"జేమ్స్ బాండ్ " కృష్ణ లాంగ్ లివ్

నన్ను ఆకట్టుకున్న నటులలో ఘట్టమనేని శివరామకృష్ణ ఒకరు. ఆయన తండ్రి వీరరాఘవయ్య. తల్లి నాగరత్నమ్మ. వీరికి అయిదుగురు పిల్లలు. వారిలో కృష్ణ పెద్దవారు. ఆయనకు ఇద్దరు సోదరులు. వారి పేర్లు జీ హనుమంత రావు. జీ ఆదిశేష గిరి రావు. ఆయన చెల్లెళ్ళ పేర్లు అలివేలుమంగమ్మ. లక్ష్మి. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో 1943 మే 31వ తేదీన జన్మించారు. సినీ రంగంలో అడుగు పెట్టిన తర్వాత ఆయన తన పేరును కృష్ణ గా కుదించారు.

వీరిది మధ్య తరగతి కుటుంబం. కాన్వెంట్ స్కూల్ లో చేరే స్తోమత లేకపోవడంతో బుర్రిపాలెంలోనే ఒక మామూలు స్కూల్లో ప్రాధమిక చదువు చదువుకున్న కృష్ణ ఆ తర్వాత తెనాలి, నర్సాపూర్ లలో ఎస్ ఎస్ సి, ఇంటర్ చదువుకున్నారు. ఇక కాలేజీ చదువు కోసం కృష్ణ ఏలూరులోని సి ఆర్ ఆర్ కాలేజీలో చేరారు. అక్కడ ఒకే గదిలో కృష్ణ మరో ఇద్దరితో కలిసి ఉండేవారు. వారే శోభన్ బాబు, మురళీ మోహన్. వీరిద్దరూ నటులు కావాలనే కోరికతో ఉన్న వారే. కాలీజీలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో కృష్ణ చురుగ్గా పాల్గొనే వారు. తర్వాతి రోజుల్లో ఈ ముగ్గురూ ఎవరికి వారు నటులుగా చలామణి కావడం యాదృచ్చికమే.
“చేసిన పాపం కాశికి వెళ్ళినా…” అనే నాటకంలో ఆయన పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. దానితో ఆయనకు నటనపై దృష్టి మళ్ళింది.

డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయనకు పెళ్లి అయ్యింది. 1962 నవంబర్ ఒకటో తేదీన ఇందిరా దేవి అనే ఆమెను వివాహమాడారు. వీరికి 1965 లో రమేష్ బాబు అనే చిన్నారి పుట్టాడు. అప్పుడే ఆయన తేనె మనసులు అనే చిత్రంలో నటించారు. హీరోగా ఆయనకు అది తొలి చిత్రం. అది సూపర్ హిట్టైంది.

ఆ తర్వాత గూడచారి 116, మోసగాళ్ళకు మోసగాడు వంటి చిత్రాల్లో నటించి ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ పెంచుకున్నారు. మోసగాళ్ళకు మోసగాడు అనేది తెలుగులో తొలి కౌ బాయ్ చిత్రం కావడం విశేషం. అందులో ఆయన హీరోగా నటించారు. అనంతరం జేమ్స్ బాండ్ టైపు లో తీసిన ఏజెంట్ గోపి అనే చిత్రంలో నటించడం ద్వారా ఆయన ఆంధ్రా జేమ్స్ బాండ్ గా పేరు సంపాదించారు.

అల్లూరి సీతారామ రాజు చిత్రంలో ఆయన నటించి రికార్డు పుటలకెక్కారు. అది తొలి కలర్ స్కోప్ ఫిలిం గా నమోదైంది.

ఆయన నటించి దర్శకత్వం వహించిన చిత్రాలలో సింహాసనం చిత్రం మొదటిది. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు కూడా. ఇది తొలి 70 ఎం ఎం చిత్రం.

1968 లో కృష్ణ దంపతులకు పద్మావతి అనే కుమార్తె పుట్టింది. ఆ తర్వాత వీరికి మరో ముగ్గురు పిల్లలు పుట్టారు. 1970 లో మంజుల అనే కుమార్తె పుట్టగా, 1975 లో మహేష్ బాబు, 1979 లో ప్రియ దర్శిని పుట్టారు.

1969 లో ఆయన విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళికి ముందు వీరిపై అనేక వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆమెను పెళ్లి చేసుకుని ఆ వార్తలకు తెర దించారు. నటి అయిన విజయనిర్మల దర్శకత్వంలో విశేష ప్రతిభ చూపడమే కాకుండా 2002 లో ఆమె పేరు గిన్నిస్ బుక్ లోకి నమోదు కావడం గమనార్హం.

1983 లో ఆయన తన సోదరులతో కలిసి హైదరాబాద్ లో పద్మాలయా స్టూడియోస్ ని స్థాపించారు.
స్టూడియో స్తాపకుడిగానే కాకుండా నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన కృష్ణ రాజకీయాలను టార్గెట్ చేసి తీసిన అనేక చిత్రాల్లో నటించారు.

రాజీవ్ గాంధీ టైములో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి ఏలూరు నుంచి పోటీ చేసి గెలిచారు కూడా. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత ఆయన చురుకైన రాజకీయాలనుంచి తప్పుకుని చలనచిత్ర రంగంపట్ల తన పర్వాన్నిమళ్ళీ కొనసాగించారు. అలాగే తన కుమారుడు మహేష్ బాబు సినీ కెరీర్ కు ఆయన కృషి చేసారు.

కృష్ణ కుమారుడు మహేష్ బాబు 1993 మిస్ ఇండియా అయిన శిరోద్కర్ ను 2005 లో వివాహమాడారు. వీరిద్దరు కలిసి 1999 లో వంశి అనే చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారు.

కృష్ణ రెండో భార్య విజయనిర్మల కథానాయికగా 47 సినిమాల్లో నటించారు.

కృష్ణ 100వ సినిమా అల్లూరి సీతారామ రాజు. ఇక 200 వ చిత్రం ఈనాడు. 300 వ చిత్రం పేరు తెలుగు వీర లేవరా.

విజయనిర్మలకు మొదటి పెళ్లితో పుట్టిన కొడుకు నరేష్ ను కూడా తన కొడుకుగానే కృష్ణ చెప్పుకోవడం విశేషం. నరేష్ కూడా అనేక చిత్రాల్లో నటించారు.

2009 లో కృష్ణను పద్మ భూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది.

తెలుగు సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు దక్కింది.

తేనెమనసులు ఆయన నటించిన మొదటి చిత్రంగా చాలా మంది అనుకుంటారు. ఈ చిత్రం కన్నా ముందు ఆయన చిన్న చిన్న పాత్రలు వేసారు. కులగోత్రాలు. పదండి ముందుకు అనే చిత్రాలలో ఆయన నటించారు. అయితే ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం మాత్రం తేనెమనసులు.

ఆయన మూడు వందల యాభైకి పైగా చిత్రాలలో నటించినా ఒకే ఒక్క చిత్రంలో మాత్రం విలన్ గా నటించారు. అ చిత్రం పేరు ప్రైవేటు మాస్టారు.

ఎన్టీఆర్ అవార్డు కూడా పొందిన కృష్ణ ఇప్పటికి అనేక కార్యక్రమాలకు విజయనిర్మలతో హాజరవుతూ హుషారుగానే కనిపిస్తూ ప్రసంగించడం చూడవచ్చు.

ఆయన కలకాలం ఆయురారోగ్యాలతో జీవనయానం సాగించాలని ఆశిస్తూ లాంగ్ లివ్ సూపర్ స్టార్ కృష్ణ …లాంగ్ లివ్ …..

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.