఒక అడ్వకేటు. హాబీగా అయితే పరవాలేదేమోగానీ  ఆర్టిస్టుగా బతకడం కష్టమని ఎంచిన ఆ తండ్రి బాపూగారితో లా చదివించారు. కానీ బాపూగారు బొమ్మల లోకంలో ఉండిపోయారు. తమిళంలో  గొప్ప చిత్రకారుడిగా ఓ వెలుగు వెలిగిన గోపులు గారికి బాపూ ఏకలవ్య శిష్యుడు. గోపులు గారి దగ్గరికి తరచూ వెళ్లి ఆయన బొమ్మలు ఎలా వేసేవారో చూస్తుండేవారు. బాపూ అంటే గోపులుగారికి వల్లమాలిన ప్రేమ ఉండేది. బాపూకి నేల మీద బాసింపట్టు వేసుకుని బొమ్మలు వేయడం అలవాటు. అంతే తప్ప ఓ బల్ల మీద కూర్చుని బొమ్మలు వేసేవారు కాదు. అంతదాకా ఎందుకు … ఆయన మరీ చిన్నప్పుడు వంటింట్లో బొగ్గులతో నేలంతా బొమ్మలు వేసేవారు. ఓసారైతే వాళ్ళ నాన్నగారు ఆ బొమ్మలు చూసి “వెధవా … ఏమిటీ పిచ్చి గీతలు అని కోప్పడ్డారు కూడా… అంతేకాదు బాపూ గానీ వాటిని చేరిపేయకపోతే సర్లే ఉండనీ మసి చూసుకో అని అన్నారు. ఈ మాటలు ఎందుకని ఆయన రావడానికి ముందే ఆఫీసు కుర్చీలో కూర్చుని కేసు పేపర్ల చివర ఉన్న ఖాళీ జాగాలో బాపూ బొమ్మలనుకునే గీతలు గీసేవారు. అవన్నీ దాచి ఇంటికి వచ్చే మిత్రులకూ వాళ్ళకీ వీళ్ళకీ మా వాడు గీసిన గీతలివి అంటూ చూపించేవారు ఆయన తండ్రి.
ఊహ తెలిసినప్పటినుంచి బొమ్మలతోనే అడుగులు వేస్తూ వచ్చిన బాపూ వేసిన బొమ్మను మొదటిసారిగా అచ్చేసిన పత్రిక బాల. ఆ పత్రిక 1945 లో కవ్వపు పాట అనే 12 పంక్తుల పాటకు ఒక అమ్మాయి పెరుగును చిలుకుతున్నట్టు గీసిన బాపూ బొమ్మ వేసింది. అప్పుడు ఆయన పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ అని ముద్రించింది. బాపూ అసలు పేరు ఇదే. అంతేకాదు పేరు పక్కన ఐదో ఫారం అని కూడా పేర్కొంది. ఆ బొమ్మ అచ్చైన వేళావిశేషమేమిటో గానీ బాపూ ఎన్ని పత్రికలకు  బొమ్మలు వేసారో లెక్క లేదు. ….
ఎమెస్కో అనే  పుస్తక ప్రచురణ సంస్థ వారు వేసిన ఎన్నో పుస్తకాలకు బాపూతో ముఖ చిత్రాలు వేయించుకుంది.
ఆయనతో ముఖచిత్రం వేయించుకున్న రచయితల జాబితా అంతు లేనిది.
పైగా సంగీతం వింటూ బొమ్మలు గీసే అలవాటు కూడా ఉండేది. సంగీతానికి సంబంధించి ఆయన దగ్గర పెద్ద జాబితా ఉండేది. గజల్స్ అంటే ఆయనకు మహాప్రాణం.
చదువుకుంటున్న రోజుల్లో మౌత్ ఆర్గాన్ వాయిస్తూ ఉండే బాపూ విచిత్రంగా తన మొదటి సినిమా సాక్షికి పబ్లిసిటీ డిజైన్ పనంతా ఆయన వెయ్యకుండా మరొక ఆర్టిస్టు (ఈశ్వర్) తో వేయించారు.
ఆయన తీసిన ప్రతీ సినిమాకి స్టోరీ బోర్డు ఆయనే  తయారుచేసుకునే వారు. ఎందుకు అలా తయారు చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే ఆ పద్ధతి వల్ల షూటింగ్ స్పాట్ లో తన పని ఎంతో సులువయ్యేదని జవాబిచ్చేవారు.
తన సినిమాలకు హోం వర్క్ చేసుకుని గానీ చిత్రీకరణకు వచ్చేవారు కాదు. ఆయన తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. బాపూ దర్శకత్వం వహించిన చివరి చిత్రం శ్రీరామరాజ్యం. ఈ సినిమా షూటింగు సమయంలోనే బాపూ ప్రాణ మిత్రుడు ముళ్ళపూడి వెంకటరమణ కన్నుమూశారు. ఆయన మరణం బాపూని దెబ్బతీసింది. ఆయన సినిమాలకు రెండు జాతీయ అవార్డులు, అయిదు నంది పురస్కారాలు లభించాయి. రామాయణాన్ని తన సినిమాల ద్వారా సామాన్యులకు సైతం చేరువ చేసిన వారిలో బాపూ కూడా ఒకరు. 1967 లో సాక్షి సినిమాతో దర్శకుడిగా అవతరించిన బాపూ బంగారుపిచుక, బుద్ధిమంతుడు, బాలరాజు కథ, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, శ్రీరామాంజనేయ యుద్ధం, ముత్యాల ముగ్గు, సీతాకల్యాణం, భక్తకన్నప్ప, సీతాస్వయంవరం, మనవూరి పాండవులు, తూర్పు వెళ్ళే రైలు, రాధాకళ్యాణం, సీతమ్మ పెళ్లి, రామబంటు, రాధాగోపాలం, సుందరకాండ, రామరాజ్యం తదితర చిత్రాలు సమర్పించి ప్రేక్షకులను రంజింపచేసారు. కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరైన బాపూ తెలుగుదనానికి పర్యాయపదం…తెలుగు సినిమాకు దృశ్య కావ్యం. గీసిన బొమ్మలకు ప్రాణం పోయడంలో ఏ పక్షపాతం కనిపించనివ్వని బాపూ వెండితెరకు అందాలను దిద్దడంలోనూ ఏ లోటు చేయలేదు.
లెక్కపెట్టలేనన్ని బొమ్మలు వేసినప్పటికీ తాను నిరంతర విద్యార్ధినని చెప్పుకునే వారు. ఎప్పుడూ బొమ్మలు వేస్తుండేవారు. ఓపిక ఉన్నంత సేపు బొమ్మలు వేసిన బాపూ పుస్తకాలు కూడా ఎక్కువగానే   చదివేవారు.
మంచి ఆర్టిస్టు కావాలంటే లోలోపల బొమ్మలు గీయాలనే తపన ఉండాలంటారు. ఆ ఆసక్తి సహజమైనదిగా ఉండాలంటారు.
1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం దగ్గరలోని కన్తేరులో  సత్తిరాజు వేణుగోపాల రావు, సూర్యకాంతం దంపతులకు పుట్టిన బాపూ 2014 ఆగస్ట్ 31 వరకు సాగించిన జీవనయానంలో పురుడు పోసుకున్న బొమ్మలు అన్నీ ఇన్నీ కావు. 2013 లో పద్మశ్రీ అయిన బాపూతోపాటే ఆయన  కుంచె, వర్ణాలు, పెన్సిళ్ళు మూగపోయిన మాట ఎంత బాధాకర వాస్తవమో ఆయన ఊపిరైనా బొమ్మల లోకం కూడా మౌనంగానే ఇప్పటికీ ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటుందని అనడం అతిశయోక్తి కాదు.
నాకెంతో ఇష్టమైన రచయితల్లో ఒకరైన తనికెళ్ళ భరణి రమణించిన “బాపు” అంటూ బాపూగారికి సమర్పించిన నివాళినిక్కడ స్మరించుకోవడం సముచితమే అనుకుంటున్నాను….భరణి మాటలు చదవండి….
బాపు బొమ్మకు నిన్ననే బాధ్యత పెరిగింది….బాపు రేఖకు మొన్ననే కుంకం చెదిరింది….తెలుగుజాతి జాతంతా ఉసూరుమనగానే బాపూ చిత్రాలన్నీ బావురుమన్నాయి….అచ్చ తెలుగు చిత్రానికి గోదావరి సాక్షి….స్వచ్చమైన స్నేహానికి బాపురమణలే సాక్షి…..రామయ్యా నీ విల్లుని వంచినోడు బాపు…గంగమ్మా నిను కిందకు దించినాడు బాపు….
ముళ్ళపూడి వెంకటరమణ గురించి మాట్లాడుతూ రమణ (ముళ్ళపూడి వెంకటరమణ) లేని లైఫ్ చాలా కష్టంగా ఉందండి, రమణ పోయినప్పటి నుంచీ నాకు ఓపిక పోయింది అని ఒక ఇంటర్ వ్యూ లో చెప్పిన బాపూ – రమణల మైత్రీ బంధం అలాంటిది. ఒక నాణానికి బొమ్మా బొరుసు ఉండటం వాళ్ళ వారిద్దరినీ బొమ్మా బోరుసులుగా అభివర్నిన్చేకన్నా మైత్రీ బంధమనే నాణానికి ఒక వైపే ఈ ఇద్దరూ ఉన్నట్టు ఊహించుకుని వారిని చూడటం మంచిదని నా అభిప్రాయం. వారి పేర్లూ…రూపాలూ వేర్వేరు కావచ్చేమో కానీ ఇద్దరి ప్రేమలూ, ప్రాణాలూ, ఆప్యాయతలూ, స్నేహాలూ ఒక్కటే. వీరి బంధం గాఢమైంది. ముందు వెనుకలుగా భౌతికంగా వీరిద్దరూ మన నుంచి దూరంగా వెళ్తే వెళ్లి ఉండవచ్చు గానీ వీరి స్నేహబంధాన్ని విడగొట్టి చూడటం అసాధ్యం. డబ్బు ఎంత గొప్ప స్నేహాన్నైనా విడదీయవచ్చేమో కానీ వీరి విషయంలో ఆ మాట ఏమీ చేయలేక వోడిపోయి తలదించుకుంది. ఆర్ధికంగా ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎక్కడా ఆవగింజంత తేడా రాకుండా తమ బంధాన్ని ఏళ్ళ తరబడి సాగించడం అమోఘం. అద్భుతం. ఇద్దరూ ఒకే ఆవరణలో ఒకే చిరునామాలో ఉండేవారు. వీరు ఉండిన ఇల్లు రమణగారు కట్టించారు. రమణను బాపూవాళ్ళ అమ్మ గారు పెద్దబ్బాయి అని పిలిచేవారు. వీరి స్నేహబంధాన్ని చెప్పుకుంటూ ఎందరెందరో రకరకాల మాటలు హృద్యంగా పొదిగారు. స్వర్గంలో బాపూ రమణీయం అనే శీర్షికతో సి హెచ్ వీ రమణారావు గారు రాసిన వ్యాసంలో ఎత్తుగడ ఎలా ఉందో చూడండి….
“రావోయ్ మిత్రమా…రా…నువ్వు లేక మూడేళ్ళుగా ఎంత యాతన పడుతున్నానో నీకేం తెలుసు…ఇక్కడ రంభా..ఊర్వశీ తిలోత్తమా చంపుకు తింటున్నారనుకో…మన ఒంటికి సరిపదనివేవో ఇస్తామంటారు..నువ్వొచ్చేసావుగా ….ఇంకేం పరవాలేదు…అప్పుడే స్వర్గంలోకి అడుగుపెట్టిన బాపూతో రమణ ఇలాగే మాట్లాడుతారేమో అని. ఇలా ఆన్నేసి మాటలు పుట్టుకురావడానికి కారణం వీరి ప్రగాఢమైన బంధం అలాంటిది.

Send a Comment

Your email address will not be published.