దేవీ నవరాత్రులు ..

ఆశ్వయుజ, కార్తీక మాసాలు శరదృతువు కిందకు వస్తాయి. శరత్కాలం కాబట్టి ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అని అంటారు. తొమ్మిది రోజుల పాటు దేవిని దుర్గాదేవిని రోజుకొక్క రూపం చొప్పున తొమ్మిది రూపాలలు పూజించడం సంప్రదాయం.

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం నవదుర్గలు ఇవే – శైల పుత్రి. బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ స్కంద మాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. మరో పట్టిక ప్రకారం కుమారిక, త్రిమూర్తి, కల్యాణి, రోహిణి, కాలి, చండిక, శాంభవి, దుర్గ, భద్ర. మొత్తంమీద దుర్గ, లక్ష్మి, సరస్వతి మొదలైన తొమ్మిది రూపాలలో దేవిని పూజిస్తారు.

ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి మొదలు తొమ్మిది రోజులు పర్వదినాలు. ఈ తొమ్మిది రాత్రులను నవరాత్రులు అంటారు. విదియ తిథి కూడా ప్రారంభమైన పాడ్యమి రోజే నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ తిథులలో అష్టమి రోజు దుర్గను పూజిస్తారు. కనుక ఆరోజును దుర్గాష్టమి అంటారు. దశమి రోజు విజయదశమి పండుగను నిర్వహించడంతో శరన్నవరాత్రులు ముగుస్తాయి.

మొదటి రోజున శైలపుత్రి దుర్గ నంది తన వాహనంగా కుడి చేత త్రిశూలాన్ని, ఎడమ చేత పద్మ పుష్పాన్ని ధరించి దర్శనమిస్తుంది.

రెండో రోజు బ్రహ్మచారిణిగా దేవి తపోదీక్షాదారిణిగా కనిపిస్తుంది. కుడి చేతిలో రుద్రాక్ష మాల, ఎడమ చేతిలో కమండలం ధరించి దేవి దర్శనమిస్తుంది.

మూడవ రోజు దేవి చంద్రఘంటంగా దశ హస్తాలతో కనిపిస్తుంది. పది చేతులలోను పది ఆయుధాలు ఉంటాయి. వాహనం సింహం. షోడశ కళల చంద్రుడి రూపం ఈ రోజున ఘంట రూపంలో కనిపిస్తుంది.

నాలుగో రోజున కూష్మాండగా దేవి దర్శనమిస్తుంది. ఎనిమిది చేతులు కలిగి రూపం అష్ట భుజ అని కూడా దేవిని కొలుస్తారు. ఏడు చేతులలో వరుసగా విల్లు, బాణం, పద్మపుష్పం, అమృత కలశం, గద ధరించి ఎనిమిదో చేతిలో రుద్రాక్షలు ఉంటాయి. గుమ్మడి కాయ బాలి ఈ దేవికి పరమ ప్రీతీ.

ఐదో రోజున స్ఖంద మాటగా దేవి కనిపిస్తుంది. దేవికి నాల్కుగు చేతులు ఉండి ఊర్ధ్వ దక్షిణ హస్తంలో స్కంధ బాలుడిని, అదో దక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి ఊర్ధ్వ వామ హస్తంలో ఆశీర్వాద ముద్రను, అదో దక్షిణ హస్తంలో పద్మాన్ని ధరించి ఉంటుంది. పద్మంపై కూర్చుని ఉంటుంది దేవి.

ఆరో రోజున దేవి కాత్యాయని రూపంలో బంగారు ఛాయతో తళుకు లీనుతూ ఉంటుంది. సింహవాహిని.

ఏడవ రోజున దుర్గాదేవి కాళరాత్రి రూపంలో దర్శనమిస్తుంది. ఆ రాత్రి అంతా నల్లగా జుట్టు విరబోసుకుని మెరుపుల కాంతులు వెదజల్లే గళ మాలతో త్రినేత్ర అయి నిప్పులు కక్కుతూ దర్శనమిస్తుంది. కాళరాత్రి రూపంలో ధ్వంసించే విలయకారిణిగా దేవిని కొలుస్తారు.

ఎనిమిదో రోజున మహాగౌరిగా ధవళ విలాసినిగా దేవి కనిపిస్తుంది. వాహనం నంది.

తొమ్మిదో రోజున మహర్నవమి నాడు దేవి సిద్ధిదాత్రిగా విజయాన్ని సిద్ధింప చేసే శక్తిశాలినిగా ఆడ్శాక్తిగా పూజలందుకుంటుంది. ఈ దేవి ఒక్కో దశలో పద్మాసినిగా మరో దశలో సింహవాహినిగా దర్శనమిస్తుంది.

లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్ధిని అయి ప్రజలను ఆలించి పాలించి శుభ ఘడియలను స్మరిస్తూ చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గా పూజల ముగింపులో దేవి విసర్జన జరుగుతుంది.

దేవీనవరాత్రులలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రకపు పూల మాల సమర్పిస్తారు.
మొదటి రోజు బిల్వదళ మాల లేదా మల్లె మాల గానీ, రెండవ రోజు జాజిపూల మాల లేదా తులసీదళ మాల, మూడవ రోజు మరువం మాల లేదా సంపంగి మాల, నాలుగవ రోజు సన్నజాజుల మాల లేదా పచ్చ రంగు ఆకుల మాల, అయిదవ రోజు పారిజాతాల మాల లేదా బూడిద రంగు ఆకుల మాల, ఆరవ రోజు గంధపు ఆకుల మాల లేదా మందార పూల మాల, ఏడవ రోజు తుమ్మి ఆకుల మాల లేదా మొగలి పూల మాల, ఎనిమిదవ రోజు గులాబీల మాల లేదా పన్నీరు ఆకుల మాల, తొమ్మిదో రోజు మరువ, దవనాల మాల లేదా నేరేడు ఆకుల మాల అమ్మవారికి సమర్పించాలి. అలాగే అమ్మవార్కి శక్తి కొద్ది రోజు నైవేద్యం పెట్టి ప్రసాదాలు ఇస్తారు.

ఇక తెలంగాణాలో ఈ నవరాత్రుల వేళ బతుకమ్మ పేరిట ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మలో ఉపయోగించే గునుగు, తంగేడు పువ్వులకు నీటిని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి. బతుకమ్మను ముందుగా వెదురుతో సిబ్బిని తయారు చేస్తారు. దాని మీద గుమ్మడి ఆకు ఉంచి దానిమీద తంగేడు పువ్వులు, వాటిపై గునుగు…ఇలా ఒక్కో వరసలో ఒక్కో రకం పువ్వులు పేర్చి బతుకమ్మ అగ్ర భాగాన తంగేడు పువ్వులు పరచి అందులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. బతుకమ్మను జంటగా పేర్చడం సంప్రదాయం. వాటిలో ఒకటి తల్లి బతుకమ్మ అయితే మరొకటి పిల్ల బతుకమ్మ. బతుకమ్మ ముఖ్యంగా స్త్రీల పండుగ. బతుకమ్మ చుట్టూ ఆడుతూ పాడుతూ వేడుకలు చేసి చివరికి వాటిని నిమజ్జనం చేస్తారు. పురాణంతో పాటు చారిత్రిక విశేషం ఉన్న బతుకమ్మ పండుగ కాకతీయుల కాలం నుంచీ ఈ తొమ్మిది రోజులను పరమ పవిత్రంగా భావిస్తున్నారనేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి.

మొత్తంమీద దేవి నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో అటు ఆంధ్రదేశం ఇటు తెలంగాణా రాష్ట్రంలోను అమ్మవారి దేవాలయాలన్నీ దేదీప్యమానమై కళకళలాడుతున్నాయి.

– నీరజా చంద్రన్

Send a Comment

Your email address will not be published.