తొలి స్వీయచరిత్ర

హరికథా పితామహుడు ఆదిభట్ట నారాయణ దాసుగారు “నా యెరుక” అనే శీర్షికతో తమ స్వీయ చరిత్ర వ్రాశారు. ఆయన ఈ గ్రంధాన్ని న్యాయవాది జయంతి కామేశం పంతులుకి అంకితం చేశారు. ఇది వచన గ్రంధం.

లోకం ఎరుగలేనిది, తనకు మాత్రమే తెలిసిన తన ఈ లోక ప్రసిద్ధికి గల పూర్వ రంగమంతా నారాయణ దాసుగారు తమ స్వీయచరిత్రలో వివరించారు. అందుకే ఈ పుస్తకానికి నా యెరుక అని పేరు పెట్టినట్టు ఆయన చెప్పుకున్నారు. ఆయన ఈ స్వీయ చరిత్రను తన ముప్పయ్యో ఏటి వరకే వ్రాశారు. అక్కడి దాకానే ఎందుకు రాసి ఆ పైన ఎందుకు రాయలేదని ఒక శిష్యుడు అడగ్గా నారాయణ దాసు “స్వీయ చరిత్ర ప్రతి ఒక్కరూ వ్రాసేది కాదు. లోక ప్రసిద్ధి పొందిన వాడు మాత్రమే బ్రాసేది. అటువంటి వ్యక్తి చరిత్ర కోసం లోకం ఎదురు చూస్తింది. కానీ ఎంత ప్రసిద్ధుడైనా తన చరిత్ర తానే సంపూర్ణంగా వ్రాసుకోవడం సరి కాదు. లోక ప్రసిద్ధి పొందిన తర్వాత తన జీవితాన్ని వ్రాయటం స్వీయ చరిత్రకారుని పని కాదు. అది మరొకరు వ్రాయాలి. నేను ముప్పయి ఏళ్ళకే లోక ప్రసిద్దుడి నయ్యాను. అందుకే నేను అప్పటి వరకే వ్రాశాను” అని జవాబిచ్చారు.

ఆయనే మరోసారి ఇలా అన్నారు …
“మనిషిలో ముప్పయి యేండ్ల వరకే సుగుణం ఉంటుంది. ఆ తర్వాత పేరాస, అసంతుష్టి పెచ్చు పెరిగిపోతాయి. దైవత్వం నశిస్తుంది. దేవతలను అందుకే త్రిదశులు అన్నారు. ముప్పై ఏళ్ళు దాటిన అందరూ రాక్షషులే…”

నారాయణ దాసు గారు 1898 – 1903 మధ్య కాలంలో ఈ పుస్తకం రాసినట్టు చెప్తారు. రచనాపరంగా చూస్తే నారాయణ దాసు గారి నా యెరుక మొదటి స్వీయ చరిత్ర అవుతుంది. కాని ముద్రణాపరంగా చూస్తే వీర్శలింగం గారి స్వీయ చరిత్ర మొదటిదవుతుంది. వీరేశలింగం గారు రాసిన స్వీయ చరిత్రలో కొంత భాగం 1903లోనే చింతామణి ముద్రాక్షరశాలలో అచ్చయ్యింది. నారాయణ దాసుగారు రాసిన నా యెరుక 1976 లో కానీ అచ్చుకాలేదు.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.