జగమంత ఎదిగిన జనరంజని

మూడున్నర గంటల కాలం ఏకబిగువున పరాయి గడ్డపై పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన సంస్కృతికి జీవం పోసిన తెలుగు బిడ్డలందరూ ధన్య జీవులు. అతిధులుగా వచ్చిన స్థానికులు అవాక్కై కొన్ని వేల సంవత్సరాల సంస్కృతీ సంప్రదాయాలు ఎల్లలెరుగకుండా ఎదుగుతోందంటే ఈ గొప్పదనం తెలుగుదనంలో వుందా లేక తెలుగు వారిలో వుందా అన్న ప్రశ్న వేసుకోక తప్పదు. భారతీయ సంస్కృతి ఒక జీవన విధానమని వేరే చెప్పక్కర్లేదు. ఎన్ని ఎత్తు పల్లాలు ఒడుదుడుకులు చూసినా ఒక నదీ ప్రవాహంలా ఎన్నో వాగు వంకల్లాంటి మతాలను తనలో మమేకం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న మన సాంప్రదాయం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్లే నిలబడుతోంది.

మెల్బోర్న్ తెలుగు సంఘం నిర్వహించిన “జనరంజని” కార్యక్రమం ఈ నెల 22 వ తేదీన అంగరంగ వైభవంగా స్ప్రింగ్ వేల్ టౌన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “తెలుగు బడి” అక్షర జ్యోతి లో చదువుకుంటున్న పిల్లలు పాల్గొన్న “వందేమాతరం ” తో కార్యక్రమం మొదలైంది. తరువాత “రచనా నాట్యాలయ” నృత్య కళాశాలకు చెందిన పిల్లలు “స్వాగతం” కార్యక్రమం ప్రదర్శించారు. విజయ మాగంటి మరియు ఉమా పిల్లుట్ల గార్లు సమన్వయించిన “టాలీవుడ్ గాంగ్నమ్” ప్రదర్సన, నీతు కంసే మరియు శిరీష తుమలపల్లి గార్లు నిర్వహించిన “రాకింగ్ రాబిట్జ్” ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి.

తరువాత “అందెల సవ్వడి” శ్రీదేవి చెల్లపల్లి మరియు దీపిక యానం గార్ల అధ్వర్యంలో, “ఐ యాం ఎ గుడ్ గర్ల్” (రూప రెడ్డివారి, శ్వేత ఇందుకూరి, సిరి ఇందుకూరి), “టోలీ ఛార్జర్స్” (శ్రీవల్లి పెమ్మరాజు, గిరీష్ చేకూరి), “మెల్బోర్న్ మెరుపులు” (మధూలిక పసుమర్తి), “టాలీవుడ్ బాల్రూం డాన్సు” (అశోక్ చావలి) నిర్వహణలో జరిగాయి.

“అలనాటి చలన చిత్ర నటీమణులు” శీర్షికన తెలుగు లేడీస్ క్లబ్ వారు ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హేమ దోగుపర్తి మరియు రజని చినపల్లి గార్ల అధ్వర్యంలో జరిగింది. “మెగా మేజిక్” అనే ఐటెం తో మొదటి భాగం పూర్తీ అయింది.

తరువాత భాగంలో VCE లో అత్యధికంగా మార్కులు సంపాదించిన పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది.

మూవీ బాక్స్


తెలుగు సినిమా 80 సంవత్సరాల సందర్భంగా 1960 నుండి 2000 వరకు కొన్ని చలన చిత్రాలలోని రసవత్తరమైన హాస్య సన్నివేశాలతో పాటు కొన్ని ప్రేమ సందేశం అందించే పాటలతో కూడుకున్న 45 నిమిషాల “మూవీ బాక్స్” జనరంజని కార్యక్రమానికి కలికి తురాయి.  ఇందులో ముఖ్యంగా స్వర్గస్తులైన ఎంతో మంది నటులు, నటీమణులను గుర్తుకు తెచ్చే సన్నివేశాలు అత్యద్భుతంగా ప్రదర్శించి మెల్బోర్న్ నగరం కళలకు మరియు కళాకారులకు నిలయమనే సార్ధకతను నిలబెట్టుకున్నారు.

ఈ మూవీ బాక్స్ సమన్వయకర్త గ వ్యవహరించిన శ్రీమతి అనూరాధ మునుగంటి మాట్లాడుతూ సాధారణంగా సినిమా పాటలు మరియు డాన్సులు చేయడానికి భిన్నంగా ఈ సంవత్సరం సరిక్రొత్త పంథాలో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు చెప్పారు.  కొన్ని చలనచిత్రాల నుండి రసవత్తరమైన ఘట్టాలను తీసుకొని ప్రదర్శించటం జరిగిందన్నారు.  వీటిలో ముఖ్యంగా మిస్సమ్మ, మాయాబజార్, అః నా పెళ్ళంట, తమ్ముడు, జీన్స్, రచ్చ, బలుపు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, ఆత్మబలం, రెండు రెళ్ళు ఆరు, బొమ్మరిల్లు, బాద్ష, రాముడు కాదు కృష్ణుడు మొదలైన చిత్రాల నుండి పాటలు సన్నివేశాలు ప్రదర్శించి ప్రేక్షకుల మెప్పు పొందారు.

అయితే కదాంశాలు ప్రక్కన పెడితే ఎంతో మంది కళాకారులూ, పాత్రధారులు ఉదాహరణకి శ్రీ రావు గోపాలరావు, శ్రీ బ్రహ్మానందం, శ్రీ రాజేంద్ర ప్రసాద్, శ్రీ గొల్లపూడి, శ్రీమతి సావిత్రి, శ్రీ రేలంగి, శ్రీ ఎన్టీఆర్ మరియు శ్రీ ఎ ఎన్ ర్ వంటి మహా నటుల నటించిన పాత్రలకు జీవం పోసారంటే అతిశయోక్తి కాదు.

చిరస్మరణీయం
మెల్బోర్న్ తెలుగు సంఘం మూడున్నర గంటలలో దివ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించి తరువాత పసందైన భోజన ఏర్పాట్లు చేయడం ఎంతో అభినందించా దగ్గ విషయం.  ఈ మధుర స్మృతుల జనరంజని తెలుగు సంఘం చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందనే ఆశిద్దాం.

Send a Comment

Your email address will not be published.