తెలంగాణకు చైనా చేయూత

గత రెండు రోజుల వ్యవధిలో తెలంగాణా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణా రాష్ట్రంలో నిర్మాణ రంగంతోపాటు, వ్యవసాయం, పర్యాటకం, వైద్య రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి చైనా తెలంగాణా రాష్ట్రంతో ఒప్పందాలు కుదర్చుకుంది. పర్యాటక రంగం అభివృద్ధికి నెదర్లాండ్స్ కూడా ముందుకు వచ్చింది. కాగా తెలంగాణా ప్రాంతాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని దక్షిణాసియా మొత్తానికి సేవలు అందించడానికి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ కూడా తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం కుదర్చుకుంది.

తెలంగాణాలో నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి ఆర్ తో సమావేశం తరువాత చైనా ప్రతినిధులు ప్రకటించారు. ఈ ఒప్పందం కింద తెలంగాణలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో చైనా టన్నెల్స్, వంతెనలు, బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుంది. చైనా నిర్మాణ సంస్థలకు కాళేశ్వరం, మిడ్ మానేరు ఎత్తిపోతల పథకాల నిర్మాణ బాధ్యతల్ని కూడా అప్పగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి అంగీకారం తెలియజేయడంతో, చైనా ప్రతినిధులు రాష్ట్రంలో టన్నెల్స్ తవ్వాల్సిన ప్రాంతాలు, వంతెనలు నిర్మించాల్సిన ప్రాంతాలను సందర్శించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం స్థాపనలో కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ 20 మంది సభ్యుల ప్రతినిధి వర్గాన్ని కోరారు. అతి త్వరలో తాము నిర్మాణం పనులు ప్రారంభిస్తామని ఆ బృందం ముఖ్యమంత్రికి హామీ ఇచ్చింది.

Send a Comment

Your email address will not be published.