డ్రగ్స్ మత్తులో టాలీవుడ్

Tollywoodవెండితెర చరిత్రలో తెలుగు మాటలకు దాదాపు ఎనభై ఏడేళ్ళు. భారతీయ సినీ చరిత్ర పుటల్లో తొలి టాకీ “ఆలం ఆరా”. ఇది 1931 లో వచ్చింది. అది ఓ హిందీ చిత్రం. మన తెలుగు వారు అదే ఏడాది మొట్టమొదటి చిత్రం భక్త ప్రహ్లాద చిత్రానికి రూపుదిద్దారు. అప్పటి నుండి హిందీ చలనచిత్ర పరిశ్రమకు దీటుగా తెలుగు సినిమా పరిశ్రమ ప్రతీ సంవత్సరం చిత్రాల సంఖ్యలో గానీ బడ్జెట్ లో గానీ నాణ్యతలో గానీ తీసిపోకుండా ఎంతో ఘనత సంపాదించుకుంది. ఈమధ్య వచ్చిన బాహుబలి-2 చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకున్న రికార్డుల పరంపరను చేదించి ప్రపంచ స్థాయీ చిత్రంగా పేరుగాంచింది.

చిత్ర పరిశ్రమలో మొదట ప్రవేశించిన ఎంతోమంది త్యాగమూర్తులు తమ క్రమశిక్షణతో గత శతాబ్దంతం వరకు అందరినీ ఆదర్శవంతంగా తీర్చి దిద్దారు. ఇప్పుడు పరిస్థితి వేరు. డ్రగ్స్ ఊబిలో కూరుకుపోయి మురికి కంపు వాసనతో అసహ్యంగా తయారైంది. చిత్రాలలో నాణ్యత లోపించి సాహిత్యానికి చిల్లులు పడ్డాయి. వారం రోజులు ఒక సినిమా ఆడితే గొప్పగా చెప్పుకునే రోజులు వచ్చాయి. ఒక హీరో లేక హెరోయిన్ రెండవ సినిమాలో నటిస్తే పండగ చేసుకునే రోజులు. ఏకాగ్రత కోల్పోయి స్పష్టత కొరవడి చిన్నాభిన్నమైన తెలుగు చిత్ర పరిశ్రమ ఎటు పయనిస్తోంది?

ఇప్పుడు డ్రగ్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది. స్కూల్ పిల్లలు, కాలేజీ యువత మాత్రమే డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు అనుకుంటే పొరపాటు. ఈ మత్తులో కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు వెలుగులోకి వస్తోంది. ఎక్సయిజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఇప్పటికే కొందరు ప్రముఖులకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు కూడా. పోలీసువారు వారి పేర్లను బయట పెట్టకపోయినా కొందరు తమకు తాముగా నోటీసులు అందాయని, సమాధానం చెప్తామని మీడియా ముందుకు వచ్చారు.

కొన్ని రోజుల క్రితం, కెల్విన్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో టాలీవుడ్ సెలబ్రటీల వ్యవహారం బయటపడింది. వారి ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజస్ ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు టాలీవుడ్ లో కొందరికి నోటీసులు జారీచేసారు.

ఈ సెలబ్రిటీలు తమ డ్రైవర్ల ద్వారానో లేక మరొకరి సహాయంతో డ్రగ్స్ తెప్పించుకుంటున్నారని పోలీసుల ఆధారాల సేకరణలో తెలియవచ్చింది. కనుక తమ ముందు విచారణకు వ్యక్తిగతంగా జూలై 19వ తారీఖు నుండి 27వ తారీఖు మధ్య నాంపల్లి ఎక్సయిజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసులో అధికారుల సమక్షంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఒకవేళ వీరు హాజరుకాకపోతే అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. ఇప్పటివరకు 12 మంది తెలుగు సెలబ్రటీలు నోటీసులు అందుకోగా వారిలో కొందరు నోటీస్ తీసుకున్నట్లు తెలిపారు కూడా.

ఇలా ఉండగా, నోటీసు అందుకున్న వారిలో ఒకరైన హీరో నవదీప్ తాను ఏ తప్పూ చేయలేదన్నారు. డ్రగ్స్ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధమూ చెప్పారు. పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. అలాగే ఆ జాబితాలో ఉన్న మరి కొందరు కూడా చెబుతున్నారు. యువ హీరో తనీష్ మాట్లాడుతూ, డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడం బాధాకరమని అన్నారు. ఇటువంటి వార్తలు తన కెరీర్ పై ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేసారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ చూడలేదని హీరో నందు తెలిపారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని డ్రగ్ కేసులో తనను ఇరికించే ఉద్దేశంతోనే ఇదంతా చేసివుంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్ డైరెక్టర్ చిన్నా చెప్తూ టీవీల్లో తన పేరు చూసి షాక్ కు గురయ్యానని అన్నారు.

ఇలా ఉండగా, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సినిమావాళ్లు వినోదం పంచి ప్రేక్షకులకి మత్తెక్కించాలి కానీ… మత్తు మందులు వాడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇది మంచి పద్ధతి కానేకాదని, ఇకపై ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరమని, తనతరం హీరోలు కానీ నటులు కానీ ఎవ్వరూ ఇలా బానిసలవలేదని ఆయన అన్నారు.

Send a Comment

Your email address will not be published.