జోరుగా కోడి పందాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ప్రాంతంలో ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు మళ్ళీ ఊపందుకున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే ఈ పందాలు జరగడం విశేషం. నిజానికి ఈ పందాలను కొంత కాలం క్రితం రాష్ట్ర (ఉమ్మడి) హై కోర్టు నిషేధించింది. అయితే దీనిని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం కోర్టు ‘యథా తథ స్థితిని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో రాష్ట్రంలో కోడి పందాలు మళ్ళీ పెరిగిపోయాయి. కోళ్ళ కాళ్ళకు కత్తులు కట్ట కూడదని కోర్టు చెప్పడంతో కోడి పందాలు సాధారణంగానే జరిగాయి. ఈ ఏడాది పందెం పుంజు రూ. 60 వేల వరకూ పలికింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు హైదరాబాద్ పాత బస్తీ నుంచి కోళ్ళు సరఫరా కావడం చెప్పుకోదగిన విషయం. ఇక్కడ అయిదు వేల రూపాయలు కూడా లేని కోడి దాదాపు లక్ష వరకూ అమ్ముడుపోయింది. కోన సీమలో 15 ప్రాంతాలలో అతి భారీ స్థాయిలో పోటీలు, పందాలు జరిగాయి. ప్రతి బరిలోనూ వేలాదిమంది పందాలు కాశారు. ఈ ప్రాంతాలు తిరునాళ్ళను మరిపించాయి. గోదావరి జిల్లాల్లో అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పందాలను ప్రారంభించారు. ఈ పందాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచే కాక, విదేశీ పర్యాటకులు సైతం తరలి వచ్చారు.

Send a Comment

Your email address will not be published.