చిరంజీవి నూట యాభయ్యో చిత్రం పూర్తి చెయ్యడానికి ఆరాటపడుతున్నారా?
ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినవస్తోంది. ఇందుకు సంబంధించి అనేక రూమర్లు కూడా వినవస్తున్నాయి. గతంలో అయితే రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాలకు టైము కేటాయించే అవకాశం లేకపోయిందని, అయితే ఇప్పుడు చిరుకు బోలెడంత టైము ఉందని అనుకుంటున్నారు. ఆయన వీలున్నంత త్వరగా 150వ సినిమా పూర్తి చేస్తే బాగుంటుందని అభిమానులు, కొందరు నిర్మాతలూ అభిప్రాయపడుతున్నారు.
ఇప్పుడు రాజకీయ పరిస్థితులు చిరుకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆయన సినిమా వైపు దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయన్నది అభిజ్ఞ వర్గాల భోగట్టా.
కొన్ని రోజులుగా చిరు తనకు అనుకూలమైన కథల కోసం వాకబు చేస్తున్నారని తెలియవచ్చింది.
పరుచూరి సోదరులు బహుశా చిరుకు సరిపోయే ఒక గొప్ప కథతో ఆయనను కలిసే అవకాశాలు ఉన్నాయని ఒక రూమరు. గతంలో ఈ సోదరులు చిరుతో అనేక సినిమాలకు పని చేసిన విషయం తెలిసిన సంగతే. కనుక ఈ సోదరులు మనసు పెడితే చిరు చిత్ర కథకు అన్ని విధాలా అనువైన హంగులూ సమకూర్చగలరని ఒక టాకుంది.
ఇక ఆయన 150వ చిత్రాన్ని నిర్మించేందుకు తాను ఎప్పటి నుంచో అన్ని విధాలా సిద్ధంగా ఉన్నానని, ఆ మైలురాయి కోసం తాను వెయ్యి కళ్ళతో నిరీక్షిస్తున్నానని చిరు పుత్రుడు రామ్ చరణ్ తేజ్ ఎప్పుడో ప్రకటించారు.
అయితే చిరు సినిమా పోస్టర్లపై కనిపించి అనేక సంవత్సరాలు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న క్రమంలో తన 150వ చిత్రాన్ని ఎక్కడ ప్రారంభించాలో చిరు నిర్ణయించుకోవలసి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చిరంజీవి అంటే అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కానీ మునుపటి క్రేజ్ లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియడం లేదు.