నటనకు కన్నీరుమున్నీరు

నాగయ్య సినీ జీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం యోగి వేమన. అది 1947 లో   వచ్చింది.

ఈ సినిమా చూసిన తర్వాతే ముమ్మిడివరం బాలయోగి సమాధిలోకి వెళ్ళారని అంటూ ఉంటారు.  ఒక నటుడి ప్రభావం ఎలా ఉంటుందనేందుకు ఇదొక ఉదాహరణ. నటుడి గొప్పతనం వారి వారి ప్రతిభాపాటవాల  మీద ఆధారపడి ఉంటుంది అనే దానితో ఎవరైనా ఏకీభవిస్తారు. ఈ చిత్రం మొదటి నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశం అసామాన్యం. వేమన పాత్రలో నాగయ్య నటించిన తీరు అమోఘం. ఈ తరం సినిమాలో అలాంటి నటన చూడడం కష్టమే. ఈ చిత్రం ఆఖరి సన్నివేశంలో వేమన గెటప్ లో నాగయ్య సజీవ సమాధి అయ్యేందుకు బిలం లోకి వెళ్తారు. ఈ సన్నివేశాన్ని న్యూ తోనే అనే స్టూడియో లో చిత్రీకరించారు. కె వీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్డి గారు యాక్షన్ అన్నారు. కెమెరా ఆన్ చేసారు. నాగయ్య గారు జనం మధ్య లోంచి బిలంలోకి వెళ్ళిపోతారు. అక్కడున్న వారందరూ నాగయ్య నటనను మైమరచిపోయి చూస్తున్నారు. డైరెక్టర్ నుంచి లైట్ బాయ్ వరకు అందరూ కన్నీరుమున్నీరయ్యారు.

బిలంలోకి వెళ్ళిపోయినా నాగయ్య గారు లోపలి నుంచి “అయ్యా రెడ్డి గారు షాట్ ఓకేనా….ఇక్కడ లోపల గాలి ఆడటం లేదు. నేను నిజంగానే చచ్చిపోయేట్లు ఉన్నాను…ఏ విషయం త్వరగా చెప్పండి” అని పెద్దగా అరిచారు. ఆయన అలా అరిచేవరకు ఎవరికీ నాగయ్య బిలంలో ఉన్నారన్న విషయాన్నే మరిచిపోయి పుట్టెడు బాధలో ఉన్నారు. నాగయ్య అరుపులు విన్న తర్వాత గానీ దర్శకుడితో సహా అందరూ ఈ లోకంలోకి వచ్చారు.

అందరూ నాగయ్య నటనను కొనియాడారు.

Send a Comment

Your email address will not be published.