జోస్యం నిజమైంది!!

shankaracharya-statue“వందనం మోక్షదాయకం” సాధు పుంగవులకి చేసే నమస్కారం మోక్షాన్ని ప్రసాదిస్తుందని శాస్త్ర వచనం. గురువునకు నమస్కరిస్తే గోవిందునకు నమస్కరించినట్టే. త్రిమూర్తి స్వరూపుడు గురువు. అంతకుమించి త్రిమూర్తులకు మూలమూర్తి అయిన పరబ్రహ్మయే గురువు. గురు పాదారవిందాలకు నమస్కరించే అదృష్టం, అవకాశము నీకు లభించిందంటే అంతకు మించి ఈ జన్మకు కావాల్సింది ఏమున్నది. అహంకారం కనుమరుగై ఆపాటి నమస్కారం చేసే సంస్కారం ఎందరికుంటుందని!…

మహాయోగులు మానవులని సముద్దరించడానికి అవతరించిన మహనీయ మూర్తులు. వారి దర్శన స్పర్శనలు పరమేశ్వర సాక్షాత్కారానికి దారులు. లౌకిక జీవన వ్యామోహాలకు, భౌతిక వాదులకు ఆ మహర్షుల అలౌకిక శక్తులు అంతుబట్టనివి. బ్రహ్మనిష్టుడైన మహర్షికి సిద్ధించే శక్తులు అసాధారణమైనవి. వారి అనుగ్రహానికి పాత్రులు కావడం సామాన్య మానవుని జీవ సంస్కారం మీద, జీవన విధానం మీద ఆధార పడి ఉంటుంది. అంతటా సమంగా, సమగ్రంగా ప్రసరించే సూర్యకాంతిని అద్దం అందుకున్నంతగా మట్టిపెంకు గానీ, నీళ్ళు గానీ అందుకోలేవు కదా! కారణ జన్ములైన మహనీయులు పూవు పుట్టగానే పరిమళించినట్టు తమ ప్రభావాన్ని ప్రదర్శించగలరు. వారి చరిత్రను ఆకళింపు చేసుకోగలిగిన వాడు అదృష్టవంతుడు.

తమిళ ప్రాంతానికి చెందిన విల్లుపుర గ్రామ నివాసి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి. తమిళనాడులో విద్యాశాఖలను పర్యవేక్షించే విద్యాశాఖాధికారి. వారి కుమారులు మువ్వురిలో మధ్యవాడు స్వామినాథన్. చిన్నపటినుంచే కుశాగ్ర బుద్ధిగా అసాధారణ ప్రజ్ఞాశాలిగా ఎదిగిన వాడు. అటు కన్నవారికి ఇటు అధ్యాపకులకు తలలోని నాలుకగా మెలిగిన వాడు. చదువు సంధ్యలలో ఎంత చురుకైన వాడో ఆట పాటలలోనూ అంతే.

ఈ పసివాని జాతకం పరిశీలించి గ్రహస్థితి ననుసరించి భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించింది తండ్రికి. ఆ ఆలోచనతో ఉండగా, వారింటికి జ్యోతిష్యశాస్త్ర పారంగతుడొకరు రావడం తటస్థించింది. కుశల ప్రశ్నల అనంతరం మాటవరుసకు “మా వాని జాతకం కొంచెం పరిశీలిస్తారా?” అని సుబ్రహ్మణ్యశాస్త్రి ఆ జ్యోతిష్య పండితునికి తన కుమార రత్నం జాతకాన్ని అందించారు. అప్పుడు స్వామినాథన్ వీధిలో కుర్రవాళ్ళతో ఆటలాడుకుంటున్నాడు. కుర్రవాని జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యపండితుడు “ఈ పిల్లవాన్ని పిలవండి” అంటూ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కోరారు. వీధిలో పిల్లాణ్ణి పిలుచుకు రావడం కోసం తండ్రి బయటకు వెళ్ళాడు. ఇంతలో జ్యోతిష్యపండితుడు ఆ ఇంటి ఇల్లాలిని పిలిచి “అమ్మా ! ఒక పళ్ళెరం, చెంబుడు నీళ్ళు తెచ్చివ్వండి” అనడిగారు. అలా ఎందుకు అడుగుతున్నారో ఆ ఇల్లాలికి అర్థం కాలేదు కానీ, పిల్లవాణ్ణి సుబ్రహ్మణ్య శాస్త్రి వెంటబెట్టుకు వచ్చే లోపుగా తట్ట, నీళ్ళతో చెంబు సహా సిద్ధపరిచింది.

పిల్లవాడు గుమ్మంలోకి అడుగు పెట్టగనే తలపండిన జ్యోతిష్యుడు ఆ పిల్ల వానిని ఒక కుర్చీలో కూర్చుండమని చెప్పి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తల పై చల్లుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. ఈ తతంగాన్నంతా గమనిస్తున్న దంపతులు విస్తుపోయారు. ఆ వృద్ధ జ్యోతిష్య పండితుడలా తమ కుమారుని కాలిపై పడిపోవడం వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆనందం, భక్తి తాండవిస్తున్న ఆర్ధ్ర నయనాలతో నమస్కారం గావిస్తూ ఆ జ్యోతిష్య పండితులు అలా ఎందుకు చేశారో అర్థం కాక సుబ్రహ్మణ్య శాస్త్రి అడిగేశారు. అప్పుడా పండితుడు ఆయనతో “శాస్త్రి గారూ మీరు అదృష్టవంతులు. మున్ముందు లోకమంతా ఈ పిల్లవాని పాదాలపై మోకరిల్లుతుంది. ఈ పిల్లవాడు లోకోద్ధరణ కోసం అవతరించిన అపరశంకరుడు. ఆదిశంకరుడే ఇలా వచ్చాడన్నా అతిశయోక్తి కాదు. భవిష్యత్తులో ఈ పిల్లవాడు జగద్గురువై జగజ్జనులకు ఆరాధ్యపురుషుడై అలరారుతాడు. ఆనాడు నేను ఈ మహానుభావుని పాదాలను తాకి నమస్కరించుకునేందుకు బ్రతికి ఉండను. అందుకే ఆ చేయవలసిన నమస్కారమేదో ఇప్పుడు చేసుకున్నాను. నా జన్మ ధన్యమైనది” అని వివరించారు.

అలా నమస్కారాలందుకున్న మహనీయుడే కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. వారి నామ స్మరణతో మనమంతా

Send a Comment

Your email address will not be published.