రాజేంద్ర ప్రసాద్ ఇక లేరు

సుప్రసిద్ధ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఇకలేరు.
తీవ్ర అస్వస్థతకు గురైన రాజేంద్ర ప్రసాద్ హైదరాబాదులోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015 జనవరి 12వ తేదీ రాత్రి కన్ను మూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారిలో ఒకరైన ప్రముఖ హీరో జగపతి బాబు రాజేంద్రప్రసాద్ కుమారుడే.

నటుడవాలనుకుని మద్రాస్ వెళ్లి అవకాశాలు రాక నిర్మాతైన వీరమాచినేని బాబు రాజేంద్రప్రసాద్ కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని డోకిపర్రులో 1932 నవంబర్ 4న జన్మించారు. వీరిది వ్యవవసాయ కుటుంబం. ఆయన తండ్రి జగపతి చౌదరి, తల్లి లక్ష్మీనరసమ్మ.

జగపతి పిక్చర్స్ జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతగా 1960, 70 దశకాలలో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఒక ప్రముఖ నిర్మాతగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు.

ఆయన దర్శకుడు కావడానికి దోహదపడ్డా వారు అక్కినేని నాగేశ్వర రావు. తెలుగు, తమిళ హిందీ భాషలలో మొత్తం 32 సినిమాలు సమర్పించిన రాజేంద్రప్రసాద్ డోకిపర్రులోను, కాకినాడలోనూ చదువుకున్నారు.

రాజేంద్రప్రసాద్ రాఘవ కళాసమితిని స్థాపించి అనేక పలు నాటకాలు ప్రదర్శించారు. అంతేకాదు స్త్రీ పాత్రలోనూ నటించి ఉత్తమ కథానాయిక అవార్డు కూడా అందుకున్నారు.

ఆయన నిర్మించిన తొలి చిత్రం అన్నపూర్ణ. నిజానికి ఈ సినిమాలో అక్కినేని హీరోగా నటించవలసింది. కానీ డేట్స్ కుదరకపోవడంతో కొంగర జగ్గయ్య హీరోగా ఆయన అన్నపూర్ణ చిత్రాన్ని సమర్పించారు. తదుపరి సినిమాను ఆయన అక్కినేనితో తీసారు. ఆ సినిమా పేరు ఆరాధన. అనంతరం ఆయన ఆత్మబలం, ఆస్తిపరులు, అక్కాచెల్లెల్లు, దసరాబుల్లోడు, బంగారుబాబు, కిల్లర్, సింహస్వప్నం, భార్యాభర్తల బంధం, బంగారుబొమ్మలు, పిచ్చిమారాజు వంటి మంచి చిత్రాలను నిర్మించారు.

ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రానికి ఆయన ఒక దర్శకుడితో తీయాలనుకున్నారు. కానీ ఆ దర్శకుడు అందుబాటులో లేనప్పుడు అక్కినేని ప్రోత్సాహంతో ఆయనే దసరాబుల్లోడు చిత్రానికి దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మొత్తం 14 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

కెప్టెన్ నాగార్జున, బంగారుబాబు వంటి చిత్రాలకు ఆయన రచయితగానూ పనిచేశారు.

1965లో అంతస్తులు సినిమాకు జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయన నిర్మాతగా, దర్శకుడిగా అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.

1980 నుండి ఆయన తీసిన చిత్రాలు అంతగా విజయం సాధించలేకపోవడంతో క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.

హైదరాబాదులోని ఫిల్మ్‌నగర్‌లో దైవసన్నిధానం నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ సినీరంగానికి చేసిన సేవలను సినీప్రముఖులు గుర్తు చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. ఆయన మృతి పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రసంతాపం వ్యక్తం చేసారు.
——————————————-
– యామిజాల

Send a Comment

Your email address will not be published.