దీపావళి

దసరా వెళ్ళిన మూడు వారాల తర్వాత ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి రోజుని దీపావళి పర్వదినంగా పాటించటం జరుగుతుంది. సాధారణంగా ఈ పండుగ రోజు అక్టోబర్ – నవంబర్ మాసాల మధ్యలో వస్తూ వుంటుంది.

పద్నాలుగేళ్ళ వనవాసం తర్వాత శ్రీరాముడు అయోధ్యా నగరాన్నితిరిగి చేరుకున్నరోజున తిథి అమావాస్య ! ఆ రాత్రంతా చీకటిమయంగా వుండటంతో ఆ చీకటిని పారదోలేందుకుగాను అయోధ్యా నగరవాసులు లక్షల సంఖ్యలోకాగడా దీపాలని వెలిగించి నగరాన్నిపట్ట పగలులా ప్రకాశించేలా వెలుగుల్నిచిమ్మించారు. అలా పౌరులు హర్షాతిరేకంతో ఎదురెళ్ళి శ్రీరామునికి స్వాగతం పలికిన అరేయి కాస్తా దీపావళిగా మన దేశచరిత్రలో నిలిచిపోయింది. ఆనాడు అయోధ్యానగర పౌరులు పొందిన ఆనందాన్ని ఈతరంలో మనం కూడా పంచుకుంటున్నట్లుగా ప్రతి ఏటా ఆసంతోష ఘడియల స్మరణార్థం ఈ దీపావళి పండుగని
జరుపుకుంటున్నాము.

దీపావళికి ముందు రోజున ప్రపంచమంతా నరక చతుర్దశి పండుగని జరుపుకుంటుంది.

ద్వాపరయుగ కాలానికి చెందిన ప్రాగ్జోతిష పురాధీశుడయిన నరకాసురుడి బాధలు మితి మీరి పోయాయట. ఆ కష్టాలబారినుంచి ప్రజలని తప్పించేందుకుగాను చతుర్దశి రోజున ఆ రాక్షసుని సంహరించాడట శ్రీకృష్ణ భగవానుడు. ఆ నరకాసురుడి వధ అనంతరం ద్వారకకు తిరిగి వచ్చిన భర్తకి హారతి పళ్ళెంతో ఎదురెళ్లి స్వాగతం పలికిందట సతి సత్యభామ. ఆ తర్వాత యుద్ధంలో అలిసి పోయి వచ్చిన భర్తని కూచోబెట్టి అతని శిరస్సుకీ, దేహానికీ తైలమర్దనం చేసి స్నానంపోసిందట.

ఆ స్నానాంతరం ధన ధాన్య మహాలక్ష్మిని పూజిస్తోన్న సత్యభామ ప్రక్కకి చేరి ఆమె భక్తికి చేదోడునందిస్తూ తన అసుర పోరాటపు అలసటని తీర్చుకున్నాడట శ్రీకృష్ణుడు.

అలా కృష్ణ భగవానుడి ఆ యుద్ధానంతర స్నానం ,లక్ష్మి పూజలే తదనంతర కాలంలో ఓ ఆచరణీయమయిన విధిగా మారాయి .  అందుకే మనమంతా నరక చతుర్దశి ముగింపు రోజున మంగళ హారతులని స్వీకరించిన అమావాస్య శుభ ఘడియల్లోనే దీపావళి పండుగ ఆచరణలోకి వచ్చింది. అదే సంస్కృతి ననుసరిస్తూ ఈ రోజున కూడా మనం ఆ వెలుగుల పండుగకి జీవం పోస్తున్నాం.

యిక యితర పౌరాణిక కారణాలని పరిశీలిస్తే మనకు ఈ క్రింది విశేషాలు తెలిసివస్తాయి.

* ఈ దీపావళి పర్వదినోత్పన్న కాలంలోనే శ్రీమన్నారాయుణుడు వామనావతారాన్ని ధరించి పేద బ్రాహ్మణ రూపధారిగా విచ్చేసి
బలి చక్రవర్తిని అధః పాతాళంలోకి అణగ దొక్కాడట.

* యిదే తిథి రోజున అదే శ్రీకృష్ణుడు బాల్యంలో దేవేంద్ర దుశ్చర్యని ప్రతిఘటిస్తూ గోవర్ధనిగిరినెత్తి గోవుల్నీ, ప్రజల్నీవర్షాతిరేకంతో పొంగిన నదుల బారినుంచి కాపాడట.

* అదేవిధంగా యిదే తిథినాడు పాండవులు కూడా పధ్నాలుగేళ్ళ వనవాసాన్నీ, ఓ సంవత్సర అజ్ఞాతవాసాన్నీ ముగించి తమ రాజధాని హస్తినాపురికి తిరిగి చేరుకున్నారట.

* మరో పౌరాణిక గాథానుసారం యమధర్మ రాజు యిదే రోజున తన సోదరి యామి (యమునా నది) గృహానికి వెళ్ళగా ఆమె
హారతి పళ్ళెంతో ఎదురొచ్చి స్వాగతం పలుకగా యముడు తన స్వర్ణ కంకణాన్ని తీసి ఆమెకి తన కానుకగా ఆ పళ్ళెంలో వేసాడట.
దాంతో ఈ చర్య కూడా మన దేశాచారంగా మారిపోయింది. ఉత్తర భారత దేశంలో ఈ పండుగని అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు
‘భాయ్ ధీజ్’ పేరిట అతి ప్రేమగా జరుపుకుంటారు. అదే పండుగని దక్షిణ భారత దేశంలో నరక చతుర్దశి నాడు అన్న- దమ్ములకి
అక్క-చెల్లెళ్ళు మంగళ హారతితో స్వాగతించటం ఆనవాయితీగా మారి పోయింది.

* యిదే రోజుని భారత దేశంలోని మార్వాడీ జాతీయులు వారి నూతనసంవత్సరాదిగా పరిగణించటం జరుగుతోంది. చతుర్దశాంతంతో
గత సంవత్సరపు వ్యాపార నష్టాలకి ఉద్వాసన చెబుతూ వారు ఈ అమావాస్య రేయి వెలుగుల్లో తమ నూతన జీవన యానానికి
స్వాగతం పలుకటం జరుగుతోంది.

* యిదే రోజున మొఘలు చక్రవర్తి జహంగీరు సిక్కు మతపోషకుడయిన గురు హరగోవిందుని మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్ చెరసాల
నుంచి విముక్తుని చేసాడట. అందుకే సిక్కు మతస్తులు యిదే రోజుని ‘బందీ ఖోర్ – ఖోల్’ (బంధ విముక్తి) దినంగా పరిగణిస్తూ
దేశమంతటా పండుగ జరుపుకుంటారు.

* చివరగా జైనమత గురువైన మహావీరుడు కూడా యిదే రోజున మోక్ష దశకు చేరుకోవటం కారణాన ఆ మహనీయుని జ్ఞాపకార్థం
జైన మతస్తులంతా విశ్వవ్యాప్తంగా గురుస్మరణ దినంగా నివాళులు అర్పించటం జరుగుతోంది.

ఈ విధంగా పౌరాణిక దశని వెన్నంటుతూ అనాది కాలం నుంచీ దీపావళి పర్వదినం జగద్విదితంగా శోభిల్లుతూవస్తూనే వుంది . !
SP Chari

Send a Comment

Your email address will not be published.