ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల తెలంగాణా పర్యటనకు వరంగల్ వెళ్ళారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆయన తెలంగాణా రాష్ట్రంలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. ఆయనను తెలంగాణా ప్రాంతంలో అడుగు పెట్టనివ్వమని, ఆయన తెలంగాణా ద్రోహి అని పలువురు తెలంగాణా మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆయన పర్యటనకు తెలంగాణా నాయకులెవరూ అడ్డుపడ లేదు కానీ, రాష్ట్ర మాదిగ కుల నాయకులు మాత్రం ఆయన కార్లను అనేకచోట్ల అడ్డుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలో తమ కులస్తులకు రిజర్వేషన్లు పెంచడంపై వారు గొంతెత్తుతున్నారు.
చంద్రబాబు హన్మకొండలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, భౌగోళికంగా తాము విడిపోయినప్పటికీ, మానసికంగా కలిసే ఉందామని కోరారు. విభేదాలతో బాగుపదినవారు లేరని, తెలుగు ప్రజలంతా తమ అభివృద్ధి మీద సమైక్యంగా కృషి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని కూడా ఆయన చెప్పారు. ఈ రెండు రాష్ట్రాలలో ఎక్కడ పంటలు ఎందిపోకూడదని, తెలంగాణా ప్రభుత్వం అడిగితే ఆంధ్రలో పొదుపుగా వాడుకోనయినా సరే తెలంగాణకు విద్యుత్తు ఇస్తామని ఆయన ప్రకటించారు. “నా చివరి రక్తపు బొట్టు వరకూ తెలంగాణకు అన్యాయం చేయను” అని ఆయన స్పష్టం చేశారు.