దీపం జ్యోతిః పరంబ్రహ్మం

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావించడం కద్దు.

జ్ఞానజ్యోతి…..చీకటి నిరాశా, నిస్పృహలకు అజ్ఞానికి గుర్తు. వెలుగు ఆనందానికి ఉత్సాహానికీ ప్రతీక. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి ప్రయాణించి జీవితంలో నూతన అర్ధాలు చూసుకోవాలనేది దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం. నరక చతుర్దశి నుంచి మూడు రోజులపాటు దీపాలు వెలిగించాలన్నది శాస్త్రం. అలా వెలిగించడం శుభకరం. క్షేమకరం. దీపం ఐశ్వర్యం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉంటుంది. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి. దీపావళి పండుగ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో ప్రపంచాన్ని కాంతిమయం చేస్తుంది.

దీపావళి పండుగ భారతీయ సంస్కృతికి ప్రతిబింబం. జాతి, కుల, మత, వర్గ, పెద్దా చినా అనే తేడాలు లేకుండా సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిందనే ఆనందంతో జరుపుకునే పండుగ దీపావళి. అమా వాస్య రోజున చీకటిని పారదోలుతూ దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళిపర్వంగా మారింది. అంతేకాదు లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు అంతులేని ఆనందోత్సహాలతో దీపావళిని జరుపుకున్నట్టు రామాయణం మాట.

దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ కారణముంది. పూర్వం ఒకసారి దుర్వాసుడు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. అయితే ఆ హారం తనకు అక్కర్లేదన్న రీతిలో ఇంద్రుడు దానిని ఐరావతము అనే గజరాజు మెడలో వేస్తాడు. తీరా ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసి దుర్వాసుడికి కోపం వస్తుంది. ఇంద్రుడిని శపిస్తాడు. ఆ శాపంతో ఇంద్రుడు రాజ్యమును కోల్పోతాడు. సంపద పోతుంది. దానితో ఏం చేయాలో తెలియక శ్రీహరికి తన గోడు చెప్పుకుంటాడు. అప్పుడు విష్ణువు ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని ఇంద్రుడికి చెప్తాడు. సరేనని ఇంద్రుడు అలాగే చేస్తాడు. దానితో సంతృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహంతో ఇంద్రుడు మళ్ళీ ముల్లోకాలకు అధిపతి అయ్యాడన్నది ఐతిహ్యం.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి పండుగ వస్తుంది. ఈ దీపాల పండుగకు ముందు రోజు బహుళ చతుర్థశి. దానిని నరకచతుర్థశిగా జరుపుకుంటాం. సూర్యోదయానికి ముందే తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేసి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకుల తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజ చేయడం ఆనవాయితీ. .అలాగే రకరకాల పిండివంటలుచేసి ఇరుగుపొరుగు వారికి ఇచ్చి ఆనందిస్తారు. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజామందిరంలోనూ, వాకిట్లోనూ దీపాలు వరుస క్రమంలో అమర్చడంతో ఇల్లంతా శోభాయమానం అవుతుంది. పూజ చేసిన తర్వాత ఇంటిల్లిపాదీ ఉత్సాహంగా బాణాసంచా కాలుస్తారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు వెలిగిస్తారు. శబ్దాలతో పేలే టపాకాయలను పేలుస్తారు. బాణాసంచా కాల్చడంలో ఓ ఉపయోగం ఉంది. లక్ష్మీకటాక్షం సిద్ధించడం అటుంచితే వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకొచ్చే క్రిమికీటకాదులు బాణాసంచా పొగకు చనిపోతాయి.

దీపావళి పండుగను ఒక్కో చోట ఒక్కోలా జరుపుకుంటారు. దీపాల వెలిగించడం, బాణాసంచా కాల్చడం సరేసరి. అయితే అస్సాం, బెంగాల్ లలో ఆ రోజు జరుపుకునే పూజను జగద్ధాత్రి పూజ అంటారు. ఒరిస్సాలో కుమారిపూర్ణిమగా జరుపుకుని కన్యలు అందంగా ముస్తాబవుతారు. దక్షిణ భారత దేశంలో బాలి చక్రవర్తిని అణచివేసిన మహావిష్ణువు విజయంగా జరుపుకుంటారు. రాజస్థాన్ లో ధన్ తెరాన్ అని అంటారు. ఈరోజున స్త్రీలు తమ నగలను నది జలంలో శుభ్రం చేస్తారు. అలాగే పిల్లిని లక్ష్మీదేవిగా పూజించడం ఒక ఆచారం. గుజరాత్ లో రకరకాల పిండి వంటలు నివేదించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు. మహారాష్ట్రలో లక్ష్మీపూజ, గణేష్ పూజ చేస్తారు. మార్వాడీలు దీపావళిని చాలా విశేషంగా జరుపుకుంటారు.

ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల అయిదు రోజులపాటు దీపావళి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఇది మూడు రోజుల పండగ.

చిన్న పిల్లలతో టపాకాయలు కాల్చేటప్పుడు పెద్దలు దగ్గరుండి కాల్పించడం మంచిది.

ఇలా ఉండగా, బాణాసంచా శబ్దాల వల్ల మూగ జీవాలకు ఎలాంటి ప్రమాదం జరుగకుండా ఉండటానికి ఈసారి హైదరాబాద్ లో కొన్ని సూచనలు చేసారు. భారీ శబ్దాలవల్ల ప్రతి సంవత్సరం కొన్ని మూగజీవాలు చనిపోతున్నాయని, కనుక వాటి ప్రాణాలను కాపుడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కొన్ని సూచనలు చేసారు. టపాసుల పేలుళ్లు మొదలవడానికి ఓ గంట ముందే పెంపుడు జంతువులను షికారుకు తీసుకు వెళ్లి ఇంటిలోకి తీసుకొచ్చి శబ్దాల భారి నుంచి దూరంగా ఉంచాలని, టపాకాయలు కాల్చేటప్పుడు వాటిని బాటకు తీసుకుపోకూడదని , పెను శబ్దాలు కాకుండా తక్కువ శబ్దంతో పేలే టపాకాయలను కాలిస్తే మంచిదని చెప్తున్నారు జంతు సంరక్షకులు.

ఏదేమైనా దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటూనే ప్రమాదాలకు తావివ్వకుండా జాగర్తపడటం అందరికీ మంచిది.
—————-
– చౌటపల్లి నీరజ
—————-

Send a Comment

Your email address will not be published.