జపాన్ చూపు అమరావతి వైపు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యంత ఆధునికంగా నిర్మించడానికి సింగపూర్ ఆసక్తి చూపిస్తున్నట్టే, అమరావతిలో పలు పరిశ్రమలను స్థాపించడానికి జపాన్ ఆసక్తి చూపిస్తోంది. జపాన్ పెట్టుబడుల కోసం ఇటీవల ఆ దేశానికి వెళ్ళిన ప్రతినిధి వర్గానికి టోక్యో తదితర నగరాల్లో అపూర్వమయిన ఆదరణ లభించింది. ఈ ప్రతినిధి వర్గానికి రాష్ట్ర ఇంధన, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి అజయ్ జైన్ నేతృత్వం వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తన స్వస్థలంగా భావిస్తున్నట్టు జపాన్ ప్రధాని షింజో అబేతో తనతో స్వయంగా చెప్పినట్టు అజయ్ జైన్ తెలిపారు. కొత్త రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములుగా ఉంటామని అబేతో చెప్పారు. ఆ దేశంలోని అనేక దిగ్గజ కంపెనీలు అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావడానికి ముందుకు వచ్చాయని జైన్ తెలిపారు. తనతో చర్చించిన కంపెనీల్లో మిత్సుబిషి, మేకావో, యుకహోమా, సుమితోమి, నేదో, మిజ్హో బ్యాంకు, తోషిబా, ఫిజీలు ఉన్నాయని జైన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదర్చుకోవడానికి ఈ సంస్థల ప్రతినిధులు ఇక్కడికి రాబోతున్నాయని కూడా ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోర్టుల నిర్మాణానికి యుకహోమా ముందుకు రాగా, పారిశ్రామిక పార్కులు, హై స్పీడ్ రైళ్ళు, స్మార్ట్ విద్యుత్ గ్రిడ్ లను ఏర్పాటు చేయడానికి మరికొన్ని సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని జైన్ తెలిపారు.

Send a Comment

Your email address will not be published.