టెన్షన్ ... టెన్షన్...

భారత సరిహద్దుల్లో ఇండియా పాకిస్తాన్ వన్ డే క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుంటే ఎలా ఉంటుంది. నరాలు తెగి పోయే ఉత్కంఠ. ఒక్క సెకండ్ రెప్ప వాలిస్తే ఏమవుతుందో, ఇండియా గెలుస్తుందో లేదో అని ఊపిరి బిగపట్టి కూర్చుంటాం. ఇండియా పాక్ మ్యాచ్ కంటే ఎక్కువ టెన్షన్ పెట్టేవి ఏమీ ఉండవని భారతీయులతో పాటు ప్రపంచ దేశాల నమ్మకం కూడా. అయితే ఇండో పాక్ క్రికెట్ కంటే హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం.

జాతీయ రాజకీయాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర విభజన అంశం మాత్రమే పతాక శీర్షికలలో ఉంటోంది. దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల వేడి కూడా ఆంధ్రా విభజనే ఎక్కువ సెగలు రేపుతోంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరో గమ్మత్తు ఏమిటంటే ఈ టెన్షన్ అధికార పార్టీకో, ప్రతిపక్షానికో పరిమితం కాలేదు. రాష్ట్ర సారధి ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ప్రతిపక్ష నాయకులు చంద్ర బాబు, కె.సి.ఆర్, జగన్మోహన రెడ్డి, బి.జె .పి, మజ్లిస్, సి.పి.ఎం, సిపిఐ ల వంటి అన్ని రాజకీయ పార్టీలతో పాటు పది కోట్లకి పైగా ఉన్న జనాభాలో కూడా ఈ తీవ్రమైన టెన్షన్ నెలకొని ఉంది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి సరిగ్గా పదిహేను రోజులు ఉంది. సమావేశాలు ముగింపుకి నెల రోజులు ఉంది. అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 5వ తేదీన ప్రారంభమై, 20వ తేదీన ముగుస్తాయి. సరిగ్గా ఈ నెల రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్ తేలబోతుంది. ఆంధ్రులు సమైక్యం గానే ఉంటారా? లేక పోతే విడగొట్ట బడతారా? ఈ ప్రశ్నకి మరో నెల రోజుల్లో సమాధానం లభించనుంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ ప్రభుత్వం దూకుడు గానే ఉంది. ఏది ఏమైనా ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టి ప్రతిపక్ష బి.జె.పి సహాయంతో ఆమోదింప చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, తద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ది పొంది రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఉవ్విళ్ళూరుతోంది. సమైక్య రాష్ట్రం కావాలని సీమాంధ్రులు ఎన్ని ఉద్యమాలు చేసిన మూడు నెలల పాటు నిరవధిక సమ్మెలకి దిగినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రము చలించలేదు. పైగా సీమాంధ్రుల సమస్యలు వినడానికి అంటోనీ కమిటీ రాష్ట్రానికి వస్తుందని చెప్పి తప్పించుకున్నారు. అంటోనీ కమిటీ రాలేదు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ మాత్రం రాజకీయ పార్టీలతో సమావేశం అయింది. మరో మూడు రోజుల్లో తెలంగాణ బిల్లు ఖరారు చేస్తామని జి.ఎం.ఓ ప్రకటించింది. దాంతో తెలంగాణ వాసులు ఆనందంతోనూ, సీమాంధ్రులు రాష్ట్ర విభజన జరిగితే తమ పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలో పడ్డారు. అయితే ఈ పరిస్థితిలో బుధవారం నాడు ఒక్కసారిగా మార్పు చోటు చేసుకొంది.

ఆంద్ర ప్రదేశ్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 371డి ని తొలగిస్తే తప్ప ఆంధ్ర రాష్ట్ర విభజన సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ఎత్తి వేయాలని అందుకు పార్లమెంట్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ తో బిల్లు పాసు చేయాలని కేంద్ర అటార్నీ జనరల్ వాహనపతి కేంద్ర హోం శాఖకి ఇచ్చిన నోట్ లో పేర్కొనడం రాష్ట్రం లో పెద్ద దుమారం లేపింది.

రాష్ట్ర విభజన కనుక జరిగితే ఇక ఆంధ్రప్రదేశ్ కీ, తెలంగాణకీ ఆర్టికల్ 371 డి ద్వారా సంక్రమించిన ప్రత్యేక హక్కులు ఏవీ ఉండవని స్పష్టం చేశారు. దాంతో కేంద్రం ఇప్పుడు తెలంగాణ బిల్లు కంటే ముందు రాజ్యాంగ సవరణ కి పార్లమెంట్ అనుమతి తీసుకోవాలి. మరి ఇందుకు ప్రతిపక్షాలు ఒప్పు కుంటాయా? యు. పి ఎ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాయా ? లేదా? అన్నది ఎవరూ చెప్పలేకున్నారు.

మరో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి విభజనని ఖచ్చితంగా అడ్డుకుంటారని అందుకు అసెంబ్లీని సమావేశ పరచకుండా ఉంచడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని, అందుకు తగ్గ ఆయుధాలు కిరణ్ రెడ్డి దగ్గర సిద్ధంగా ఉన్నాయి, ఒకవేళ అవి పని చేయక పోతే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని మీడియాలో ఈరోజే లీకులు వచ్చాయి. దాంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ రాష్ట్రం లో అసలు ఏం జరగబోతుంది? అనే టెన్షన్ మొదలైంది.

Send a Comment

Your email address will not be published.