జనరంజని

ప్రతి సంవత్సరం మెల్బోర్న్ లోని తెలుగు వారందరూ ఎదురు చూసే “జనరంజని” కార్యక్రమం రానే వచ్చింది. తెలుగు సంఘం వారు నిర్వహించే ఈ కార్యక్రమం తెలుగు వారందరికీ ఒక కుటుంబం లో జరిగే పెళ్లి సందడి లాంటిది. ఇందులో పాల్గొనే వారికి ఎల్లలంటూ వుండవు. మెల్బోర్న్ నగరంలోని నలు దిక్కుల నుండి పరుపరుగన వచ్చి ఏదో ఒక రూపంలో కార్యక్రమ విజయానికి తోడ్పడడం అందరి ధ్యేయం.

“జనరంజని” లో పాల్గొనే వారికి వయసుతో నిమిత్తం లేదు. ఒక సంవత్సరం వయసు నుండి 70 సంవత్సరాల వయసు వారందరూ రంగస్థలం పైన, తెర వెనుక షుమారు 3 నెలలు అహర్నిశలు కృషి చేసి ఈ కార్యక్రమ పేరుని సార్ధకం చేస్తూ ఎంతో “జనరంజకంగా” నిర్వహణ బాధ్యతలు చేపట్టడం తెలుగు వారందరికీ గర్వ కారణం.

ఇంచుమించుగా 200 మంది చిన్నా పెద్దలు, సమన్వయ కర్తలు ప్రతీ వారాంతం తమ విలువైన కాలాన్ని వెచ్చించి పలు రకాలైన నృత్య రూపకాలు, నాటికలు, డాన్సులు, ఇలా 64 కళల్లో వీలైనన్ని కళలు ప్రదర్శించటానికి ప్రయత్నిస్తారు. ఈ 4 గంటల కార్యక్రమానికి, ముందు 3 నెలలు తరువాత కార్యక్రమ వివరాలను నెమరు వేసుకుంటూ మరో 3 నెలలు తెలుగు సంఘంలోని పలు కుటుంబాలు సంఘీ భావంతో ఈ తెలుగు సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో ముదావహం.

తలిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతో శ్రమకోర్చి షుమారు 30 కిలోమీటర్ల దూరం నుండి రిహార్సల్స్ కి తీసుకు రావడం, తరువాత తరం వారికి మన సంస్కృతీ సంప్రదాయాలు అందివ్వాలన్న తపన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. తరతరాల మన తెలుగుని తరగని వెలుగుగా మన తరానికి తరువాత తరానికీ అందివ్వాలన్న అకుంటితమైన పట్టుదల వీరిలో కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.

ఇతర కార్యక్రమాలతో పాటు ఈ సంవత్సరం ముఖ్యంగా 80 వసంతాల తెలుగు సినిమా పురస్కరించుకొని “మూవీ బాక్స్” అనే 45 నిమిషాల నిడివి గల సినీ వినోద కార్యక్రమం ప్రదర్శిస్తున్నట్లు తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ పవన్ మటంపల్లి తెలిపారు. ఇందులో పాత సినిమా పాటలు, హాస్య సన్నివేశాలు నుండి ఆధునిక సినిమాల వరకూ అన్ని వయసుల వారూ వైవిధ్యమున్న అంశాలను ప్రదర్శించడం విశేషం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత మంది తెలుగు వారు వీక్షించి విజయంతం చేయగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.

Send a Comment

Your email address will not be published.