దేవదేవుని బ్రహ్మోత్సవాలు

Brahmotsavam

చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవం తొలి రోజు మలయప్పస్వామి ఉభయ దేవేరులతో కలిసి పెద్దశేష వాహనంపై తిరువీధులలో విహరించారు. ఆదిశేషువు తల భాగం తిరుమల అని అందరికీ తెలిసందే. నిత్యమూ గోవిందుడి సేవలో ఆదిశేషువు తరిస్తాడు. అందుకనే స్వామి తన తొలి వాహనసేవను పెద్దశేష వాహనంపై ప్రారంభించడం విశేషం. ఏడుపడగల పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవిలతో కలిసి విహరించే స్వామిని చూస్తే అనంతమైన ఆధ్మాత్మిక ఆనందం కలుగుతుందని భక్తులప్రగాఢ విశ్వాసం.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన తన కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు.
శనివారం సాయంత్రం తొలుత విష్వక్సేనుడు నిర్ణీత పునీత ప్రదేశంలో ‘భూమిపూజ’తో మట్టిని సేకరించి ఛత్ర చామర మంగళవాద్యాలతో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో శాలి, వ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు తదితర నవ ధాన్యాలతో అంకురార్పణం చేశారు.

ధ్వజారోహణలోనూ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మీన లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి బ్రహ్మోత్సవాలను ఆరంభించారు. ఆనంద నిలయంలో అర్చామూర్తిగా అవతరించిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి దివ్యమంగళ విగ్రహాన్ని క్షణకాలమైనా వీక్షిస్తే చాలని తలిచే భక్తులను ఆపదమొక్కులవాడు అన్ని విధాల తరింపజేస్తున్నాడు. అత్యంత మహిమాన్వితమైన ఈ తిరుమల క్షేత్రంలో ఆనందనిలయం పేరిట పెద్ద ఆలయాన్ని నిర్మించారు. తొండమాన్‌ చక్రవర్తి దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పదిహేనవ శతాబ్దంలో తాళ్లపాక అన్నమయ్య తిరుమలలో నివసించి స్వామి వారి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేశారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయం విశేషంగా రూపుదిద్దుకుంది.

ఇలావుండగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అనంతపురం రేంజ్‌ డీఐజీ జె.ప్రభాకరరావు, టీటీడీ సీవీఎస్‌వో రవికృష్ణ, తిరుపతి అర్బన్‌ జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి ఉత్సవాల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.