జయహో సింధు!

PV Sindhuప్రతి క్రీడాకారుడో లేదా క్రీడాకారిణో కనీసం ఒక్కసారైనా ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ లో పోటీపడాలని అనుకుంటారు. అలా పోటీలో పాల్గొనడమే కాకుండా ఒక పతకం గెల్చుకొస్తే ఇక ఆ ఆనందానికి హద్దులుండవు. పైగా కరణం మల్లీశ్వరి తర్వాత మరో పతకం సాధించిన అమ్మాయిగా పీ వీ సింధు ఇప్పుడు రికార్డు సృష్టించడం ముదావహం. ఈ క్రమంలో కరణం కన్నా ఓ మెట్టు ఎక్కువే సాధించింది పీ వీ సింధు. కరణం వెయిట్ లిఫ్టింగులో కాంస్యం గెల్చుకుంటే ఇప్పుడు సింధు బాడ్మింటన్ లో రజతం దక్కించుకోవడం విశేషం.

చివరి వరకు పోరాట పటిమ:
రియో ఒలింపిక్స్ లో ఆగస్టు 19 వ తేదీన జరిగిన బాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ లో సింధు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకర్ కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) తో తలపడింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలో పదో ర్యాంకర్ సింధుపై మారిన్ 21-19, 12-21, 15-21తో గెలిచి స్వర్ణపతకం అందుకుంది. ఈ పొటీ మొత్తం 83 నిముషాలు సాగింది. సింధు ఆఖరి క్షణం వరకు పోరాడింది…. కానీ రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన మారిన్‌ను ఓడించలేకపోయింది. ఆమె అనుభవ ధాటికి ఎదురాడలేకపోయింది.
అయినప్పటికీ తన పోరాటపటిమతో సాధించిన రజతపతకంతో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తదితరుల ప్రశంసలు అందుకుంది సింధు. హైదరాబాదులో ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ విజయంలో ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్రను సింధు ప్రత్యేకించి మననం చేసుకుంది.

తండ్రి ఆనందం:
సింధు తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనడంతో సింధు కల నెరవేరిందని, అంతటితోనే మురిసిపోకుండా ఆమె పతకంతో తిరిగి వస్తున్నదని, ఈ ఆనందాన్ని తాను మాటల్లో వర్ణించలేనని అన్నారు. షటిల్‌లో ఇప్పటి వరకు మన దేశానికి రజత పతకమే రాలేదని, ఆ కలను సింధు సాధ్యం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు.
పశ్చిమ గోదావరిజిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో శ్రీరాట్నాలమ్మవారికి ఆయన కుంకుమ పూజ చేశారు. తమ తాతముత్తాతలది ఏలూరు అని, ఉద్యోగరీత్యా తన తండ్రి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌కు వెళ్లారని, తాను అక్కడే పుట్టానని రమణ చెప్పారు.
ఇలా ఉండగా ఇదే ఒలింపిక్స్ లో పోటీపడి పతకం కోల్పోయిన అభినవ్‌ బింద్రా మాట్లాడుతూ, తాను పతకం కోల్పోయినప్పటికంటే సింధు స్వర్ణం కోల్పోయినప్పుడు తన గుండె బద్దలైనంత బాధ కలిగినట్టు చెప్పారు. ఆమె ఆట తీరు అద్భుతమని పొగిడారు.
అయిదు సార్లు ప్రపంచ చదరంగం చాంపియన్ గా నిలిచిన విశ్వనాథన్‌ ఆనంద్‌ మాట్లాడుతూ సింధు ప్రదర్శన ఎంతో గొప్పగా ఉందని తన అభినందనలు తెలిపారు.

అభినందనల వెల్లువ:
మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ దర్శకుడు రాజమౌళి తదితరులు కూడా సింధు కు అభినందనలు తెలిపారు.

బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తి:
రియో ఒలింపిక్స్ లోతాజాగా రజత పతకం సాధించి రికార్డు నెలకొల్పిన పీ వీ సింధు పూర్తి పేరు పుసర్ల వెంకట సింధు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినా సింధు పీ వీ రమణ, విజయ దంపతులకు 1995 జూలై అయిదవ తేదీన జన్మించింది.
కుడి చేతి వాటం క్రీడాకారిణి అయినా సింధు హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో గల సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థిని. 5 అడుగుల 10 అంగుళాల ఎత్తున్న సింధు ఇప్పటి వరకు మొత్తం 270 సింగల్ మ్యాచ్ లు ఆడి 184 విజయాలు సాధించింది. 86 మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ ఒక్క ఏడాదిలో ఆమె ఇప్పటివరకు అంటే ఆగస్టు 19 వ తేదీ వరకు 36 సింగిల్స్ మ్యాచ్ లు ఆడి 23 విజయాలు సాధించింది. 13 మ్యాచుల్లో ఓటమి చవి చూసింది.

వంశ పారంపర్యం:
తల్లిదండ్రులు కూడా క్రీడాకారులు కావడం గమనార్హం. వాలీబాల్ ప్లేయర్లు. 2000 సంవత్సరంలో రమణ అర్జున్ అవార్డు పొందగా ఆయన కుమార్తె సింధు 2013 లో ఈ అవార్డు పొందింది. మరో రెండేళ్లకు 2015 లో సింధు పద్మశ్రీ అవార్డుని భారత ప్రభుత్వం నుంచి అందుకుంది.

పుల్లెల గోపీచంద్ స్పూర్తి:
కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి స్ఫూర్తి పొందిన సింధు బాడ్మింటన్ క్రీడలోకి అడుగుపెట్టింది.

ఆమె తన ఎనిమిదో ఏట ఆడటం మొదలుపెట్టింది.

ఆమె మొదట మెహ్ బూబ్ అలీ దగ్గర ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ టెలీకమ్యూనికేషన్స్ (సికందరాబాద్) కోర్ట్స్ లో బాడ్మింటన్ లో ఓనమాలు నేర్చుకుంది. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో చేరి తన క్రీడాజీవితంలో అంచెలంచేలుగా ఎదిగిన సింధు ప్రతి రోజు కోచ్ రమ్మన్న సమయానికల్లా ప్రాక్టీసుకి వెళ్ళేది. ఏ రోజు టైం తప్పేది కాదు. తన ఇంటి నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రౌండ్ కి వెళ్లి నేర్చుకునేది. దీనిని బట్టే ఆమెకు బాడ్మింటన్ పట్ల ఉన్న ఆసక్తిని, శ్రద్ధను గుర్తించవచ్చు. ఆ అంకితభావమే ఇప్పుడు ఆమెకు ఈ రజత పతకం సాధించిపెట్టింది.
ఆమె ఆటలో ప్రధానమైన లక్షణం చివరివరకు శ్రమించడమే అని గోపీచంద్ అంటూ ఉంటారు.

చివరి పాయింట్ వరకు ఆమె శక్తివంచన లేకుండా పోరాడుతుందని ఆయన అభివర్ణించారు.

గోపీచంద్ అకాడమీలో చేరిన తర్వాత ఆమె టైటిల్స్ వేట మొదలైంది. ఆమె తొలుత పదేళ్లలోపు విభాగంలో అయిదవ ఆల్ ఇండియా ర్యాంకింగ్ చాంపియన్ షిప్ లో డబుల్స్ క్యాటగిరీలో టైటిల్ గెల్చుకుంది. సింగిల్స్ లో పదమూడేళ్ల లోపు సింగిల్స్ విభాగంలో అంబుజా సిమెంట్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్ లో మొదటి టైటిల్ గెల్చుకుంది. అప్పటి నుంచి దాదాపుగా ప్రతి క్యాటగిరీలో గెలుస్తూ వచ్చిన సింధు మరో నాలుగేళ్ల తర్వాతైనా ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించాలని ఆశిద్దాం.

వరాల జల్లు
ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ పోటీల్లో రజత పతకం సాధించిన పూసర్ల వెంకట సింధుకు అయిదు కోట్ల రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనితో పాటు హైదరాబాద్ నగరంలో వెయ్యి గజాల స్థలం, చేస్తానంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో నగరానికి వస్తున్న ఈ రజత తారకు ప్రభుత్వం తరఫున ఘనంగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, రజత పతక విజేత సింధుకు మూడు కోట్ల రూపాయల నజరానా ఇస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. రాష్ట్ర మంత్రి వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఆమెకు వెయ్యి గజాల స్థలం, గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆమెకు శిక్షణ ఇఛ్చిన పుల్లెల గోపీచంద్ కు కూడా రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించింది.

Send a Comment

Your email address will not be published.