దీర్ఘనిద్రలో జనం పాట

Guda Anjaiahప్రజల కవిగా మన్ననలందుకున్న ప్రముఖ రచయిత గూడ అంజన్న తనను తమ పాటలతో స్మరించుకోమన్నట్టుగా దీర్ఘనిద్రలోకి పోయారు. కామెర్లు తదితర అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న అంజన్న రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని రాగన్నగూడెంలో గల తమ నివాసంలో జూన్ 21వ తేదీ సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

“ఊరుమనదిరా…. ఈ వాడ మనదిరా” ….”నేను రాను బిడ్డో….సర్కారు దవాఖానకు…” భద్రం కొడుకో…” తదితర అనేక పాటలతో జనం మధ్య ఉండిపోయిన అంజన్న ఏ పాటను తీసుకున్నా అందులో చరిత్ర ఉంటుంది తప్ప ఏదో పాట కోసం పాట రాస్తున్నట్టు అనిపించదు.

1955 లో ఆదిలాబాద్ జిల్లా లింగాపురం పల్లెలో గూడ లక్ష్మయ్య, లక్ష్మమ్మ దంపతులకు జన్మించిన అంజయ్య తమకు ఊహ తెలిసినప్పటి నుంచి సామాజిక దుస్థితి, దళితుల దయనీయ స్థితిని దగ్గరుండి చూసి మనసుని కదల్చివేసిన సంఘటనలను మననం చేసుకుని పెన్ను పట్టే వారు. తన పదిహేనో ఏట ప్రజల యాసను ఒంటపట్టించుకుని వారి బాధలను పాటలలో పలికించారు.

తొలిరోజుల్లో విప్లవోద్యమానికి ఊపిరి పోసిన అంజయ్య తెలంగాణా పోరాటంలో ఎన్నో పాటలు రాశారు.

లింగాపురంలో నాలుగో తరగతి వరకు చదువుకున్న అంజయ్య అయిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు లక్సెట్టిపేటలోని తాలూకా స్కూల్లో చదువుకున్నారు. ఆయన ఎనిమిదో తరగతి చదువుతున్న రోజుల్లో ఇండో – చైనా యుద్ధం జరిగింది. అప్పుడు భారత దేశం గెలవాలని స్థానికంగా జరిగిన ర్యాలీలలో ఆయన కూడా పాల్గొన్నారు. దేశం గురించి తమకు గురువులు ఎంతో గొప్పగా చెప్పేవారని ఆయన అన్నారు.

1970 ప్రాంతంలో హైదరాబాదు వచ్చి చంచల్ గూడ జూనియర్ కాలేజీలో చదువుకున్న అంజన్నకు శ్రీశ్రీ ప్రసంగాలంటే చాలా ఇష్టం. అందుకే శ్రీశ్రీ సభలు ఎంతదూరమున్నా వెళ్లి పాల్గొనేవారు. అలాగే దిగంబర కవులలో ఒకరైన చెరబండరాజు కవితలన్నా అంజన్నకు అభిమానం అందుకే చెరబండరాజు కవితలను ఎప్పుడూ మననం చేసుకునేవారు.

ఆయన రాసిన మొదటి పాట “ఊరిడిచి నేబోదునా ….ఉరి బెట్టుకుని సద్దునా…” .

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రారంభించి దాని తరఫున ఊళ్ళు తిరిగి జనం పాటలు పాడుతూ ప్రజలతో మమేకమైన అంజన్న రాసిన పాటల్లో ఆణిముత్యమైన “ఊరు మనదిరా…ఈ వాడ మనదిరా …” దేశం మొత్తమ్మీద 16 భాషల్లోకి అనువాదమయ్యింది.

ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ టైం లో అరెస్టై రెండేళ్లు జైలు జీవితం కూడా చదివిన అంజన్న పాలటెక్నిక్ చదివారు. ఆదిలాబాదులో ఫార్మసిస్టుగా పనిచేసిన అంజన్న1979 లో హేమతో పెళ్లయ్యింది. అంజన్న దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

తన పాటలతో జనంలో చైతన్యాన్ని తీసుకువచ్చిన అంజన్న ను తెలంగాణా రాష్ట్రావతరణ ఉత్సవాలలో తెలంగాణా ప్రభుత్వం ఆయన ప్రజాకవిగా ఘనంగా సత్కరించింది.

రంగుల కళ చిత్రంతో వెండితెరకు కూడా పరిచయమైన అంజన్న పాటల్లో ఎప్పుడూ భావోద్వేగానికి కొరత లేదు. సినీ సాహిత్యంలో కొత్త ఒరవడికి నాంది పలికిన అంజన్నకు ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కాయి.

ఆయన మృతి పట్ల తెంగాణా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణా మంత్రులు, సాహితీవేత్తలు పలువురు ఆయన మరణం తీరని లోటని తెలిపారు.

Send a Comment

Your email address will not be published.