తెలంగాణా బిల్లును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రెండు మార్గాలను ఆలోచిస్తున్నట్టు అభిజ్ఞ వర్గాల కథనం. ఇందులో మొదటిది తెలంగాణా బిల్లును వెనక్కు పంపడం. ‘కేంద్రం చెప్పినదాని ప్రకారం ఇది ముసాయిదా బిల్లు మాత్రమే. అందువల్ల మార్పులు చేర్పులకు దీన్ని వెనక్కు పంపించవచ్చు’ అని ఆయన తన సన్నిహితులతో అంటున్నారు. ఈ బిల్లులో అనేక లొసుగులు ఉన్నాయని, దీన్ని యథాతథంగా ఆమోదించడం జరిగే పని కాదని ఆయన ఖచ్చితమయిన అభిప్రాయంతో ఉన్నారు. బిల్లులో వివిధ ప్రాంతాల మధ్య పంపకాలకు సంబంధించి సరైన ప్రతిపాదనలు చేయలేదన్నది ఆయన వాదన.
ఒకవేళ బిల్లుపై చర్చ జరిగినా చివరి రోజున ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని కూడా ఆయన ఆలోచిస్తున్నారు. శాసనసభ సమావేశాల చివరి రోజున దీక్ష చేపట్టాలా లేక దీన్ని లోక్ సభ చర్చకు చేపట్టినప్పుడు దీక్ష ప్రారంభించాలా అనే దానిపై ఆయన తన సన్నిహితులతో చర్చిస్తున్నారు. మున్ముందు ఎం జరుగుతుందో ఫిబ్రవరి మొదటి వారంలో గానీ తేలదు.