త్యాగయ్య వాక్కు వేదవాక్కు

రాముడిని త్యాగయ్య లాలించినంతగా, మేల్కొల్పినంతగా, నిలదీసినంతగా, ప్రేమించినంతగా, ఆరాధించినంతగా, అభిమానించినంతగా గొడవపడినంతగా మరెవరైనా ఉన్నారా అనేది ప్రశ్నార్ధకమే. . ఆదికవి వాల్మీకి రామాయణం రాశాడు. అయితే ఆ కావ్య నాయకుడైన రాముడిని తన చిన్ని చిన్ని పదాలతో మనసువిప్పి కీర్తించిన త్యాగయ్య నిత్యస్మరణీయుడే. ఏమాత్రం తెలుగు తెలిసినా చాలు ఆయన కీర్తనలను ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అతి సామాన్యమైన మాటలతోనే రాముడిని భక్తజన కోటి ముందు ప్రతిష్టించిన త్యాగయ్య గొప్ప కవి. తత్వవేత్త, ఆధ్యాత్మికవేత్త. రసజ్ఞుడు.

“ఎందరో మహానుభాభావులు – అందరికీ వందనం” అని ఆయన చెప్తే మనమందరం త్యాగయ్యకే వందనం అని అనక తప్పదు.

1767 వ సంవత్సరం మే నాలుగో తేదీన తంజావూరు సమీపంలోని తిరువారూర్ లో పుట్టి తిరువయ్యారులో పెరిగిన త్యాగయ్య 1847వ సంవత్సరం జనవరి ఆరో తేదీన (పుష్య బహుళ పంచమి) నిర్వాణం చెందారు. సంగీత త్రిమూర్తులలో ఒకరుగా ఖ్యాతి గడించిన త్యాగయ్య అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం. ఆయన తల్లి సీతమ్మ. తండ్రి రామబ్రహ్మం. త్యాగయ్య తాతగారి పేరు గిరిరాజ బ్రహ్మం. 1784 లో పార్వతమ్మతో పెళ్లి అయ్యింది. ఆమె 1789 లో చనిపోగా మరుసటి సంవత్సరం సీతాలక్ష్మిని పెళ్ళాడారు.

ఇంట్లో ప్రతి రోజూ దేవతార్చనకు పువ్వులు కోసుకొచ్చే పని త్యాగయ్యదే. ఆయన తోటకు వెళ్లి పువ్వులు కోసుకొచ్చే దారిలో శొంఠి వెంకటరమణయ్య గారిల్లు ఉండేది. ఆ ఇంటి నుంచి ఎప్పుడూ భక్తి సంగీతం వినవస్తుండేది. ఆ సంగీతసాగరం త్యాగయ్యను ఎటూ కదలనిచ్చేది కాదు. తమ కొడుకు ఆ గానమాధుర్యానికి మంత్రముగ్దుడవడం గమనించిన తండ్రి రామబ్రహ్మం అతనిని శిష్యుడిగా స్వీకరించమని కోరగా అందుకు శొంఠి వెంకటరమణయ్యగారు సరేనన్నారు. త్యాగరాజు మొదట్లో గోడ మీద ప్రార్ధనాగీతాలు రాస్తుండేవారు.

జీవన్ముక్తికి భక్తి మార్గం ఉన్నతమైన మార్గమని చాటి చెప్పిన త్యాగయ్య చెప్పినన్ని నీతులు, చేసినన్ని సూచనలు, ఇచ్చినన్ని సలహాలు అన్నీఇన్నీ కావు.

రామకృష్ణ యతీన్ద్రుని వద్ద రామ మంత్రాన్ని ఉపదేషంగా పొందిన త్యాగయ్య 96 కోట్ల సార్లు ఆ మంత్రాన్ని జపించి ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని పొందారు. నారదులవారు “స్వరార్ణవం” అనే సంగీత గ్రంధాన్ని త్యాగయ్యకు ఇచ్చినట్లు ఒక కథనం. ఈ స్వరార్ణవం ప్రస్తావన త్యాగయ్య “స్వరరాగాసుదా రసయుత భక్తి …” అనే కీర్తనలో ప్రస్తావించినట్టు చెప్తారు. సంగీతాన్ని భక్తితోపాటు స్వరరాగాసుదారసంతో కలిపితే కలిగేది స్వర్గ సుఖమే మనసా అని కీర్తించిన త్యాగయ్య శొంఠి వెంకటరమణయ్యగారి దగ్గర నుంచి ఏడాది లోపే సంగీతానికి అవసరమైన అన్ని లక్షణాలపై గట్టి పట్టు సంపాదించారు.

సంగీతంలోని ఆయన ప్రజ్ఞను తెలుసుకుని రాజులు తమ వద్దకు వస్తే అపార సంపదను ఇస్తామని, బంగారు కాసులు ఇస్తామని కబురుపెట్టేవారు. అయితే త్యాగయ్య వారి మాటలతో ఉబ్బితబ్బిబ్బవలేదు. తనను తాను ప్రశ్నించుకుని
“నిధి చాల సుఖమా
రాముని సన్నిధి సేవ సుఖమా
నిజముగా పలుకు మనసా”అని కల్యాణి రాగంలో కీర్తించిన పాట అమోఘం. ఆయన జీవనవిధానానికి ఈ కీర్తన అడ్డం పడుతుంది. ఆయన రాజులు ఇచ్చే నిధి కంటే రాముడి సన్నిధి చాలనుకున్నారు. రాముడి ధ్యాన భజన సుదారసమని, అహంకార బంధనాలతో కూడిన మనసుకన్నా రాముడిని కీర్తించడమే ఘనమని చెప్పారు త్యాగయ్య.

అంతేకాదు త్యాగయ్య రాముడి మోముని పున్నమినాటి చంద్రుడి అందమగా అభివర్ణించారు. ఆ అందమైన మోముని ఎప్పుడు చూస్తానో అంటూ
“ఏ పనికో జన్మించితినని
నన్ను యెంచ వలదు శ్రీరామా
శ్రీపతీ శ్రీరామచంద్రా
చిత్తమునకు తెలియదా?
వాల్మీకాది మునులు, నరులు నిన్ను వర్ణించిరి
నా ఆశ తీరునా?
మేల్మియై ఉందును, సద్భక్తులు – మెచ్చుదురే …”
అని పాడారు.

అక్కడితో ఆగకుండా తనకో ఉద్యోగం కావాలంటూ…
“బంటురీతి కొలువియ్యవయ్య రామా
తుంట వింటి వాని మొదలైన మాదాదుల కొట్టి నేలకూల జేయు నిజ…”
అని రాముడిని కోరారు. ఆ కొలువుకి సరంజామా ఏమిటంటే పులకరింతతో కూడిన గగుర్పాటు అనే కవచం, రామభక్తుడిననే ముద్ర గల బిళ్ళ, రామనామం అనే కత్తి అని, అవే తనను ప్రకాశింప చేస్తాయని చెప్పారు త్యాగయ్య.

నిన్నే నమ్ముకున్న నేను “ఎన్నాళ్ళు తిరిగేది….ఎన్నాళ్ళు….ఎన్నరాని దేహములేత్తి ఈ సంసార గహనమందు …పన్నుగ చోరుల రీతిని …పరులను వేగించుచును…” అంటూ త్యాగయ్య ఉప్పు నుంచి కర్పూరం వరకు ఉంచవృత్తితో సంపాదించుకుని, వొట్టి మెప్పు కోసం బతుకుతూ, పొట్ట నింపు కొంటూ ఎన్నాళ్ళు తిరగాలి అని రాముడిని ప్రశ్నించారు. పైగా “మరుగేలరా ఓ రాఘవా …మరుగేల? ” నన్ను తప్పించుకుంటూ నిన్ను నువ్వు చాటు చేసుకుని తిరగటం దేనికి అని రాముడిని నిలదీయడం త్యాగయ్యకే చెల్లింది.

“నా ముందు సాక్షాత్కారిస్తే నీ సొమ్మేమైనా పోతుందా..” అనే విషయాన్ని
“ఎదుట నిలిచితే నీదు సొమ్ము లేమి పోవురా?
నుదుట వ్రాత గాని మట్టు మీరను
నా తరమా
తెలిసి మోసపోదునా ?” అనే కీర్తనతో గొడవపడ్డ త్యాగయ్యకు రాముడిని జోకెట్టడం. మేల్కొల్పడం కూడా వెన్నతో పెట్టిన విద్యేసుమా…

తన మాట కేంగానీ రామయ్యా “ఉయ్యాల లూగవయ్యా శ్రీరామా….” హాయిగా చక్కగా ఉయ్యాల ఊగు…నేను జోల పాట పాడుతానుగా అంటూ
“జోజో రఘుతిలకా రామా….జోజో కుటిలతరాలక రామా….జోజో నిర్ గునరూపా ….రామా…జోజో సుగునకలాప రామా ….జోజో ఫణి వర శయనా రామా…” అని నిద్రపోనిచ్చిన త్యాగయ్య పొద్దున్నే రాముడిని ఎలా మేల్కొల్పారో చూడండీ…

“మేలుకోవయ్యా మమ్మేలుకో రామా
మేలైన సీతాసమేత నా భాగ్యమా….”

“మేలుకో దయానిధీ
మేలుకో దాశరధీ
మేలుకో దయానిధీ
మిత్రోదయమౌ వేళ
నారదాది మునులు, సురలు
వరిజబావు, డిందుకలా
దారుడు నీ సన్నిధినే కోరి కొలువు గాచినారు
వెన్న, పాలు, బంగారు గిన్నెల నేనుంచినాను
తిన్నగారగించి తేట కన్నులతో నన్ను చూడ
రాజారాజాది దిగ్రాజు లెల్ల వచ్చినారు
రాజనీతి తెలియా త్యాగరాజ వినుత నన్ను బ్రోవ ”

అక్కడితో రాముడికి చెయ్యాల్సిన సేవ అయిపోయినట్టు అనుకోకూడదని ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే అని అనిపించుకోకుండా సదా రామనామ స్మరణతో గట్టెక్కాలి అని చెప్పిన త్యాగయ్య రాముడి అందాన్ని చూసి పొంగిపోతూ లోలోపల విపరీతమైన ప్రేమను పెంచుకున్నారు.

“వేద పురాణ ఆగమ శాస్త్రాదులకు మూలమైన సంగీత సుధారసమైన కోదండ రామా, సీతా దేవి మనస్సుని దోచుకున్నరామా నా దగ్గరకు రా, నా ఎదురుగా రా, నాకో ముద్దు ఇవ్వు, బంగారంవంటి రంగులు గల బట్టలు తొడుగుతా, నీకు సేవ చేసి సింగారించి కౌగిట్లోకి చేర్చుకుని నుదుట కస్తూరీ తిలకం పెడతా, నీ మేడలో ఉన్న ముత్యాల హారాన్ని సవరిస్తా, నా ప్రేమ నీ మీదే, నాకు మరెవ్వరు దిక్కు…నువ్వు తప్ప ” అని రారా సీతారమని మనోహరా” అని కీర్తించిన త్యాగయ్య పదలాలిత్యం , భక్తి పరవశం ఆయన కీర్తనలలో అడుగడుగునా ఆస్వాదించవచ్చు.

ఇక పంచరత్న కీర్తనల ప్రత్యేకత గురించి యేమని చెప్పాలి….
జగదానంద కారక….జయ జానకీ ప్రాణనాయకా…(నాట రాగం, ఆది తాళం), దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచారా? ఎంతో కాదు దుర్విషయా…(గౌళ రాగం, ఆది తాళం), సాధించెనే ఓ మనసా…బోధించిన సన్మార్గ వచనముల…బొంకు చేసి తా పట్టిన పట్టు సమయానికి తగు మాటలాడనే (ఆరభి రాగం, ఆది తాళం), కన కన రుచిరా … కనకవసన నిన్ను …దినదినమును మనసున చనువున నిన్ను” (వరాళి రాగం , ఆది తాళం), ఎందరో మహానుభావులందరికి వందనము …(శ్రీ రాగం, ఆది తాళం)….కీర్తనలను ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజు తిరువయ్యారులో త్యాగరాజు ఆలయంలో జరిగే ఆరాధనోత్సవాలలో సంగీత ఆరాధకులు ఒక్కటిగా పాడటం చూసి తరించాల్సిందే.

త్యాగయ్య బతికి ఉన్నంత కాలం ఆయనను అవహేళన చేసినవాళ్ళు, చిన్న చూపు చూసినవాళ్ళు అనేకులు. అయినా ఆయన ఎక్కడా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. సరాసరి రాముడితోనే పాటలతో మాట్లాడారు. రాముడినే నమ్ముకున్నాను అంటూ రాగ రత్న మాలికలతో తన ఆరాధ్యదైవాన్ని మనసుని రంజింపజేశారు. కోరి వచ్చితినయ్యా అనే పాటలో తన మనసుకి రాముడిని గొప్ప సంపదగా అభివర్ణించారు.

ఇంద్రియనిగ్రహం లేనప్పుడు వివేకవంతమైన బుద్ధి కలగదని, ఆత్మవిచారం కలగదని, ఆత్మ చింతన లేని వారికి శాంతి ఉండదన్న భగవద్గీత శ్లోకాన్ని స్పూర్తిగా చేసుకుని త్యాగయ్య
“శాంతము లేక సౌఖ్యం లేదు
సారసదళ నయన
దాంతునికైన
వేదాంతునికైన…” అనే కీర్తనతో నిజమైన సుఖం, ఆనందం బాహ్యవిషయాలలో ఉండబోదని ఇచ్చిన సందేశం ఎప్పటికీ వాస్తవమే. శాంతం లేని వారికి సౌఖ్యం ఉండబోదు. అందుకే మనస్సుని ఇంద్రియ సుఖాలకు అప్పగించకుండా రాముడి దయ పొందమన్న త్యాగయ్య వాక్కు వేదవాక్కు. ఇది తిరుగులేని రామబాణం.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.