దుబ్బూ దుబ్బూ దీపావళికి స్వాగతం

దీపావళి …చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనం చేసే రోజు కావడం వల్ల దీనికి దీపావళి అని అంటున్నాం.

హిందూ మత సంస్కృతికి సంప్రదాయానికి దీపావళి ఓ పర్వ దినం. మన దేశంలో కలకాలంగా జరుపుకునే పండుగులలో దీపావళి ఒకటి.

ఈ పండుగకు సంబంధించి అనేక కథలు ఆధారాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో ఆధారాన్ని చెప్పుకుని ఈ పండుగను జరుపుకుంటారు. పురాణాలలోనూ ప్రస్తావన లేకపోలేదు.

రాక్షస రాజు బాలి చక్రవర్తి పాతాళానికి విష్ణువుచే అణగదొక్కబడిన రోజు కావడంతో ఇదొక మహోత్సవంగా పరిగణిస్తారు.

రామాయణంలో శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయిన రోజు కావడంతో ఈ రోజు పండుగలా జరుపుకుంటారు.

విక్రమ శక స్తాపకుడు అయిన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడు అయిన రోజు కాడంతో మరి కొందరు ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు.

దీపావళి ముందురోజు నరక చతుర్దశిగా చెప్పడం తెలిసిందే కదా….. నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించిన రోజు కావడం వల్ల నరకా చతుర్దశి పేరు వచ్చినట్టు చెప్తారు. కానీ నరకాసురుడి కథకు నరక చతుర్దశికి ఎలాంటి సంబంధం లేదని చెప్పే వాళ్ళు ఉన్నారు. నరక చతుర్దశి అంటే నరకం నుంచి తరింప చేసే చతుర్దశి అని శాస్త్రం చెబుతోంది అనే వారున్నారు. నిర్ణయ సింధువులో ఇలాగే ఉంది కూడా.

మన రాష్ట్రంలో రెండు రోజులు దీపావళి  పండుగ చేసుకుంటే మహారాష్ట్రలో అయిదు రోజులు జరుపుకున్న రోజులున్నాయి. మహారాష్ట్రలోని హిందువుల పండుగలలో దీపావళికి ఎంతో ప్రాధాన్యముంది. ఆంద్ర దేశంలో దీపావళి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో పిల్లలు దివిటీలు కొట్టే  ఆచారం ఉంది. ఇందుకు గోగుదుత్తలు, గోగు కర్రలు, లేదా చెరకు కర్రలు లేదా ఆముదపు కర్రలు వినియోగిస్తారు. దివిటీలు కొట్టేటప్పుడు “దుబ్బూ దుబ్బూ దీపావళి …మళ్ళీ వచ్చే నాగుల చవితి….పుట్ట మీద పొట్ట కర్ర …పట్టుకురా బావమరిది…” అని పాట పాడుతారు. అలాగే ఆ రోజు రాత్రి లక్ష్మీ పూజ చేస్తారు. హిందువులలో గుజరాతీలు, మార్వాడీలు ఈ పూజను ఘనంగా చేస్తారు. లక్ష్మీదేవి ఈరోజు భూలోకానికి దిగి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని , అప్పుడుఇళ్ళల్లో లక్ష్మీదేవి  కళగా ఉంచుతుందని  హిందువుల నమ్మకం. లక్ష్మీ పూజ చేసిన తర్వాత ఆరోజు రాత్రి నిద్రపోరు.

దీపావళి అమావాస్య మొదలు ముప్పై రోజులపాటు అంటే మళ్ళీ అమావాస్య వచ్చే వరకు తాముందే ఇంటి వెలుపల ఆకాశ దీపం పెడితే ఎంతో పుణ్యమని శాస్త్రం చెబుతోంది.

దీపావళి రోజు మట్టి ప్రమిదలలో నూనె పోసి వొత్తి వెలిగించడం మంచిది. ఏదో సోకు కోసం సీరియల్ బల్బులు వెలిగించడం వంటివి చేస్తున్నా మట్టి పరదాలలో నూనె పోసి దీపం వెలిగించడమే శ్రేష్టం.

ఇక దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే కాకరపువ్వొత్తులు, చుచ్చుబుడ్లు, తారాజువ్వలు, రంగురంగుల అగ్గిపుల్లలు వెలిగించడం చప్పుడు చేసే బాణా సంచా కాల్చడం సర్వసహజం.

ఈ పండుగ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంత ప్రమాదం కూడా తెచ్చి పెడుతుంది. దీపాలు వెలిగిస్తునప్పుడో బాణాసంచా కాలుస్తున్నప్పుడో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న గాయాలు ఏర్పడే ప్రమాదముంది. కనుక చిన్న పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు వారి దగ్గర పెద్దలు ఉంది పర్యవేక్షించడం శ్రేయస్కరం.

మలేషియాలో దీపావళిని హరి దివాళి అని అంటారు. ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా మలేషియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సురినామ్, సింగపూర్, ఫిజీ తదితర దేశాలలో కూడా దీపావళి రోజును  జాతీయ సెలవు దినంగా పాటిస్తారు.

నేపాల్ లో తిహార్ లేదా స్వాతి అంటారు ఈ పండగను.  దీర్ఘాయువు కోసం యమధర్మరాజును పూజిస్తారు.

వెస్ట్ బెంగాల్ లో కాళీ మాత పూజ చేస్తారు.

కాశ్మీర్లో ప్రత్యేకించి కాశ్మీర్ పండిట్లు కూడా దీపావళిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఒరిస్సాలో భిన్నంగా జరుపుకుంటారు. మరణించిన వారి ఆత్మలను పిలిచి మాట్లాడే సంప్రదాయం ఉంది. జానప నార కాండాలను కాలుస్తారు. ఇలా కాల్చగా వచ్చే వెలుగులో ఆత్మలను పిలిచి మాట్లాడుతారు.

దీపావళి రోజు గాంబ్లింగ్ వల్ల అదృష్టం కలసి వస్తుందని విశ్వసించే హిందువులు ఉన్నారు. ఆ ఏడాది పొడవునా సుఖసంతోషాలతో గడపవచ్చని వారి నమ్మిక.

1577వ సంవత్సరం నుంచి సిక్కులు దీపావళిని క్రమంతప్పకుండా జరుపుకుంటున్నారు. ఆ ఏడాది దీపావళి రోజున స్వర్ణ దేవాలయానిర్మాణానికి శంకుస్థాపన చేసారు. కనుక అప్పటినుంచి ఈ పండగను సిక్కులు ఘనంగా జరుపుతున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వ్యాపారులు కొత్త పద్దుల పుస్తకాలు ప్రారంభిస్తారు. దీపావళి రోజును వాళ్ళు నూతన ఆర్ధిక సంవత్సరంగా భావిస్తారు. అందుకే వినాయకుడికి పూజలు చేసి వ్యాపారం మొదలుపెడతారు.

దీపావళి రోజున మహావీరుడు మోక్షం పొందిన రోజు. కనుక జైనులు దీపావళి మరుసటి రోజున కొత్త సంవత్సరంగా పండగ జరుపుకుంటారు.

– నీరజ చంద్రన్

Send a Comment

Your email address will not be published.