త్రిశంకు స్వర్గంలో బాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయనకు ఒంటరిగా పోటీ చేయడమా లేక బీజేపీతో కలిసి పోటీ చేయడమా అన్నది తేలడం లేదు. తెలంగాణా విషయంలో ఆయన అనుసరించిన వైఖరి అటు తెలంగాణా వారికీ నచ్చలేదు, ఇటు సీమాంధ్ర వారికీ నచ్చలేదు. ఫలితంగా ఆయన పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉందో లేదో తెలియడం లేదు. అప్పటికీ ఆయన బీజేపీకి స్నేహ హస్తం చాచారు కానీ, బీజేపీ అగ్ర నాయకులు స్పందించలేదు. ముఖ్యంగా నరేంద్ర మోడీ నుంచి సానుకూల స్పందనే కరవయింది.  చంద్రబాబుతో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే తమకు కూడా నష్టమేనని బీజేపీ అనుమానిస్తోంది. ఆయనతో పొత్తు పెట్టుకోకపోతే కనీసం తెలంగాణలో అయినా నాలుగు స్థానాలు సంపాదించుకోవచ్చని ఆ పార్టీ ఆశ. ఆయనతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఆ పార్టీకి ఆ మాత్రం సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు.

ఇటీవల మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్లాలనుకున్నారు. అక్కడికి వెడితే పొత్తు గురించి బీజేపీ నాయకత్వంతో మాట్లాడవచ్చని భావించారు. కానీ ఎంతకూ ఆహ్వానం అందలేదు. దాంతో ఆయన తన ప్రియ మిత్రుడు, బీజేపీ సీనియర్ నాయకుడు అయిన ఎం. వెంకయ్య నాయుడుని ఆశ్రయించారు. చంద్రబాబుకు ఆహ్వాన పత్రాన్ని పంపే బాధ్యతను ఆయన తన మీద వేసుకున్నారు. దాదాపు చివరి క్షణంలో ఆయనకు ఆహ్వానం అందింది. అయితే అక్కడ ఆయనను మోడీ పట్టించుకోక పోవడంతో మిగిలిన నాయకులు కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. పొత్తు విషయం మాత్రం తేలలేదు. కిం కర్తవ్యం?

Send a Comment

Your email address will not be published.