రాజకీయ నాయకుడుగా మారిన నటుడు చిరంజీవి దృష్టి భారతీయ జనతా పార్టీ వైపు మళ్లినట్టుగా కనిపిస్తోంది. ఆయన సలహాదారులు, సన్నిహితులు ఆయనను బీజేపీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. రాష్ట్రాన్ని విభజించిన తీరు ఆయనను బాగా కలచివేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని ఆమెకు నచ్చజెప్పేందుకు అప్పట్లో అనేక పర్యాయాలు ప్రయత్నించారు. కానీ ఆయన మాటను ఆమె సన్నిహితులు లెక్క చేయలేదు. పురధరేస్వరి కాంగ్రెస్ నుంచి తప్పుకున్నప్పుడే పార్టీకి గుడ్ బై చెప్పాలని ఆయన ఒక దశలో అనుకున్నారు. కానీ కాంగ్రెస్ మిత్రులు ఆయనకు నచ్చజెప్పడంతో అప్పటికి విరమించుకున్నారు. అయితే ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ బీజేపీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు మద్దతు తెలియజేయడం, ఆ పొత్తు ఘన విజయం సాధించడం జరిగినప్పటి నుంచీ ఆయనలో అంతర్మథనం మొదలయిందని తెలిసింది. రెండు రోజుల క్రితం ఆయన స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసి, తాను బీజేపీలో చేరే విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిసింది. నాయుడు కూడా అనుకూలంగా స్పందించి తమ పార్టీ పెద్దలతో మాట్లాడడానికి అంగీకరించినట్టు తెలిసింది. సరయిన సమయం చూసి చిరంజీవి బీజేపీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి.