జాతీయ చలన చిత్ర అవార్డులు

K Vishwanath movies
భారతదేశ సినీ రంగంలోనే అత్యున్నత పురస్కారం అయిన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును “కళాతపస్వి” కె. విశ్వనాథ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2017 మే 3 వ తేదీన జరిగిన 64వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ఆయా గ్రహీతలకు రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.

K Viswanathఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, స్వర్ణ కమలం, ప్రశంసాపత్రం అందుకున్నారు.

ఉత్తమ నటుడిగా అక్షయ్‌ కుమార్, ఉత్తమ నటిగా సురభి అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘పెళ్లిచూపులు’ చిత్ర నిర్మాత రాజ్‌ కందుకూరి, దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రజత కమలం, ప్రశంసాపత్రాలను అందజేశారు.

ఉత్తమ సంభాషణల కేటగిరీ అవార్డును తరుణ్‌ భాస్కర్, ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డును జనతా గ్యారేజ్‌ సినిమాకు రాజు సుందరం అందుకున్నారు.

ఉత్తమ ప్రజాదరణ చిత్రం కేటగిరీ కింద ‘శతమానం భవతి’ సినిమాకు గాను దర్శకుడు సతీష్, నిర్మాత వి. వెంకటరమణారెడ్డి(దిల్‌రాజు)లకు స్వర్ణ కమలం, ప్రశంసాపత్రాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు.

నాన్‌ ఫీచర్‌ చిత్రాల విభాగంలో ఉత్తమ సాహసోపేతమైన అం«శాలపై ‘మతిత్లి కుస్తి’ నిర్మాత మాధవి రెడ్డి రజత కమలం, ప్రశంసా పత్రం.. ఉత్తమ నాన్‌ ఫీచర్‌ చిత్రంగా ‘ఫైర్‌ ఫ్లైస్‌ ఇన్‌ ది ఎబిసిస్‌’ చిత్ర నిర్మాత, దర్శకుడు చంద్రశేఖర్‌ రెడ్డి స్వర్ణకమలం, ప్రశంసాపత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఆయనకు ఈ పురస్కారం అందజేస్తున్నప్పుడు, వివిధ భాషలకు చెందిన వేలాది మంది నటీ నటులు లేచి నిలబడి హర్షధ్వానాలు చేశారు.

కార్యక్రమానికి ముందు కె.విశ్వనాథ్‌పై రూపొందించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం.

ఫాల్కే అవార్డు అందుకున్న అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకుంటున్న ఈ శుభ సందర్భంలో పైనున్న నా తల్లిదండ్రులకు, అంతటా ఉన్న భగవంతుడికి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను” అని చెప్పారు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తదితరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

విశ్వనాథ్‌ను ప్రణబ్‌ ముఖర్జీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశంసించారు.

Send a Comment

Your email address will not be published.