తిరుమలలో అన్య మత ప్రచారం

తిరుమలలో అన్య మత ప్రచారం సాగిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి సాక్షిగా ఏడుకొండల మీదే మత ప్రచారానికి దిగాడు ఒక క్రైస్తవ మత ప్రచారకుడు. పైగా దాని వీడియో తీసి యూ ట్యూబులో కూడా పెట్టాడు. కోట్లాది మంది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రంపై అన్య మత ప్రచారం చేసి, దాని నుంచి ఆర్ధిక ప్రయోజనం పొందడానికి ప్రయత్నించిన ఈ వ్యక్తి పేరు మొండితోక సుదీర్. ఆయన పాస్టర్. ఇమాన్యుయెల్ బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు డైరెక్టర్. ఆయన తన సోదరుడు, మరి కొంత మంది క్రైస్తవ మత ప్రచారకులతో అలిపిరి నుంచి తిరుమల వెడుతూ క్రీస్తును స్తుతించడమే కాక, వెంకటేశ్వర స్వామి అసత్య దేవుడంటూ పెద్దగా వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తరువాత తిరుమలలో కూడా ఆలయం ఎదురుగా నిలబడి అన్య మత ప్రచారం చేశారు. తనకు భారీగా విరాళాలిస్తే, తిరుమలను క్రైస్తవ క్షేత్రంగా మారుస్తానంటూ అక్కడి భక్తులను ఉద్దేశించి అన్నారు.

భక్తుల ఫిర్యాదు మేరకు ఆ తరువాత ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

తిరుమల మీద అన్య మత ప్రచారం చట్ట విరుద్ధం. తిరుమల అధికారులు ఇటువంటి అన్య మత ప్రచారం మళ్ళీ జరగకుండా చర్యలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో అత్యవసర సమావేశం జరిపి పరిస్థితిని సమీక్షించారు.

Send a Comment

Your email address will not be published.