దసరా దీపావళి ధూమ్ ధాం

అదే తీరు. అదే వరుస. అదే మాట, అదే పాట. 18 వసంతాలు తమలో ఇముడ్చుకొని వారు కొనసాగించిన పరంపర నెమరువేసుకుంటూ అత్యంత సుందరంగా పదహారణాల పల్లె పడుచులా తెలుగు సంస్కృతిని ముఖ ఛాయల్లో అందంగా తీర్చి దిద్ది మన తెలుగు మల్లెల సువాసనలను జడగా కూర్చి మన సత్సాంప్రదాయాలను కళ్ళకు అద్దుకునేలా మనసా వాచా కర్మణా తెలుగు కీర్తి బావుటాని ఎగురవేస్తున్న న్యూ జిలాండ్ తెలుగు సంఘం వారు ఎంతో అభినందనీయులు. మొన్న ఉగాది, నిన్న బతుకమ్మ, నేడు దసరా దీపావళి – ప్రాంతీయ వర్గ బేధం లేకుండా ఒకే గొడుగు క్రింద అక్కడి జిల్లాల ఎల్లలు దాటి ఇక్కడ ఒకే బాటలో నడుస్తూ అన్ని పండుగలు జరుపుకొని కొలమానంగా నిలుస్తున్నది ఈ తెలుగు సంఘం.

గతనెల 24 వ తేదీన ఆక్లాండ్ నగరంలోని అవండేల్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన దసరా దీపావళి పండగకు షుమారు 500 పైగా సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించారు.

సంఘం అధ్యక్షులు శ్రీ జగదీశ్వర రెడ్డి పట్లోళ్ళ దీప ప్రజ్వలనతో మొదలైన కార్యక్రమం పిల్లలు, పెద్దలు – అన్ని వయసుల వారు పాల్గొని వినోదకరమైన అంశాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సంవత్సరం “ఐడియా రాక్స్ ఇండియా” కార్యక్రమంలోని ఫేం శ్రీ అనిరుద్ చెరువు స్థానిక తెలుగు పాటలు పాడే వారితో కలిసి పాటల కార్యక్రమం నిర్వహించడం.

“Mrs India NZ” పోటీలో రెండవ బహుమతి గెలుచుకున్న శ్రీమతి శ్రీదేవి కృష్ణ పుసర్ల గారికి తెలుగు సంఘం సాదరంగా సన్మానం చేసింది.

ఈ కార్యక్రమానికి మిస్ మానస మరియు శ్రీమతి శ్రుతి గారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

శ్రీ జగదీశ్వర రెడ్డి గారు గత సంవత్సర కాలంలో ఈ కార్యవర్గం నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరిస్తూ ముఖ్యంగా ఈ సంవత్సరం జనవరి నెలలో చనిపోయిన విద్యార్ధి శ్రీ సంతోష్ కుమార్ చెరుకూరికి తెలుగు సంఘం ఆర్ధికంగా, నైతికంగా సహాయం అందించిందని తెలిపారు. అలాగే సంఘం సభ్యులు శ్రీ అరుణ్ కుమార్ నేలపాటి గారు ఈ సంవత్సరం మార్చి నెలలో గుండెపోటుతో మరణించిన విషయం గుర్తు చేసి వారికి తెలుగు సంఘం అందించిన సహాయాన్ని గురించి వివరించారు. జనవరి నుండి ఇప్పటివరకూ స్వచ్చంద సేవ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలిసి షుమారు 15 వరకూ నిర్వహించినట్లు తెలిపారు. “ఐకమత్యమే మహాబలం” అన్న వారసత్వాన్ని అందించిన గత 17 కార్యవర్గ సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే కార్యవర్గం కూడా ఈ పరంపరను కొనసాగించాలని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు, స్వచ్చంద సేవకులకు, ఆర్ధిక సహయాన్ని అందించిన వ్యాపార వేత్తలకు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రత్యేకంగా శ్రీ సీతారాం సల్వజి, శ్రీ వేణుగోపాల్ రెడ్డి బీరం, శ్రీ నరేందర్ రెడ్డి పట్లోళ్ళ, శ్రీ జగదీశ్వర రెడ్డి మగతల, శ్రీ కళ్యాణ రావు కాసుగంటి మరియు శ్రీ శ్రీనివాస్ పానుగంటి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.

 

Send a Comment

Your email address will not be published.