చిరంజీవి పై రాళ్ళ దాడి

ఏవి తండ్రీ … నిన్నమొన్న నాపై కురిసిన పూల వర్షం … ఈనాడు అవి రాళ్ళగా  మారేనా అంటూ … వాపోతున్నారు మెగాస్టార్ కేంద్ర మంత్రి చిరంజీవి. పూలమ్మిన చోట కట్టెలు అమ్మిన చందంగా తయారైంది చిరంజీవి పరిస్థితి. ఒక వైపు తన సినీ జీవితాన్ని మలపు తిప్పి ఇండస్ట్రీ లో తిరుగు లేని హీరో గా నిలబెట్టిన ‘ఖైదీ’ సినిమా విడుదల అయి ముప్పై సంవత్సరాలు పూర్తి అయిన వేళ వేడుకలు, సంబరాలతో మునిగి తేలాల్సిన సమయం లో రాళ్ళ దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇటీవల తీవ్రంగా కురిసిన వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్ని పరామర్శించడానికి కేంద్ర రాష్ట్ర మంత్రుల బృందం శ్రీ కాకుళం జిల్లా పర్యటనకి బయలు దేరి వెళ్ళింది. ఆ బృందంలో కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రులు సత్యనారాయణ, కొండ్రు మురళి ఉన్నారు. వీరు రాజాం నియోజకవర్గ పర్యటనకి వెళ్ళినప్పుడు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని విద్యార్ధులు, యువకులు రాళ్ళ వర్షం కురిపించారు. చిన్న చిన్న గులక రాళ్ళతో వారు చేసిన దాడి నుంచి చిరంజీవి తప్పించుకోలేక పోయారు. సమైఖ్య రాష్ట్రం కోసం పోరాడని మంత్రులంతా వెనక్కి వెళ్లాలని వారు డిమాండ్ చేశారు. మంత్రుల బృందం వారికి సర్ది చెప్పలేక, రాళ్ళ దాడి తప్పించు కోవడం కోసం గబా గబా కాన్వాయ్ ఎక్కి పారిపోయారు.

ముప్పై ఏళ్ల పాటు సినీ పరిశ్రమని ఏలిన మగ మహారాజుకి ఇప్పుడు ఈ దుస్థితి రావడం స్వయంకృతాపరాధమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అదిరిపోయే డాన్సులు, దిమ్మ తిరిగే ఫైటింగ్ లు, పంచ్ పడే కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల హృదయాల్లో గుడి కట్టించుకున్న హీరో జీరో గా మారడం ప్రజారాజ్యం తోనే ప్రారంభమైంది.

ఈ పేటకి నేనే మేస్త్రిని అంటూ ముఠామేస్త్రి సినిమాలో ప్రత్యేకంగా పాట పెట్టించు కొని, మంత్రి గా నటించినప్పటి నుంచి చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు ప్రారంభమైంది. ఆ తర్వాత నుంచి ఇంద్ర, స్టాలిన్, టాగూరు వంటి సినిమాలతో చిరు రాజకీయాల్లోకి రావడం ఖాయమే అని అభిమానులు భావించారు. అందుకు తగ్గట్టే చిరంజీవి కూడా తిరుపతిలో భారీ సభ పెట్టి ‘ప్రజా రాజ్యం’ అనే పార్టీని ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భం గా చిరు చేసిన ప్రసంగం చాలా పేలవంగా సాగింది. మా అమ్మ బొమ్మలతో ఆడే వయసులో నాతో ఆడుకొంది. నేను చాలా కష్ట పడి పైకి వచ్చాను అంటూ తన కష్టాలు కన్నీళ్లు తప్ప సామాన్య ప్రజలకి ఏమి చేయాలి, ఇందుకోసం రాజకీయాల్లోకి వచ్చాను అన్న విషయాలు ప్రజలకి చెప్పలేక పోయాడు. ప్రజారాజ్యం ఆవిర్భావం తర్వాత కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ము కాయడం, చిరు బావమరిది అల్లు అరవింద్ టికెట్ల విషయంలో భారీగా ముడుపులు స్వీకరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లు వెత్తడంతో పార్టీ లోని నిజాయితీ పరులు, విద్యావంతులు ఒక్కక్కరుగా పార్టీ నుంచి వెళ్లి పోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజారాజ్యం కేవలం 16 అసెంబ్లీ సీట్లు మాత్రమే సాధించింది. ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవ లేదు. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ప్రజారాజ్యం మూసేద్దామని, కాంగ్రెస్ లో కలిపేద్దామని చిరంజీవి భావించారు. అయితే ముఖ్యమంత్రి వై. ఎస్.రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తో కొద్దికాలం విలీనం వాయిదా పడింది. మొదటి సారి 2009, డిసెంబర్ లో కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభ మైనదని ప్రకటించినప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం తరుపున సమైక్య వాదంతో రాష్ట్ర మంతా విస్తృతంగా పర్య టించారు. చిరంజీవికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చిరంజీవి ఇలాగే ప్రజల మధ్యన ఉంటే అధికారం ఖాయమని అభిమానులు భావించారు. అయితే వారి అంచనాలు తల క్రిందులు చేస్తూ చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి తన వారికి రాష్ట్ర మంత్రులు, తనకి కేంద్ర మంత్రి పదవిని తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని ప్రకిటిస్తే చిరంజీవి కనీసం వ్యతిరేకించ లేదు. సమైఖ్య వాదులు ఎంత ప్రాధేయ పడినా కనీసం తన పదవికి రాజీనామా చేయలేదు. చిరంజీవి కేవలం తన అధికారం కోసమే పాకులాడడం వల్ల హీరో నుంచి జీరోగా మారాడని విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.