తరతరాల తెలుగు తరగని వెలుగు

Telugu Lettersతెలుగు అక్షరం పెళ్లి పందిరిలో పరదాల చాటున పరవశంతో ముసి ముసి నవ్వుల ముద్ద మందారంలా ధవళ కాంతుల నడుమ మేని బంగారు ఛాయతో పదహారణాల పల్లె పడుచులా ఒళ్ళంతా సింగారించుకొని నవ యవ్వన నృత్య కళా కారిణిగా తాండవం చేస్తుంది. అక్షరమెప్పుడూ మన పక్షమే అన్న నమ్మకాన్ని గట్టిపరుస్తోంది. ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేయమనే నమ్మకం అక్షరానికుంది.

భాషా సంస్కృతులు ఎప్పుడూ చిలకా గోరింకల్లా ఒకరికి ఒకరు దన్ను కాసి వన్నె కోసం పాకులాడుతాయి. కొన్నేళ్ళ క్రితం ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన మృత భాషల్లో తెలుగు కూడా వుండడం మన దురదృష్టం. ఇన్నాళ్ళు కొన్ని భాషా సంస్థలు, కొందరు వ్యక్తిగతంగానూ వారికున్న వనరులతో పోరాడి మన భాషను రక్షించాలన్న తపనను వివిధ రూపాల్లో వ్యక్తపరిచారు. కానీ మన తెలుగు ప్రభుత్వాలు ఇప్పటి వరకూ ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపించలేదు. అయితే ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఈ విషయమై ఒక ప్రణాళికను రూపొందించి తెలుగు భాష అన్ని విద్యా సంస్థల్లో 1 నుండి 12 తరగతి వరకు ఖచ్చితంగా బోధనాంశముగా వుండాలని, ఇది తక్షణమే అమలు జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త భాషాభిమానులందరికీ విజయోత్సహాన్నిచ్చింది. అన్ని తరగతుల్లో బోధించే తెలుగు పాఠ్యాంశాలకు రూపకల్పన చేసి సాహిత్య అకాడమీ పుస్తకాలు ముద్రించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణాలో కార్యకలాపాలు నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తమ నామఫలకాలను మొదట తెలుగులో వ్రాసి తరువాత ఇతర భాషల్లో వ్రాయాలని తెలిపారు.

వచ్చే డిశంబరు నెలలో (15-19 తేదీల మధ్య) జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రమంతటా పండగ వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి శ్రీ కె సి ఆర్ తెలిపారు. ఈ సభలలో తెలంగాణా రాష్ట్ర ప్రాసిస్త్యాన్ని తెలిపే అన్ని రకాల నృత్య నాటక ప్రదర్సనలుంటాయి. విదేశాల్లోని ప్రముఖ తెలుగు సంస్థలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపనున్నట్లు ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఈ మధ్యనే స్వర్గస్తులైన శ్రీ సి.నారాయణ రెడ్డి గారి స్మారకార్ధం ఒక భవనం నిర్మించాలని తలపెట్టారు.

Send a Comment

Your email address will not be published.