దురుసుగా ప్రవర్తిస్తే నిషేధమే!

Airlinesవిమాన ప్రయాణంలో దురుసుగా ప్రవర్తిస్తే ఇక మీదట కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి పి. అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ, విమానంలో ప్రయాణికులు దురుసుగా ప్రవర్తించినా, ఆడ సిబ్బంది పట్ల, తోటి ప్రయాణికుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా ఇకపై వేటు తప్పదని తెలిపారు. సమస్య తీవ్రతను బట్టి జీవిత కాలం ఆ ప్రయాణికుడిని విమాన ప్రయాణం నుంచి నిషేధించడం కూడా జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆయన సరికొత్త విమానయాన విధానం గురించి తెలియజేస్తూ, దురుసు ప్రవర్తనను మూడు కేటగిరీలుగా విభజించారు. దూషణను మొదటి కేటగిరీగా, భౌతిక దాడిని రెండవ కేటగిరీగా, ప్రాణాంతక చర్యలను మూడవ కేటగిరీగా ఆయన తెలిపారు. కేసు తీవ్రతను బట్టి మూడు నెలల నుంచి జీవిత కాలం నిషేధించడం జరుగుతుందని రాజు తెలిపారు. ఇందులో దూషణకు మూడు నెలలు, భౌతిక దాడికి ఆరు నెలలు, ప్రాణాలు పోయే స్థాయిలో ఏమైనా చేస్తే రెండేళ్ల నుంచి జీవిత కాలం వరకు విమాన ప్రయాణాన్ని నిషేధిస్తామని మంత్రి వెల్లడించారు. ఇందుకు విమానయాన సంస్థలో ఒక ఉన్నతాధికార కమిటీని నియమించామని, ఇది విచారణ జరిపి శిక్షను నిర్ణయిస్తుందని మంత్రి తెలియజేసారు. తిట్టడం, మద్యం సేవించి దౌర్జన్యం చేయబోవడం, అసభ్యంగా సైగలు చేయడం దురుసు ప్రవర్తన కిందకు వస్తాయి. నెట్టడం, లాక్కోవడం, తన్నడం, తాక రాని చోట తాకడం వంటివి దాడి కిందకు వస్తాయి.

Send a Comment

Your email address will not be published.