జైలుకు జయలలిత

ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడగట్టుకున్న కేసులో తమిళ నాడు ముఖ్యమంత్రి, అన్నా డీ ఎం కె ప్రధాన కార్యదర్శి జె. జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ బెంగలూరులోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. అభిమానులకు అమ్మ, రాజకీయ కార్యకర్తల దృష్టిలో విప్లవ నాయకి, తమిల నాట తిరుగులేని నాయకురాలు, మకుటం లేని మహారాణి అయిన జయలలిత జైలుపాలు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పొరుగు రాష్ట్రమయిన కర్ణాటకలో ఖైదీగా మారారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిలిచారు. ఆమె అక్రమంగా 66.50 కోట్ల రూపాయల మేరకు అస్తులు కూడగట్టుకున్నట్టు తేలింది. ఈ కేసు విచారణ గత 18 ఏళ్లుగా సాగుతోంది. సి బీ ఐ ప్రత్యేక కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసుపై న్యాయ మూర్తి శనివారం తీర్పు ఇస్తూ, ఆమె గనుక 100 కోట్ల జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది జైలులో ఉండాల్సి వస్తుందని చెప్పారు. ఇదే కేసులో నిందితులయిన జయ సన్నిహితురాలు శశి కళ, ఒకప్పటి దత్త పుత్రుడు సుధాకరన్, శశి కళ సమీప బంధువయిన ఇళ వరసిలను కూడా కోర్టు దోషులుగా నిర్ధారించింది. వీరికి కూడా నాలుగేసి ఏళ్ళ చొప్పున శిక్ష పడింది. ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది. దీనితో, జయ మరో పదేళ్ళ వరకూ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. తక్షణమే ఆమె ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోయారు. ఇటువంటి కేసుల్లో కింది కోర్టులు తీర్పు ఇచ్చినప్పుడు హైకోర్టు స్టే ఇవ్వ కూడదని గతంలో సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. అందువల్ల జయకు హై కోర్టు అడ్డుపడే అవకాశం కూడా లేదు.

1991-96 మధ్య తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పుడు జయలలిత అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్నట్టు అప్పుడు జనతా పార్టీ నాయకుడుగా ఉన్న సుబ్రమణ్య స్వామి కేసు వేశారు. జయలలిత 66.50 కోట్ల రూపాయల మేరకు అక్రమంగా ఆస్తులు కూడగట్టుకున్నట్టు ఆ తరువాత సి బీ ఐ దర్యాప్తులు నిర్ధారణ అయింది. నిజానికి, తాను నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకోబోతున్నట్టు ఆమె ప్రకటించారు. సి బీ ఐ అధికారులు ఆమె ఇంటిపై దాడి చేసినప్పుడు, గుమ్మంలోనే బంగారం చెప్పులు కనిపించాయి. ఇక గోడలకు వేలాడదీసిన ఫ్రేముల్లో బంగారం అలంకరణ వస్తువులు దర్శనమిచ్చాయి. 28 కిలోల బంగారం ఆభరణాలు, 78 కిలోల వెండి, 914 పట్టు చీరలు కనిపించాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవికి అర్హత కోల్పోయిన జయ తన స్థానంలో ముఖ్యమంత్రిగా ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం ను నియమించే అవకాశం ఉంది.

రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు అవినీతికి సంబంధించిన కేసులను అతి వేగంగా పూర్తి చేయాల్సిందిగా కేంద్రం న్యాయస్థానాలను కోరడంతో ఇక ప్రతి కోర్టులోనూ ఈ రకమయిన కేసులు వేగం పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.