జగన్, కేసీఆర్ పార్టీలకు షాక్!

పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఎన్నికల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో  కె. చంద్రశేఖర్ రావు, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిల నాయకత్వంలోని తెలంగాణా రాష్ట్ర సమితి, వై.ఎస్. ఆర్.సి.పి పార్టీలు ఎదురు దెబ్బను చవిచూశాయి. తెలంగాణా, సీమాంధ్ర రాష్ట్రాలలోని స్థానిక సంస్థలకు గత మార్చి 30న ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక  ఎన్నికల తరువాత ఈ ఎన్నికల ఫలితాలను విడుదల చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో   సోమవారం రోజున ఈ ఎన్నికల ఫలితాలను విడుదల చేయడం జరిగింది. సీమాంధ్ర లో 92 స్థానిక సంస్థలకు, తెలంగాణాలో 53 సంస్థలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలంగాణా రాష్ట్ర సమితికి తెలంగాణాలో, జగన్ పార్టీకి సీమాంధ్ర లో అతి తక్కువ సీట్లు రావడం అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. సీమాంధ్ర లో తెలుగుదేశం పార్టీకి 62 సంస్థలు చేజిక్కగా, జగన్ పార్టీకి కేవలం 17 స్థానాలు మాత్రమే లభించాయి. మిగిలిన 13 సంస్థల్లో హంగ్ ఏర్పడింది. అదే విధంగా, తెలంగాణాలో అనూహ్యంగా కాంగ్రెస్ 21 స్థానాలు చేజిక్కించుకోగా తెలంగాణా రాష్ట్ర సమితి కేవలం 8 సంస్థలతో తృప్తి పడాల్సి వచ్చింది. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను పొందింది.

ఈ పట్టణ ప్రాంతాల ఎన్నికలలో తెలంగాణా రాష్ట్ర సమితికి గానీ, జగన్ పార్టీకి గానీ ఆశించిన స్థానాలు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఫలితాలను బట్టి శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాలను ఊహించవచ్చని అంతా భావిస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న విడుదల కావాల్సి ఉంది. కాగా, గ్రామీణ ప్రాంతాల ఎన్నికలుగా పరిగణించే జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ ఎన్నికల ఫలితాలు రేపు అంటే 13న విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాలు ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.