తరగతి గది నేర్పించని జీవితం

జీవనానికి ఒక బాట వేస్తుంది
————————

morris schwartzప్రతిమనిషీ ఓ పాఠ్య పుస్తకమే. అతనినుంచి ఏం నేర్చుకోవాలి…ఎలా నేర్చుకోవాలి అని పరిశోధించి తెలుసుకోవలసింది మన స్వీయ శక్తిపై ఆధారపడి ఉంటుంది. మిచ్ ఆల్బమ్ అనే ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత ఓ పుస్తకం రాశారు. దాని పేరు మోరీతో మంగళ వారాలు.

ఈ పుస్తకం చదివితే తప్పకుండా ఏడుస్తారు….ప్రయాణంలో చదివే పుస్తకం కాదు. ఇదొక జీవిత పాఠం అని అప్పటికే ఓ మిత్రుడు చెప్పడంతో ఆ పుస్తకంపై నా దృష్టిపడింది. ఆ మిత్రుడు చెప్పింది నిజమే.

ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణం చేసేటప్పుడు ఆ మిత్రుడు చదివితే ట్రైన్ లో బెర్త్ దొరికినా నిద్ర పోనివ్వలేదట పుస్తకంలోని విషయం.

మనసులో ఏదో తెలియని గుబులు….తపన…రెండు రోజుల్లో మూడుసార్లు చదివినట్టు చెప్పాడు. సరే అని నేనూ చదివాను ఆ పుస్తకాన్ని.

మోరీ స్వార్డ్స్ అనే ఓ వయస్సు మళ్ళిన ప్రొఫెసర్ చివరి రోజుల్ని వివరించే పుస్తకం అది. వారి శిష్యులలో ఒకరైన మిచెల్ ఈ పుస్తకం రాశారు. అమెరికా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా ఉండి రిటైర్ అయ్యారు మోరీ స్వార్డ్స్ !
1970 ల్లో మిచ్ కాలేజీలో చదివినప్పుడు మోరీ ఆయన ప్రొఫెసర్. మిచ్ చదువు పూర్తి చేసిన తర్వాత చాలా కాలం తన ప్రొఫెసర్ ని కలవలేదు.

ఓసారి ఓ టీవీ ప్రోగ్రామ్ లో ప్రొఫెసర్ గురించి తెలుసుకున్నారు మిచ్. వయస్సు పైబడ్డ మోరీ నరాల జబ్బుతో చాలా బాధ పడ్డారట. ఈ జబ్బు లక్షణం ఏమిటంటే దేహంలో ఒక్కో అవయవాన్ని దెబ్బ తీస్తూ చివరికి మృత్యు ఒడిలోకి తీసుకుపోతుంది. ఈ విషయం తెలియడంతోనే మిచ్ మనసు బాధపడింది. తాను ఏం చెయ్యాలి అనుకున్నారు. tuesdays with morrieఇక మిగిలి ఉన్న రోజుల్లో నైనా సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. అందుకోసం తన దగ్గర చదువుకున్న విద్యార్థులూ, మిత్రులు పలువురిని పిలిచి నేను ఇప్పటివరకు క్లాసులో చెప్పని ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం వారంలో ఒకరోజు కలిసి జీవితం గురించి తెలుసుకుందాం….ఇందులో నేను ప్రొఫెసర్, మీరు విద్యార్థులు అని ఉండదు. పరస్పరం ఎవరికి తెలిసిన విషయం, అనుభవాలు చెప్పుకుందాం. అవి నిజమైనవై ఉండాలి అన్నారు. అలా ఆయన మంగళ వారాలు కలవడం మొదలు పెట్టారు. ఈ సమావేశాలు అనేక సంవత్సరాలు సాగాయి. తమ ప్రొఫెసర్ ని కలవడానికి వెతుక్కుంటూ వచ్చారు మిచ్.

“స్కూల్, కాలేజీ పాఠాలు మాత్రమే నేర్పిస్తాయి. జీవితాన్ని కాదు అని ప్రొఫెసర్ గట్టిగా చెప్పారు. తన తరగతి ముఖ్య ఉద్దేశం వారి వారి మనసులో ఉన్న ప్రశ్నలను అడగడం…మనమందరం కలిసి వాటికి జవాబులు కనుక్కోవడం…” అన్నారు.

ఈ క్లాసులు మోరీ ఇంట్లో ప్రతి మంగళ వారం ఉదయం లంచ్ తర్వాత ఆరంభవుతాయి. ఇక్కడ ఒకటే పాఠం. అదే జీవితం గురించి పాఠం. దానిపై వారి వారి సందేహాలు, భయాలు, పరాజయాలు, మోసపోవడాలు, చెప్పుకుంటారు. వీటికి మార్కులు గట్రా ఉండవు. పుస్తకాలు లేవు. అంతా మాట్లాడుకోవడమే క్లాసు ముఖ్య అంశం.

కుటుంబం అంటే ఏమిటి? క్షమించడం తప్పా…ఒప్పా? మనుషులు ఎందుకు ప్రేమించాలి? మనుషులు దేనిని నమ్ముతున్నారు. సమాజంలో జరిగే తప్పొప్పులను ఒక వ్యక్తి బాధ్యుడు అవుతాడా? ఇలా అనేక అంశాలపై వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు. ఈ మాటల్నీ మరీ వేదాంత ధోరణిలోనే వైరాగ్య ధోరణిలోనే కాకుండా చూసుకునే వారు. ఈ సమావేశాలప్పుడు ఒకరు మరొకరికి అతనికి ఇష్టమైనది కొనివ్వడం, అందరూ కలిసి భోజనం చేయడం, ఆటలు ఆడి పాటలు పాడి ఉల్లాసంగా గడపటం, వంటివాటితో మంచి వాతావరణం ఏర్పరచాలన్నదే మోరీ ఉద్దేశం.

మరోవైపు మోరీ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఆయన కాళ్ళు పని చేయడం లేదు.. ఆయనంతట ఆయన లేచి వెళ్లి మూత్రం చేసే స్థితిలో లేరు. అందుకోసం నానా యాతన పడాల్సి వచ్చేది. మతిమరపు వచ్చేస్తోంది. చూపు సన్నగిల్లుతోంది….అయినా వారి సమావేశాలు సాగుతూనే ఉన్నాయి.

ఒకరోజు ఆయన తన మరణం తర్వాత జరిగే తంతుని తన కళ్ళ ముందు జరిపించుకుని చూడాలని ఆశ పడ్డారు. ఆ కార్యక్రమానికి “సజీవ అంతిమ యాత్ర” అని పేరు పెట్టారు.
ఆ కార్యక్రమంలో ఆయన మిత్రులు, బంధువులు కలిసి ఏడ్చారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ కవితలు చదివారు. ఆయనతో గడిపిన జ్ఞాపకాలను చెప్పుకున్నారు. వారితో పాటు మోరీ కూడా ఏడ్చారు. నవ్వారు….తనను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది.

మోరీ నిర్వహించిన ఈ తరగతుల గురించి టీవీలు ప్రసారం చేశాయి. ఆయన తన జీవితంలోని ఆఖరు క్షణం వరకు జీవితాన్ని ఉపయోగపడేలా మలచుకున్నారు ఇతరులతో కలిసి. అందరికి తోడ్పడేలా చేసుకున్నారు.
సంగీతంలోనూ, నృత్యంలోను చిన్నప్పటి నుంచే ఇష్టమున్న మోరీ తన వయస్సుని మరచి ఇంట్లోనే నృత్యం చేశారు. మరణం అనేది నృత్యానికి ముగింపు మాత్రమే అని చెప్పి నవ్వారు.

జీవిత అనుభవంలో తెలుసుకున్న వాటినే ఈసమావేశాలలో ప్రధానంగా పంచుకున్నారు. ఈ విషయాలను మిచ్ ఎంతో గొప్పగా వివరించారు. అందుకే ఈ పుస్తకం లక్షల్లో అమ్ముడుపోయాయి. మోరీ ఒక్కరే కాదు చాలా మంది ఉపాధ్యాయులు క్లాసులోనే కాకుండా బయట కూడా బోలెడు జీవిత పాఠాలు నేర్పిస్తున్నారు. వాటితో మన జీవితాలను మెరుగుపరచుకోవచ్చు. ఒక మనిషి మరొక మనిషిపై చూపే ఆసక్తి, తపన, ఫలితాలను అంత సులభంగా చెప్పడం సాధ్యం కాదు. నీరు ఓ ద్రాక్ష పండులా మారుతున్నట్లు అదొక రాసవాదం.

నేర్చుకోవడం అనేది స్కూల్ చదువుతో ముగిసిపోతుంది అని అనుకునే వారే ఎక్కువ. కానీ అది తప్పు. అది అబద్ధం కూడా. నేర్చుకోవడానికి వయస్సో పరిస్థితులో అడ్డంకి కావు. మనలో ఆసక్తి ఉండాలి. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. అవి లోపిస్తే అంతా శూన్యమే!
——————————
తలశిల సిరిచందన

Send a Comment

Your email address will not be published.