దర్శక దిగ్గజం దాసరి

Dasari Narayana Rao

దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక లేరు.

కొంతకాలంగా తీవ్రఅనారోగ్యంతో బాధపడుతున్న దాసరి ఇటీవలే హైదరాబాదులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. పదహారు మంది వైద్యులతో కూడిన బృందం అనుక్షణం పర్యవేక్షిస్తూ వచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో దాసరి మే 30 వ తేదీన (మంగళవారం) సాయంత్రం మరణించినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. వైద్యులు ప్రకటించడానికి కాస్సేపు ముందే ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ దాసరిని చూసి వచ్చిన తర్వాత ఆస్పత్రి బయటకు వచ్చి ”గురువుగారిక లేరు… కాసేపట్లో బాడీని ఇంటికి తీసుకెళ్తున్నాం” అని కన్నీటి పర్యంతమయ్యారు.

1942 మే 4 వ తేదీన పాలకొల్లులో జన్మించిన దాసరి వయస్సు 75ఏళ్ళు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.

నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చిన దాసరి సినీ పరిశ్రమలోని అన్ని విభాగాలలోనూ తనదైన ముద్ర వేశారు.

సినీ ప్రపంచంలో మొట్టమొదటగా వంద చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన దాసరి తొలిసారిగా 1972 లో తాత – మనవడు చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం యెర్ర బస్సు. ఈ చిత్రం 2014లో వచ్చింది.

151 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన 53 చిత్రాలు నిర్మించారు. రెండువందలకు పైనే చిత్రాలకు మాటలు రాసిన దాసరి పద్దెనిమిది చిత్రాలకు పాటలు రాసారు.
సినీ పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ఆయన పెద్దన్న పాత్ర పోషించారు.

ప్రేమాభిషేకం, స్వర్గం – నరకం, అమ్మ రాజీనామా, శివరంజని, లంకేశ్వరుడు, బొబ్బిలి పులి, తూర్పు పడమర, గ్రీకు వీరుడు, పరమవీర చక్ర, మేఘసందేశం తదితర వచిత్రాలు సమర్పించిన దాసరికి జాతీయ స్థాయిలో రెండు అవార్డులు, తొమ్మిది నండీ అవార్డులు, నాలు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆంధ్రా విశ్వ విద్యాలయం 1986 లో కళాప్రపూర్ణ అవార్డుతో దాసరిని సత్కరించింది.

చివరగా ఇటీవలే సాక్షి మీడియా గ్రూప్ వారు దాసరిని తెలుగు శిఖరం అవార్డుతో దాసరిని ఘనంగా సత్కరించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శక రత్న దాసరి నారాయణరావుల కాంబినేషన్ లో ఓ సినిమా తెరక్కవలసి ఉంది. ఈ విషయాన్ని పవన్, దాసరి స్వయంగా ప్రకటించారు కూడా. తమ తారక ప్రభు ఫిలింస్ బ్యానర్ పై 38వ సినిమాగా పవన్ తో సినిమాను నిర్మిస్తున్నట్టు దాసరి తెలిపారు. కానీ అది నెరవేరని కలగా మిగిలిపోయింది.

దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ నరసింహన్, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య తదితరులు సంతాపం తెలిపారు

చైనాలో ఉన్న చిరంజీవి దాసరి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. మెగాస్టార్ తమ సంతాప సందేశంలో దాసరితో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మరణం యావత్తు చిత్ర పరిశ్రమకు తీరనిలోటన్నారు.

తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ సినీ, రాజకీయ రంగాల్లో దర్శకరత్న దాసరి తనదైన ముద్ర వేశారన్నారు. సినీ రంగంలో ఎంతో మందిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు కారణమైన ఆదర్శప్రాయుడు దాసరి అని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ తీసుకురావడంలో దాసరి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు

ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మాట్లాడుతూ తనకంటూ ఓ విశిష్టతను, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దాసరి అని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించారని, ఎన్టీఆర్‌తో చాలా సినిమాలు తీశారని చెప్పారు. ఆయన మరణం చాలా బాధాకరమని చెప్పారు. దాసరి, భార్య పద్మ తనను ఓ కుటుంబ సభ్యుడిలా చూసేవారని గుర్తు చేసుకున్నారు. రాజకీయంగానూ ఆయన రాణించారని, కేంద్రమంత్రిగా సేవలందించారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇలా ఉండగా సూపర్ స్టార్ రజినీకాంత్ మాట్లాడుతూ దర్శకనిర్మాత దాసరి నారాయణరావు మృతి పట్ల ప్రముఖ నటుడు రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి నారాయణ ఒకరన్నారు. దాసరి తనకు ఆత్మీయుడు, శ్రేయోభిలాషి, స్నేహితుడని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రజినీ పేర్కొన్నారు.

ప్రముఖ నటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ తెలుగు సినిమా అంబేద్కర్‌ దాసరినారాయణరావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా రోహిత్ మాట్లాడుతూ సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం అనునిత్యం ఆరాటపడిన వ్యక్తి దాసరి గారని, అలాంటి మనిషి మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు.

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి, ద‌ర్శ‌క‌ర‌త్న డాక్టర్ దాస‌రి నారాయ‌ణ‌రావు మృతి పట్ల తమ సంతాపాన్ని తెలిపారు. డాక్టర్ దాసరి తనకు ఆత్మీయ మిత్రులని, తాత మనవడు సినిమా మొదలుకొని రాములమ్మ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించి ప్రజల హృదయాలలో చెరగని తన ప్రత్యేక ముద్ర వేశారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.

Send a Comment

Your email address will not be published.