తెలుగు బిడ్డకు “స్వర్ణోత్సవ” కిరీటం

ఆస్ట్రేలియా తెలుగువారి ప్రస్థానంలో మరో కాంతి కిరణం. సమాజసేవే పరమానందం. మానవసేవకే అంకితం. ఎందరో వలస వచ్చిన తెలుగువారికి ఆపన్న హస్తం. తెలుగుదనమే వారికి సువర్ణాక్షరం. గత దశాబ్దంలో అంచెలంచెలుగా ఎదిగిగిన వైనం. సౌత్ ఆస్ట్రేలియా రాష్ట్రంలో భారతీయ సమాఖ్యకు అందలం. భావి తరాలకు స్పూరితం.

గత రెండేళ్లుగా సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులుగా ఉన్న శ్రీ యారా ఆదిరెడ్డి గారు షుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన సౌత్ ఆస్ట్రేలియా భారతీయ సమాఖ్య (Indian Australian Association of SA – IAASA)కు గత నెల అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంకో ఏడాదిలో స్వర్ణోత్సవం జరుపుకోనున్న IAASA కు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగువాడు. తెలుగువారందరూ గర్వించదగిన క్షణం.

2007వ సంవత్సరంలో సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం స్థాపించిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకూ పదవి వున్నా లేకున్నా తెలుగు సంఘానికి ఎనలేని సేవలందించిన శ్రీ ఆదిరెడ్డి గారు నిగర్వి. ఎంతోమంది తెలుగువారు అడిలైడ్ నగరానికి క్రొత్తగా విచ్చేసినపుడు వారికి ఆపన్న హస్తమందించి వారి సమస్యలు తనవిగా భావించి ఒక బ్రతుకు తెరువు దొరికే వరకూ వారిని వేలు పట్టి నడిపించే వ్యక్తిత్వం. సమస్యలను సాదరపూర్వకంగా ఆహ్వానించే మనస్తత్వం. పరిష్కార మార్గాలను అన్వేషించే అంతఃకరణము.

శ్రీ ఆదిరెడ్డి గారి వివరాల్లోకెళితే …వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీ రెడ్డి గారు తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, పరకాల్ మండలం రామకృష్ణాపూర్ నుండి 2006 లో అడిలైడ్ నగరానికి వలస రావడం జరిగింది. వీరి తలిదండ్రులు రాధా రెడ్డి మరియు రాజి రెడ్డి గార్లు. షుమారు 1000 మంది ప్రజలున్న వీరి గ్రామంలో శ్రీ అది రెడ్డి గారు మొదటి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్ధి. చాలామందికి ఇటువంటి అనుభవం గర్వాన్ని ఇచ్చే అవకాశం వుంటుంది. కానీ శ్రీ ఆదిరెడ్డి గారు తన జీవితంలో ఇదొక విద్యాయుధంగా భావించి తనకు సహాయం చేసిన కుటుంబ సభ్యులు, ఊరి జనులే కాకుండా తన పరిస్థితి నుండి వచ్చిన వారెందరికో తన సహాయం అవసరమని గుర్తెరిగి ఆస్ట్రేలియా వచ్చిన దగ్గరనుండి తాను నమ్ముకున్న సిద్ధాంతాన్నే అమలు చేస్తూ పలువురికి సహాయ హస్తం అందిస్తున్నారు.

షుమారు 30, 000 మంది భారతీయులు అడిలైడ్ నగరంలో నివసిస్తూ వుంటారు. ఇందులో తెలుగువారు 500 కుటుంబాలు ఉంటాయి. శ్రీ ఆదిరెడ్డి గారు తెలుగు సంఘం అధ్యక్షులుగా ఉంటూ ఉగాది, దీపావళి, సంక్రాంతి, వింటర్ స్పోర్టింగ్ ఈవెంట్, క్రికెట్ టోర్నమెంట్ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగువారి సంస్కృతినీ ఇతర స్థానిక సంస్థలతో సమ్మిళితం చేస్తూ అవకాశం వున్నపుడు ప్రభుత్వ సహాయాన్ని అందుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు.

శ్రీ అది రెడ్డి గారి సతీమణి శ్రీమతి హరితా రెడ్డి గారు. తాను చేసే ప్రతీ పనిలో ఎంతో చేయూతనిస్తుంటారు. వీరి కుమారుడు ప్రణయ్ కుమార్ రెడ్డి. కుటుంబమంతా సమాజసేవలో తృప్తి చెందుతూ అందరికీ స్పూర్తినందివ్వడం ఎంతో ముదావహం.

Send a Comment

Your email address will not be published.