తిరుమలలో కార్చిచ్చు

తిరుమల అడవుల్లో కార్చిచ్చు ప్రారంభం అయింది. నిత్యం లక్షలాది మంది భక్తులు సందర్శించుకునే తిరుమల చుట్టూ పక్కల వ్యాపించి ఉన్న శేషాచలం కొండలను కార్చిచ్చు ఆవహించి క్రమంగా పెరుగుతోంది. ఈ కార్చిచ్చు మూడు రోజుల క్రితమే ప్రారంభం అయినా ఎవరూ  పట్టించుకోలేదని  స్థానికులు చెబుతున్నారు. సుమారు కిలోమీటర్ మేర ఈ మంటలు వ్యాపించాయి. భక్తులు తీవ్ర స్థాయిలో భయ ఆందోళనలకు గురవుతున్నారు. ఈ మంటలను అదుపు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ, ఆరోగ్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మంటలు శ్రీవారి ఆలయానికి మూడు కిలోమీటర్ల దాకా వచ్చేశాయని అధికారులు చెప్పారు. ఈ కార్చిచ్చు ధాటికి ఇప్పటికే సుమారు అయిదు వేల హెక్టార్లలో అటవీ సంపద బుగ్గి అయింది. ఈ మంటలకు అనేక మూగ జీవాలు దగ్ధమయ్యాయి. కాకులమాను కొండపై ఏర్పాటు చేసిన రెండు పవన విద్యుత్ సంస్థలు దగ్ధమయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు హెలికాప్టర్లను, సైన్యాన్ని రంగంలోకి దించింది. ఇవి గురువారం నుంచి రంగంలోకి దిగుతాయి. ఇక్కడ కార్చిచ్చు ప్రారంభం కానున్నట్టు ‘నాసా’ ఈ నెల రెండవ తేదీనే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు తెలిసింది. కార్చిచ్చు కారణంగా రెండు నడక దారుల్నీ మూసేశారు. ఇది ఇలా వుండగా ఈ మంటలు కొద్దిగా నల్లమల అడవులకూ వ్యాపించినట్టు అధికారులు బుధవారం రాత్రి గుర్తించారు. అంటే శ్రీశైలం చుట్టూ పక్కల కూడా కార్చిచ్చు వ్యాపించిందన్న మాట.

Send a Comment

Your email address will not be published.