ధ్రువ తార నేల రాలింది

సినీ వినీలాకాశంలో నిత్యం దేదీప్యమానంగా వెలుగుతున్న ఒక  ధ్రువ తార నేల రాలి పోయింది.  సినీ జగత్తులో మేరు  శిఖర సమానుడిగా  వెలుగొందిన  నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు మంగళ వారం  అర్ధరాత్రి  దాటాక బుధవారం  తె ల్లవారు జామున  2.45 నిమిషాలకి హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో  మరణించారు.

గత నాలుగు నెలలుగా కాన్సర్ తో బాధ పడుతున్న అక్కినేని నాగేశ్వర రావు బుధవారం తెల్లవారు జామున 1.30 కి  తీవ్రమైన అస్వస్తతకి గురి కావడంతో  కుటుంబ సభ్యులు ఆయన్ని కేర్ ఆస్పత్రి కి తరలించారు. డాక్టర్లు గంట పాటు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. కోట్లాది మంది  అభిమానుల్నీ, కుటుంబ సభ్యుల్నీ తీవ్ర విషాదంలో నింపి ఈ దేవదాసు నింగి కేగి  పోయాడు. ఆ సమయం లో ఆయన కుమారుడు యువ సామ్రాట్ నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు అంతా ఆయన పక్కనే ఉన్నారు.

కృష్ణా జిల్లా  గుడివాడ తాలూకా లోని వెంకట రాఘవ పురంలో  1924, సెప్టెంబర్ 20 వ తేదీన పున్నమ్మ, వెంకట రత్నం దంపతులకి జన్మించాడు అక్కినేని. అందరూ మగ పిల్లలే కావడంతో అక్కినేని అమ్మ పున్నమ్మ చిన్న కొడుకు నాగేశ్వర రావుకి ఎప్పుడూ ఆడ పిల్లల బట్టలు వేసి చక్క గా అలంకరించేది. వారి కుటుంబం వ్యవసాయ దారుల కుటుంబం. ఎవరికీ కళలతో సంబంధం లేదు. కళాకారులు కుడా లేరు. అయినా అక్కినేనికి కళ ఎలా అబ్బిందో ఎవరికీ తెలియదు. చిన్నప్పటినుంచీ నాటకాల్లో వేషాలు వేసేవారు. వెంకట రాఘవాపురంలో పిల్లలంతా కలిసి నాటకం వేస్తుంటే అందులో తొలిసారిగా నారద పాత్ర వేసారు ఆయన. నాజూకుగా ఉన్నాడని నాటకాల్లో స్త్రీ పాత్రలకి ఆయన్ని ఎంపిక చేసే వారు. అలా హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి, మాతంగ కన్య, మోహిని  చెలికత్తె వంటి వేషాలు వేసారు.

నాటకాల్లో అద్బుతంగా రాణిస్తున్న అక్కినేనికి సినిమాల్లో తొలిసారిగా తీసుకు వచ్చింది ఘంటసాల బలరామయ్య. ప్రముఖ దర్శకుడు సి. పుల్లయ్య దర్సకత్వం లో వచ్చిన ధర్మపత్ని సినిమాలో మొదటి సారిగా ఆయన వెండి తెర పై కనిపించారు. 1940 లో వచ్చిన ధర్మ పత్ని అక్కినేని మొదటి సినిమా అయితే, తన కొడుకు, మనమడు తో మూడు తరాల వారితో కలిసి నటించి  2014 లో షూటింగ్ పూర్తి చేసుకొని విడుదల కానున్న సినిమా మనం.

1940 నుంచీ 2014  చివరి శ్వాస వరకూ సినిమాలే ఊపిరిగా బతికిన కళామతల్లి ముద్దు బిడ్డ అక్కినేని నాగేశ్వర రావు. 1945 లో మాయా లోకం, 1946 లో ముగ్గురు మరాటీలతో మంచి పేరు తెచ్చుకున్న నాగేశ్వర రావుకి  1948 లో విడుదల అయిన బాలరాజు   సినిమా స్టార్ డం తెచ్చి పెట్టింది. ఆ వెంటనే విడుదల అయిన కీలుగుర్రం నాగేశ్వర రావుని తిరుగులేని స్టార్ ని చేసింది. ఆ తర్వాత  1953 లో విడుదల అయిన దేవదాసు సినిమా భారత దేశ సినిమా చరిత్ర లోనే ఒక రికార్డ్ ని స్తాపించింది.

సావిత్రీ, నాగేశ్వర రావు జంట గా నటించిన దేవదాసు లో ప్రేమ కోసం పెద్దలని ఎదిరించ లేని పిరికి వాడుగా,  ప్రియురాలి ఎడబాటుని తట్టు కోలేని భగ్న ప్రేమికుడిగా, మద్యానికి బానిసై చివరకి మరణించే పాత్రలో అద్భుతంగా నటించి శభాష్ అనిపించు కున్నారు. భారతదేశ సినీ చరిత్ర లో మరే నటుడూ దేవదాస్ పాత్ర కి న్యాయం చేయలేక పోయాడంటే నాగేశ్వర రావు నటన కౌశలాన్ని మనం అంచనా వేయ వచ్చు.

సుమారు 74 సంవత్సరాల సుదీర్ఘ నటనా జీవితంలో 256 చిత్రాలకి పైగా నటించాడు అక్కినేని.  ఆడవారి హృదయాల్లో చక్కలి గింతలు పెట్టే ప్రేమికుడిగా ఎంత బాగా నటించారో, భక్తుడిగా కూడా ప్రేక్షకుల్ని అంతే మెప్పించారు. విప్ర నారాయణ,  భక్త జయదేవ, భక్త తుకారాం, మహాకవి క్షేత్రయ్య, చక్రధారి, శ్రీ రామదాసు వంటి చిత్రాల్లో భక్తుడిగా నటించారు. అక్కినేని నటించిన మాయా బజార్, శ్రీ కృష్ణార్జున యుద్ధం  వంటి శ్రీ రామ రాజ్యం వంటి పౌరాణికాలు, సువర్ణ సుందరి వంటి జానపద చిత్రాల్లో నటించారు. ఇంకా ఆయన నటించిన సాంఘీక చిత్రాలు దేవదాసు, మిస్సమ్మ, గుండమ్మ కధ,  అనార్కలి, మూగ మనుసులు, డాక్టర్ చక్రవర్తి, దొంగరాముడు, దసరా బుల్లోడు, ఆరాధన, మూగనోము, పూజాఫలం, శ్రీ మంతుడు, బంగారు కలలు, ప్రేమనగర్, సెక్రటరీ, మేఘసందేశం, ప్రేమాభి షేకం, దేవదాసు మళ్ళీ పుట్టాడు, ప్రేమ మందిరం వంటి ఎన్నో సినిమాల్లో నటించారు.

1974 లోనే గుండెకి శస్త్ర చికిత్స చేయించు కొని కూడా హీరొయిన్ లతో ఆడీ పాడీ తన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడు కొని అందరికీ రోల్ మోడల్ అయ్యారు. సినీ పరిశ్రమ మొత్తం మద్రాస్ లో స్థిరపడి నప్పటికీ తను  ఒక్కడే ఒంటరిగా  హైదరాబాద్ వచ్చేశారు. అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడటానికి  విశేషమైన కృషి చేశారు. తన సహచరులంతా రాజకీయాల లోకి వెళ్లి అధికారం కోసం తాపత్రయపడినా ఏనాడూ కళామతల్లి  సేవని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళలేదు. చివరి వరకూ రాజకీయాలకి దూరంగా ఉండి వివాద రహితుడి గా మిగిలి పోయారు.  సుదీర్ఘ సినీ ప్రస్తానం లో ఆయన్ని వరించని అవార్డులు లేవు. దాదా సాహెబ్ పురస్కారం నుంచీ పద్మవిభూషణ్ వరకూ ఎన్నో అవార్డులు, అన్నిటికీ మించీ కోట్లాది మంది అభిమానులూ ఆయనకి సొంతం. అందుకే ఒక్క తెలుగు సిని పరిశ్రమే కాకుండా యావత్ భారత చిత్ర పరిశ్రమ ఆయనకు సలాం చేస్తోంది.

Send a Comment

Your email address will not be published.