జగమంతా శివమయం

జగత్తుకు ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరులు. కాస్తంత తీక్షణంగా పరిశీలించగలిగితే జగమంతా స్త్రీ, పురుష లింగ స్వరూపమై కనిపిస్తుంది. స్త్రీలు శక్తిస్వరూపులు.పురుషులు శివస్వరూపులు. అందుకే జగత్తుని శివశక్తి స్వరూపంగా చెప్పుకోవడం కద్దు.

చరాచర జగత్తు శివయమే. శివుడి అష్టమూర్తులైన భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, జీవుడు, సూర్యుడు, చంద్రుడు, జగమంతా వ్యాపించే ఉన్నాయి. ఈ అష్ట మూర్తుల తత్త్వం గురించి శివపురాణంలో సమగ్రంగా వివరించారు.

వృక్షానికి మూలం నీరు. ఆ నీటిని పోసినట్లయితే కొమ్మలు ఎలా వికసిస్తాయో అలాగే ఈ సృష్టికి మూలమైన శివుని పూజిస్తే సంతృప్తికి లోటు ఉండదు. అందుకే ప్రపంచాన్ని ద్వేషించకూడదంటారు.

శివుడు శుభకరుడు. శివుడు మంగళకారుడు. శివుడు శుభప్రదుడు. శివుడు నిత్య మంగళ మూర్తి.

శివ అనే మాటను నిత్యం చెప్పుకునే వారు ధన్యులవుతారు.

శివుడు చంద్రునిలా జగదానందకరుడు. సూర్యుడిలా అజ్ఞాన అంధకారాన్ని హరిస్తాడు. అగ్నిలా రాగ ద్వేషాలను దహిస్తాడు. శివుడి మూడో నేత్రం బ్రహ్మజ్ఞానం. భగవంతుడిని చూసే దివ్య చక్షువు. శివపురాణంలో మూడో కన్ను గురించి ఇలా ఉంది….”మనిషిలోని కామం, క్రోధం శాశ్వతంగా నశించాలి అని చెప్పేందుకు శివుడు మూడో కన్ను తెరిచి కామమనే మన్మధుడిని భస్మం చేశాడు” అని. ఈ కారణంగానే శివుడిని ముక్కంటిగా ఆరాధిస్తాము.

శివతత్వం విషయాన్ని తెలుసుకోవాలంటే లింగోద్భవ చరిత్ర తెలుసుకోవలసిందే. బ్రహ్మ, మహా విష్ణువుల సృష్టి, స్థితి అధికారాలు ఎలా వచ్చాయో అన్నది లింగోద్భవం చెప్తుంది.

ఒకానొకప్పుడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మ దేవుడు పంచముఖాలతో విష్ణువు వద్దకు వస్తాడు. అప్పుడు విష్ణువు శేషపానుపు మీద నిద్రలో ఉంటాడు. తనను పట్టించుకోలేదన్న కారణంగా దానితో బ్రహ్మకు విష్ణువు మీద కోపం వస్తుంది. ఆ కోపం  విష్ణువులోనూ మహాకోపం తెప్పిస్తుంది. తన బొడ్డు నుంచి ఉద్భవించిన తామర పువ్వు నంచి పుట్టిన నీకు నేనే తండ్రిని అని విష్ణువు చెప్పడం బ్రహ్మకు నచ్చలేదు. దీనితో ఇద్దరి మధ్యా నువ్వా నేనా గొప్ప అని వాదించుకుంటారు. ముల్లోకాలలో బ్రహ్మ, విష్ణువు తమకు తామే గొప్ప వాళ్ళమని చెప్పుకుంటారు. వీరి మధ్య నానాటికీ పెరిగిపోతున్న వైరం యుద్ధ స్థాయికి చేరుతుంది. వీరి పోరు ప్రళయం గా మారుతుంది. ఆ పోరుకి దేవతలందరూ భయపడిపోతారు. ఈ పోరాటానికి తెర దించి వారిద్దరికీ బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో శివుడు జ్యోతిర్లింగంగా అగ్నిస్తంభమై ఆవిర్భవిస్తాడు. ఆద్యంతాలు తెలియని విధంగా ఆ జ్యోతిర్లింగ వెలుగు వ్యాపించడంతో బ్రహ్మ, విష్ణువు విస్తుపోతారు. వారిద్దరిలోని అహంకారాలు అణగిపోతాయి. ఇంతకూ ఈ అగ్నిస్తంభం ఏమిటో తెలుసుకోవాలనుకుంటారు. శివ శక్తిస్వరూపాన్ని తెలుసుకుంటారు.

అప్పుడు శివుడు ఇలా అంటాడు ….”సత్యమే శాశ్వతం. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వారే శాశ్వతులు” అని. అంతే కాకుండా తనకన్నా ఎక్కువ క్షేత్రాలు ఏర్పడతాయని, పూజలు అందుకుంటావని విష్ణువుతో చెప్పిన శివుడు బ్రహ్మతో “నువ్వు నీ అసత్య దోషంవల్ల ఎక్కడా పూజార్హుడవు కాకుండా పోతావు. అయినా నువ్వు నా భక్తుడవు కనుక నీకు ఒక వరం ఇస్తాను. యజ్ఞ యాగాదులైన వేదోక్త క్రతువులలో నువ్వు బ్రహ్మగా, గురువుగా తగిన గౌరవాన్ని అందుకుంటావు” అంటాడు.

పాపపరిహారానికి శివ నామ స్మరణ కన్నా మరో సులభమైన ఉపాయం లేదు.

ప్రదోష కాలాన అంటే సంధ్యాసమయాన శివ శివ అని అనుకుంటే పాపాలన్నీ పోతాయి.

శివ ధ్యానం గానీ శివ దర్శనం కానీ పరమ పవిత్రం. భగవంతుడు మనిషికి మాట్లాడే శక్తి ఇవ్వడం నామస్మరణకు కూడా. కనుక నిరంతరం శివ నామ స్మరణ తో ముక్తి పొందవచ్చని అనుభవజ్ఞుల మాట.

– ఆదిమూలం సుమతి

Send a Comment

Your email address will not be published.