తగిన వాడిని కాను

సమాజ్ వాది పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఇటీవల ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమితాబ్ బచ్చన్ ని తదుపరి రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించే అవకాశం ఉందని చేప్పిన విషయంపై చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. అమర్ సింగ్ మాట్లాడుతూ తాను అమితాబ్ ని నరేంద్ర మోడికి పరిచయం చేసానని, ఆ తర్వాత గుజరాత్ పర్యాటకానికి అమితాబ్ అంబాసిడర్ కావడం తదితర విషయాలను ప్రస్తావించారు.

ఇలా ఉండగా అమితాబ్ దృష్టికి అమర్ సింగ్ మాటలను తీసుకువెళ్ళినప్పుడు ఆయన ప్రతిస్పందించారు.

అమర్ సింగ్ ఆలోచన వినడానికి హుందాగానే ఉన్నా తాను ఆ పదవికి తగిన వాడిని కానని అమితాబ్ అన్నారు. అయినా ఇప్పటి వరకు తన వరకు అటువంటి ప్రతిపాదనలేవీ రాలేదని అన్నారు. రాజకీయాలు తనకు ప్రధానం కాదని తరచూ తాను చెప్తూనే ఉన్నానని అమితాబ్ చెప్పారు.

ఒకరు దేశానికి, సమాజానికి రాజకీయాలకు అతీతంగా ఉపయోగపడటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని అమితాబ్ చెప్పారు.

ఈమధ్య భారతీయ జనతా పార్టీ నాయకుడు శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ అమితాబ్ ను రాష్ట్రపతిగా చేస్తే అది గర్వకారణం అవుతుందని చెప్పడాన్ని ఎవరూ మరచిపోకూడదు.

సాంస్కృతిక, సామాజిక రంగాలలో అమితాబ్ ఇప్పటికే ఎన్నో మైలురాళ్ళు అధిగమించారని, ఆయన రాష్ట్రపతి అయినట్లయితే దేశానికి మరింత మంచి పేరు వస్తుందని కూడా సిన్హా అన్నారు.

అమితాబ్ 1984 లో అలహాబాద్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే మూడేళ్ళ తర్వాత ఆయన ఎంపీగా రాజీనామా చేసారు.

Send a Comment

Your email address will not be published.