జేబుదొంగ రికార్డు

ముప్పై తొమ్మిదేళ్ళ క్రితంనాటి మాట. ఆంధ్రా అందగాడు అనిపించుకున్న శోభన్ బాబు సినీ రంగంలో ఉన్నంత కాలం ఆ మాటనే సార్ధకం చేసుకుని ముందుకు సాగి నిర్మాతలకు నష్టం రాకుండా నటిస్తూ ఓ మంచి స్థాయిలో ఉన్నప్పుడే తన అంతట తానుగా వెండి తెరకు దూరమైన శోభన్ బాబు పేరిట ఇప్పటికీ ఉన్న రికార్డులలో ఇదొకటి…..

ఆయన హీరోగా నటించేదుకు అంగీకరించిన ఒక చిత్రానికి జేబు దొంగ (1975) అని టైటిల్ పెట్టినప్పుడు ఆ సినిమా సరిగ్గా ఆడకపోవచ్చని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఒక హీరో నెగటివ్ టైటిల్ తో నటించడం అసలు సబబేనా అని ప్రశ్నించారు. ఏదవుతే అది అవనీ అని శోభన్ బాబు జేబు దొంగ టైటిల్ తోనే నటించి విడుదల అయిన ఆ చిత్రం రికార్డు నెలకొల్పింది. ఆ చిత్రం విజయవంతమవడంతోనే ఇతర అగ్ర హీరోలు కూడా తమ సినిమాలకు నెగటివ్ టైటిల్స్ కు సమ్మతించారు. శోభన్ బాబు జేబుదొంగ హిట్టైన తర్వాత దాదాపుగా అందరు హీరోలు దొంగ అనే టైటిల్ తో సినిమాలు చేసారు.

జేబుదొంగ సినిమా విడుదల అయిన ఏడు కేంద్రాలలో థియేటర్ మారకుండా వంద రోజులు, ముప్పై కేంద్రాలలో థియేటర్ మారకుండా మూడేసి ఆటలతో యాభై రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ రికార్డును బద్దలు కొట్టిన సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ.

శోభన్ బాబుతోపాటు జయసుధ, మంజుల నటించిన చిత్రమిది. దీనిని సమతా ఆర్ట్స్ వారు సమర్పించారు. మధుసూదన రావు దర్శకత్వం వహించారు. చక్రవర్తి సవరాలు అందించారు. ముళ్ళపూడి వెంకటరమణ రచన చేయగా ఆత్రేయ, ఆరుద్ర పాటలు రాసారు.

సంగం ఏ సి (హైదరాబాదు), శ్రీరాం ఏ సి (నెల్లూరు), కృష్ణా పిక్చర్ ప్యాలస్ (గుంటూరు), అలంకార్ (తెనాలి), అప్సర (రాజమండ్రి), సూర్య మహల్ (శ్రీకాకుళం), మనోరమ (విశాఖపట్నం) లలో జేబుదొంగ సినిమా థియేటర్ మారకుండా వంద రోజులు ఆది రికార్డు పుటలకెక్కింది.

విడుదల అయిన మొదటివారంలో 16,15,022 రూపాయలు వసూలు చేసి తెలుగు చిత్రపరిశ్రమలో మొదటి వారం ఇంతటి కలెక్షన్ లతో రెండవ స్థానంలో నిలిచిన సినిమా జేబుదొంగ. రెండవ వారంలో తొమ్మిది లక్షల రూపాయలు వసూలయ్యాయి.

మొదటి రెండు వారాలలో ఇరవై అయిదు లక్షలకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం జేబుదొంగ.

జేబుదొంగ విడుదల అయిన అన్ని కేంద్రాలలో అన్ని షోస్ మొదటి నాలుగు రోజులు హౌస్ ఫుల్ అవడం ఒక రికార్డు.

మూడవ వారంలో ఆరు లక్షల రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం జేబు దొంగ.

విడుదలైన మొదటి మూడు వారాలలో మొత్తం ముప్పై ఒక్క లక్షల రూపాయలు వసూలు చేసి మరో రికార్డు నెలకొల్పింది.

కాకినాడలో పెద్ద థియేటర్ లు అయిన దేవి 70 ఎం ఎం , పద్మప్రియ ఏ సి లలో మొదటి ఎనిమిది రోజులకు లక్ష రూపాయలు వసూలు చేసి చరిత్రను తిరగ రాసిన తొలి చిత్రం జేబుదొంగ. నిజానికి కాకినాడలో అప్పట్లో ఒక ప్రముఖ హీరో సినిమా విడుదల అయ్యేటప్పుడు ఈ రెండు థియేటర్ లలో ఒక్క దాంట్లో మాత్రమే విడుదలకు ఒప్పుకునే వారు. కానీ జేబుదొంగ సినిమా మాత్రం అప్పట్లో ఈ రెండు థియేటర్ లలో విడుదల అయి అనుకోని వసూళ్లతో రికార్డు సృష్టించింది.

శ్రీకాకుళంలో ఒక తెలుగు హీరో సినిమా వంద రోజులు ఆడిందంటే అది ఈ జేబుదొంగ సినిమానే.

ఒరిస్సాలోని పర్లాకిమిడిలో అలంకార్ అనే థియేటర్ లో ఈ సినిమా యాభై రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు నెలకొల్పింది.

సేకరణ – యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.