టి. నోట్ ఫై భగ్గుమన్న సీమాంధ్ర

తెలంగాణ ఫై ముందుకే వెళ్ళాలని భావించిన యు.పి.ఎ ప్రభుత్వం టి.నోట్ కు గురువారం ఆమోద ముద్ర వేయడంతో సీమాంధ్ర భగ్గుమంది. బందులు, రాస్తారోకోలతో జన జీవనం స్తంభించి పోయింది. ఉద్యమకారులు తమ ఆందోళనను ఉదృతం చేసారు. మంత్రుల, శాసన సభ్యుల ఇళ్ళను ముట్టడికి ప్రయత్నించారు. సీమంద్ర జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయడంతో పాటు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల ఫై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రాష్ట్ర పి.సి.సి. అద్యక్షుడు బొత్స సత్తిబాబుకి చెందిన కాలేజీలు, కేబుల్ టీవీ కార్యాలయం, ఇంటి పైనా దాడి చేసారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి రెండోసారి కూడా అధికారం కట్టబెట్టినందుకు బహుమానం ఇదేనా అంటూ తీవ్ర ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రోడ్ ల పైన తిరగనివ్వం అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, రైళ్ళు, ఆటోలని తిరగ నివ్వలేదు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు మూత బడ్డాయి.

కేంద్ర మంత్రుల రాజీనామా
వద్దన్నా వినకుండా కేంద్రం క్యాబినెట్ మీటింగ్ లో టి.నోట్ పెట్టి ఆమోదించడంతో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పల్లం రాజు, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిలు తమ మంత్రి పదవులకు గురువారమే రాజీనామా చేసారు. అంటోనీ కమిటీ సీమాంధ్రుల సమస్యల్ని విని వాటిఫై నివేదిక ఇచ్చే వరుకూ నోట్ పెట్టవద్దని అధిష్టానాన్ని కోరాము. అందుకు సరే అని హామీ ఇచ్చిన అధిష్టానం అంటోనీ కమిటీ నివేదిక రాకుండానే హడావుడిగా క్యాబినెట్ మీటింగ్ లో నోట్ పెట్టి తమని దగా చేసిందని అందుకు నిరసనగా పదవులకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

చిరంజీవి, పురందేశ్వరి, కృపారాణిలు కూడా రాజీనామాలు చేసారని వార్తలు వచ్చాయి. అయితే అవి వాస్తవం కాదని, వారి రాజీనామా లేఖలు ఎవరికీ ఇవ్వ లేదనీ, ప్రజల నుంచి తప్పించుకోడానికే అలా డ్రామాలు ఆడారని ఎ.పి.ఎన్.జీ. ఓస్ నాయకుడు అశోక్ బాబు విమర్శించాడు.

రాష్ట్ర నాయకుల పరిస్థితి
ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి రాష్ట్ర కాంగ్రెస్ సాధారణ నాయకుల వరకు అందరి పరిస్థితి అడకత్తెర లో పోక చెక్కలా ఉంది. అధిష్టానం కంటే ప్రజలే ముఖ్యమని, అందుకోసం పార్టీని సైతం వదిలేస్తామని వారు చెబుతున్నారు. కాసు కృష్ణారెడ్డి, ఏరాసు ప్రతాప రెడ్డి వంటి వారు విభజనకు వ్యతిరేకం గా పదవులకు రాజీనామా చేసారు. అయితే కొంత మంది మాత్రం విభజన తీర్మానాన్ని అసెంబ్లీ లో ఓడించి తర్వాత పదవులకు రాజీనామా చేస్తామని అంటున్నారు. మొత్తం మీద యు. పి. ఏ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వలన కాంగ్రెస్ పార్టీకి బలమైన మూల స్తంభం అయిన ఆంధ్ర ప్రదేశ్ ని చేతులారా విడిచి పెట్టుకొంది.

Send a Comment

Your email address will not be published.