తెలుగు వాని తెలుగు వాణి

తెలుగు వాని తెలుగు వాణి

ఆస్ట్రేలియాలో తెలుగువారి ప్రస్థానం మొదలై 50 ఏళ్ళు దాటిందనేది నిర్వివాదాంశం. అయితే తెలుగువారికి ఒక మాధ్యమంగా మొట్టమొదటిసారిగా ఒక రేడియో కార్యక్రమం “తెలుగు వాణి” 1990 దశకంలో మొదలై ఇప్పటివరకూ అంటే షుమారు 23 సంవత్సరాలు నిర్విఘ్నంగా నడుపుతున్న మన సిడ్నీ తెలుగు వాస్తవ్యులు అభినందనీయులు. ఇంతకు మునుపు ప్రతీ శనివారం ఉదయం 9 – 10:30 నిమిషాల వరకూ ఉండే కార్యక్రమం ఈ స్వాతంత్ర్య దినోత్సవం (15-08-2015) నుండి మరో అరగంట (8:30 – 10:30) పెరిగింది. అంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారికి, ఆదరించేవారికి కొదవలేదనేది నిరూపించబడింది.

తెలుగు భాషపై ఎన్నో వ్యాసాలు, నాటికలు, నాటకాలు, ప్రముఖులతో ముఖాముఖీ, మన పండగల ప్రాశస్త్యం, మన తెలుగు సినిమా రంగంలో వచ్చిన మార్పులు, సినిమా రంగంలో ప్రముఖుల కధాంశాలు ఇలా ప్రతీ వారం వైవిధ్యమున్న విభిన్న అంశాలతో 23 సంవత్సరాలు ఎంతోమంది తెలుగు భాషాభిమానులు, రచయితలు, ఔత్సాహికుల అవిరామ కృషితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రముఖుల ముఖాముఖిలో శ్రీ అక్కినేని నాగేశ్వర రావు, శ్రీ బి.వి.పట్టాభిరాం, శ్రీ ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మొదలగు వారున్నారు. సిడ్నీ తెలుగు సంఘం ఈ కార్యక్రమానికి చేయూతనిస్తూ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నడుస్తోంది.

ప్రతీ వారం ఇద్దరు సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఒక నిర్దిష్ట ప్రమాణం గల పట్టికతో నిర్వహిస్తూ వుంటారు. ఇందులో సభ్యుల అభిరుచిని బట్టి సాహిత్యం, భక్తీ, సాంఘికం, పౌరాణికం, నాటకాలు, వార్తలు (ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్ర వార్తలు), సిడ్నీ తెలుగు సంఘం నిర్వహించే కార్యక్రమ వివరాలు, మనోరంజకమైన పాటలు, సందర్భాన్ని బట్టి ఏవైనా పండగలు దగ్గరలో వుంటే వాటిపై ప్రత్యెక కార్యక్రమాలు ఇలా ఒకటేమిటి సకుటుంబ సమేతంగా వినదగ్గ కార్యక్రమాలు ప్రసారం చేస్తుంటారు. ఇందులో పిల్లల పుట్టినరోజు ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు కూడా వుంటాయి. ఎవరైనా ఆనాటి కార్యక్రమాలపై మాట్లాడ దలచుకుంటే “టాక్ బాక్” సదుపాయం కూడా వుంది. “ఈ వారం” ప్రశ్న విభాగంలో చాలామంది పాల్గొంటూ వుంటారు. దీనికి ఒక బహుమతి కూడా వుంటుంది.

సిడ్నీ తెలుగు సంఘం ఈ రేడియో కార్యక్రమ నిర్వహణకు ఒక ఉప సంఘం నియమించింది. ప్రస్తుతం ఈ ఉప సంఘానికి శ్రీ సారధి మోటమర్రి గారు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ ప్రస్థానానికి నాంది పలికిన తొలిరోజుల్లో శ్రీ నటరాజ్ కూర్మేటి గారు మరియు శ్రీ దూర్వాసుల మూర్తి గారి అందించిన సేవల గురించి ప్రస్తావించకపోతే నిండుదనం రాదు. షుమారు 50 ప్రసార కార్యక్రమాలను నిర్వహించిన శ్రీ మూర్తి గారు ఇప్పటికే తెలుగు భాషకు, మన సంస్కృతికి సేవలందిస్తూనే వున్నారు. ఈ ప్రయాణంలో శ్రీ పోతుకూచి మూర్తి గారు, శ్రీ కిరణ్ పరమాత్ముని, శ్రీ మధుసూధన రెడ్డి బైరెడ్డి, శ్రీమతి జయ సీతంరాజు , శ్రీ మల్లికార్జునరావు రాచకొండ, శ్రీ రఘువీర్ శ్రీరాములు – ఇలా ఎంతోమంది త్యాగధనులు తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ ప్రవాహాన్ని ప్రవహింపజేస్తూ ఆస్ట్రేలియాలో తెలుగువారి తెలుగువాణిగా రూపుదిద్దుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇందులో కొంతమంది ప్రస్తుతం క్రియాశీలక పాత్రలు పోషించకపోయినా వారి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి.

సిడ్నీ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ శివ పెద్దిభొట్ల గారు మాట్లాడుతూ సిడ్నీలో తెలుగువారి ప్రస్థానం గత 5, 6 సంవత్సరాలుగా ఎగుడు దిగుడుగా వున్నా ఈ సంవత్సరం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామనీ షుమారు 22 మంది కుటుంబాలు ప్రస్తుతం ఈ రేడియో కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చి 6 నెలల కాలపట్టికను తయారుచేయడం జరిగిందన్నారు. కాలానుగుణంగా మన తెలుగువారు ఎక్కువగా రావడం వలన శ్రోతల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ పెరిగిందన్నారు.

మన తెలుగు వారికంటూ ఇటువంటి మాధ్యమాలు వుండి ఎక్కువమందికి అవకాశం దొరికితే బాగుంటుంది. అంతే కాకుండా మన పిల్లలకు తెలుగు నేర్చుకోమని చెబుతున్నాం కానీ వారికి సరైన అవకాశం ఇవ్వడం లేదు. రేడియో మాధ్యమాలు వారు నేర్చుకున్న భాష, సంస్కృతులు ప్రదర్శించడానికి మంచి సదవకాశాన్ని ఇస్తాయి.

ఈ రేడియో కార్యక్రమాన్ని వినడానికి అంతర్జాలంలో కూడా సౌకర్యం వుంది. www.sydneytelugu.org వెబ్సైటు లో ఈ సదుపాయం వుంది. ఇది కాకుండా www.2000fm.com ద్వారా కూడా ఉదయం 8:30 – 10: 30 (AEST) గంటల మధ్య వినవచ్చు.

Send a Comment

Your email address will not be published.