తెలుగు బడి - రెండవ వార్షికోత్సవం

రెండు వసంతాల అలుపెరుగని ప్రయాణం. అద్భుతమైన అనుభూతుల సంగమం. సరస్వతీదేవి ఒడిలో సేద దీర్చుకుంటున్న వైనం. కాన్బెర్రా తెలుగు బడి కధనం.

తెలుగు అక్షరం ఎప్పుడూ మన పక్షమే అయినా చిన్నారుల చేత దిద్దిన్చుకోవాలన్న తపన వుంటుంది. మునివేళ్ళ మధ్య బలపం కదలాడుతూ అమ్మ భాషలోని అక్షరాలను అందంగా చిన్నారులు నలువరసలా ఒరవళ్ళు దిద్దితే తెలుగుతల్లి మురిసిపోతుంది. పులకరిస్తుంది. లాలీ పాటలను జోల పాటలుగా వినాలనుకునే చిన్నారులకు లాలిత్యం పంచి పెడుతుంది. తాను పరవసిస్తుంది.

చిన్నారులకు తెలుగు నేర్పించాలన్న తపనతో కాన్బెర్రా తెలుగు సంఘం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన తెలుగు బడి అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. వారి కోసం “రాగం, తానం, పల్లవి” పాటల కార్యక్రమం నిర్వహిస్తూ వారు నేర్చుకుంటున్న తెలుగు ప్రతిభా పాటవాలు ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తున్నారు. తెలుగుమల్లి లో ఇదివరకటి కార్యక్రమ వివరాలు ప్రచురించడం జరిగింది.

తెలుగు బడి ACT Community Language Schools Association (ACTCLSA) వారిచే గుర్తించబడి ప్రతీ ఏట వారినుండి ఆర్ధిక సహాయాన్ని కూడా పొందుతున్నారు. ACT మల్టీ కల్చరల్ కమిషన్ వారు కూడా కొంత ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. డా.క్రిస్టోఫర్ అల్లాడ గారు ఈ తెలుగుబడి అభివృద్దికి $2000 ఆర్ధిక సహాయాన్ని అందించినట్లు సమన్వయకర్త శ్రీమతి మాధవి తలపనేని గారు చెప్పారు. ఆస్టిన్, టెక్సాస్ (USA) వారిచే తయారుచేయబడిన పాఠ్యంశాలు ఈ బడిలో చెప్పబడుతున్నాయి. సంవత్సరానికి రెండు సెమిస్టర్ లు వుంటాయి. ప్రతీ సంవత్సరం పిల్లలకు వ్రాత మరియు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తున్నారు.

కాన్బెర్రా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకల్లో ప్రత్యేకంగా తెలుగుబడిలో చదువుతున్న పిల్లలందరికీ పాల్గొనే అవకాశం తప్పకుండా కల్పిస్తున్నారు. పద ఉచ్చారణకు తోడ్పడేందుకు వక్తృత్వ పోటీలు, పద్యాలు చదవటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.

గత నెల 25వ తేదీన జరిగిన రెండవ వార్షికోత్సవానికి విద్యార్ధులే కాకుండా వారి తలిదండ్రులు, తెలుగుబడి సమన్వయకర్తలు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ సందర్భంగా శ్రీమతి మాధవి తలపనేని మరియు శ్రీమతి అపర్ణ రావినూతల గార్లు మాట్లాడుతూ ముందు ముందు ఈ క్రింద వివరించిన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు:

  1. చీఫ్ మినిస్టర్ ఛాలెంజ్ – ఇందులో పాల్గొన్న పిల్లలు ఎక్కువ తెలుగు పుస్తకాలు చదివే అవకాశం దొరుకుతుంది. ACT చీఫ్ మినిస్టర్ గారిని కలిసే అవకాశం కలుగుతుంది.
  2. ACT మల్టీ-కల్చరల్ కార్యక్రమం, తెలుగు సంఘం ఉగాది కార్యక్రమం మరియు ACT కమ్యూనిటీ లాంగ్వేజ్ స్కూల్ డే కార్యక్రమాల్లో పాల్గొనడం
  3. రేడియో – తెలుగువాణి కార్యక్రమాల్లో తరచుగా పాల్గొనడం

Send a Comment

Your email address will not be published.