'జయ' నామ సంవత్సర ఫలితాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం)
ఆదాయం 14, వ్యయం 2, రాజ పూజ్యం 5, అవమానం 5

ఈ ఏడాది మేష రాశి వారు వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిర, చరాస్తులు పెంపొందుతాయి. కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. విద్యార్ధులు లక్ష్యాలు సాధిస్తారు. స్నేహ, బాంధవ్యాలు పెంపొందుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తి పరంగా స్థాన చలనానికి అవకాశం ఉంది. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, ఏజెన్సీలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరం. డిసెంబర్ 9 నుంచి ఉగాది వరకు గురువు వక్రించిన కారణంగా విద్యార్ధుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపే సందర్భంలో జాగర్తలు తీసుకోవాలి. సోదరి సోదరుల విషయాల్లో మాట పడవలసివస్తుంది. ఆర్ధిక విషయాల్లో మధ్య వర్తిత్వం తగదు. రుణాలు ఇస్తే తిరిగి రావడం కష్టం. ఆంజనేయ స్వామి ఆరాధన ఈ ఏడాది మంచి ఫలితాలు ఇస్తుంది.

వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు)
ఆదాయం 8, వ్యయం 11, రాజ పూజ్యం 7, అవమానం 5

గురు, శని, రాహువు కేతువులు సంచారం ఆధారంగా వృషభ రాశి వారికి ఈ ఏడాది ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రమోషన్ లపై వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. రుణ సమస్యలు తొలగిపోతాయి. విద్యార్ధులు పట్టుదలతో కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్ రంగాల వారు అదనపు బాధ్యతలు తలేత్తుకోవలసి వస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. తీర్ధ యాత్రల పట్ల ఆసక్తి చూపిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ల లావాదేవీలు లాభాలు ఇస్తాయి. స్వల్ప సమస్యలు ఎదురైనప్పటికి ఏకాగ్రతతో పనులు పూర్తి చేస్తారు.
ఈశ్వరుడిని ఆరాధించడం వాళ్ళ ఈ ఏడాది శుభ ఫలితాలు సాధిస్తారు.

మిధునం (మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 1

మిధునం వారికి ఈ ఏడాది ఆర్ధిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ప్రమోషన్లు, బదిలీలకు అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. జీతభత్యాలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. గృహ నిర్మాణం, స్థల సేకరణకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు పురోగతికి ఉపయోగపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేసుకుంటూ అదనపు అర్హతలు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో చికాకులు తొలగిపోతాయి. ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్ధిక అస్తిరత్వం లోపిస్తుంది. విలాసాలు, ప్రయాణాలకు ఖర్చులు అధికం.
సుబ్రమణ్య స్వామీ ఆరాధన ఈ ఏడాది శుభ ఫలితాలను ఇస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 5, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1

కర్కాటక రాశి వారికి ఈ ఏడాది వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ గమనం, ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్ మీద వేరే చోటకు బదిలీ అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులకు అనుకూలం. స్నేహను బంధాలు విస్తరిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. ఆర్ధిక విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే డిసెంబర్ 9 నుంచి నాలుగు మాసాలపాటు గురువు వక్రించినందున ఆర్ధిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చదువుల పట్ల శ్రద్ధ చూపించాలి. విలాసాలకు ఖర్చులు అధికం. సినిమా, ఫోటోగ్రఫీ రంగాలవారికి ఎదురయ్యే అవకాశం ఉంది.
నృసింహ స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4

సింహ రాశి వారికి ఈ ఏడాది అని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందమయంగా సాగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహ అనుబంధాలు విస్తరిస్తాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. బృంద కార్యక్రమాల్లో అనవసరమైన ఖర్చులు అధికం. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్ధులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. కుటుంబం, ఆస్తులు, ఆరోగ్య విషయాల్లో కొంత మెరుగైన వాతావరణం కనిపిస్తుంది. ఒత్తిళ్ళు అధికం. సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బందిపడతారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
సూర్య గ్రహ ఆరాధన వల్ల ఈ ఏడాది మంచి ఫలితాలు చేకూరుతాయి.

కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2 పాదాలు)
ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 5

కన్య రాశిలో పుట్టిన వారు ఈ ఏడాది వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్ధిక విషయాలపై ఎక్కువగా దృష్టి సారిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకార రంగాలవారికి ప్రోత్సాహకరం. ఇంట్లో వివాహాది శుభ కార్యాలు జరుగుతాయి. అనుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. శత్రువు కూడా మిత్రులు అవుతారు. పెట్టుబడులు ఆశించినంతగా లాభించకపోవచ్చు. మనశ్శాంతి లోపిస్తుంది. స్థిరచర ఆస్తులు సమకూర్చుకుంటారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. రాహు, కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి.
రాఘవేంద్ర స్వామి ఆరాధన శుభ ఫలితాలు ఇస్తుంది.

తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు)
ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 1

ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు సంచారం పరిశీలిస్తే తులారాశి వారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్ధులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థల మార్పిడికి, ప్రమోషన్లు అవకాశం ఉంది. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ టి రంగాలవారికి ప్రోత్సాహకరం. గురువు వక్రగమనంలో ఉండే డిసెంబర్ 9 నుంచి నాలుగు మాసాల పాటు ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి ఫలితాలు వస్తాయి. మనశ్శాంతి లోపించిన కారణంగా మరిన్ని పొరపాట్లు చేస్తారు. పై అధికారులనుంచి మాట పడవలసి వస్తుంది.
వేంకటేశ్వర స్వామి ఆరాధనా ఈ ఏడాది మంచి ఫలితాలు ఇస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ట)
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 4

వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ ఏడాది ఉగాది నుంచి జూలై వరకు ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆస్తి పాస్తులు పెంపొందించుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారసత్వ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలలో పని చేసే వారికి, రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాలు, ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కోర్టు వ్యవహారాలూ పరిష్కారం అవుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. జూలై 21 నుంచి నవంబర్ 2 వరకు ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు కావడం కష్టం. ప్రయాణాల్లో జాగర్తగా ఉండాలి. ప్రకటనలు, మీడియా రంగాలలోని వారికి శుభప్రదం. మానసిక శాంతికి గురయ్యే అవకాశం ఉంది.
లక్ష్మీ దేవి ఆరాధన వల్ల సుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం)
ఆదాయం 2, వ్యయం 11, రాజపోజ్యం 7, అవమానం 7

ధనుస్సు రాశివారికి ఈ ఏడాది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు. ఇంట్లో వివాహాది సుభ కార్యాలు జరుగుతాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరం. పెట్టుబడులు, పొదుపు పధకాలు లాభిస్తాయి. సన్నిహితులను కలుపుకుని పది మందికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారు. డిసెంబర్ నుంచి ఈ ఏడాది చివరి నాలుగు మాసాల పాటు శ్రీవారు, శ్రీమతి లేదా భాగస్వాముల మధ్య అపోహలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. లక్ష్య సాధనలో ఆలస్యాలు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు న్చనాలను మించిపోతాయి. పిల్ల పట్ల అశ్రద్ధ చూపి ఆ తర్వాత బాధపడతారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. సోదరి సోదరుల మధ్య చిన్నపాటి తగాదాలు తలెత్తే అవకాశం ఉంది.
దుర్గా దేవి ఆరాధన వల్ల ఈ ఏడాది మంచి ఫలితాలు పొందుతారు.

మకరం (ఉత్తరాషాడ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు)
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 2

ఈ ఏడాది మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సాధిస్తారు. వ్యాపార రంగాల వారు అధిక లాభాలు గడిస్తారు. ఆస్తి పాస్తులు సమకూర్చుకుంటారు. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వైద్య రంగం వారికి శుభప్రదం. శత్రువులపై విజయం సాధిస్తారు. జన సంబంధాలు విస్తరిస్తాయి. రాజకీయ రంగంలోని వారికి విజయం చేకూరుతుంది. అయితే డిసెంబర్ నుంచి సంవత్సరంలో చివరి నాలుగు మాసాల్లో లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. శత్రు బాధ అధికం. ఆర్ధిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మధుమేహం సమస్య ఉన్న వారు తగిన జాగర్తలు పాటించాలి. ఉద్యోగంలో మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఒత్తిడికి లోనవుతారు. ధ్యాస తగ్గడంతో పనులు పూర్తి చేయడంలో సమయం వృధా అవుతుంది. మనశ్శాంతి లోపిస్తుంది.
పార్వతి దేవి ఆరాధన వల్ల ఈ ఏడాది సుభాఫలితాలు సాధిస్తారు.

కుంభం (ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు)
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 9

కుంభ రాశి వారికి ఈ ఏడాది చదువులు ఆర్ధిక విషయాలు, వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గురువు 5 – 6 స్థానాల్లో సంచరిస్తున్న కారణంగా ఈ ఏడాది మొదటి ఆరు మాసాల్లో విద్యార్ధులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబం విస్తరిస్తుంది. ఆర్ధిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి విద్యా కోర్సులకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. ప్రమోషన్లకు వ్యాపార విస్తరణకు అవక్కాశం ఉంది. డిసెంబర్ 9 తర్వాత నాలుగు మాసాల పాటు ప్రేమ వ్యవహారాలూ బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ప్రియతములు దూరమవుతారు. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిళ్ళు అధికం. శ్రమకు తగిన ఫలితం అందకపోవడంతో నిరుత్సాహ పడతారు. గృహ విషయాల్లో సామరస్య ధోరణి కొరవడుతుంది. విద్యార్ధులకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో చిక్కులు ఎదురవుతాయి.
కామాక్షి దేవి ఆరాధన వల్ల ఈ ఏడాది మెరుగైన ఫలితాలు కలుగుతాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరా భాద్ర,రేవతి)
ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 9, అవమానం 2

ఈ ఏడాది గురు, శని, రాహు కేతువుల సంచారం ఆధారంగా మీన రాశి వారు స్థల సేకరణ, గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ వ్యవహారాలూ, ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. పరిచయాలు లాభిస్తాయి. సొంత ఇంటి కల ఫలిస్తుంది. వాహన యోగం కలుగుతుంది. బంధువుల తాకిడి అధికంగా ఉంటుంది. అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. ఆస్తుల క్రయవిక్రయాల్లో ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలూ బెడిసికొట్టే ప్రమాదం ఉంది. పొదుపు పథకాలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. ఆరోగ్యం మందగిస్తుంది. స్నేహ బాంధవ్యాలు విస్తరిస్తాయి. కానుకలు, బహుమతులు అందుకుంటారు. పెద్దల సహకారంతో ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. ఖర్చులు అంచనాలు మించుతాయి.
గణపతిని ఆరాధించడం వల్ల శుభఫలితాలు సాధిస్తారు.

– రాజశుక

Send a Comment

Your email address will not be published.