నటన అనేది వరం

“నటన అనేది పుట్టుకతో వస్తుందని అంటూ ఉంటారు…కాదనను. అందులో కొంత వరకు నిజం లేకపోలేదు. అయితే ఆ నటనకు మెరుగులు పెట్టినప్పుడే రాణింపు అనేది వస్తుంది”

ఈ మాటలు ఎవరివో కావు….

అలనాటి అగ్ర నటి జమున చెప్పినవే. ఆమె మాతృభాష తెలుగు కాదు గానీ ఆంధ్ర దేశంలో పెరిగి టాలీవుడ్ లో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి జమున 1937 వ సంవత్సరంలో హంపీలో పుట్టారు. జమునకు తొలుత నిర్ణయించిన పేరు జనాబాయి. అయితే నక్షత్ర రీత్యా ఆమె పేరు మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. అంతే తప్ప ఆమె సినిమా కోసం తన పేరేమీ మార్చలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు నాటకాలపై దృష్టి మళ్ళింది.

నాటకాలలో ఆమె తన ప్రతిభను చూపించడంతో సినిమాలో అవకాశాలు బాగానే వచ్చాయి. ఆమెను బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు చిత్రంలో మొదటిసారిగా నటించిన జమునకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాత్ర సత్యభామ. శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో సత్యభామ ఆహార్యం విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేతమనసులు, గుండమ్మ కథ తదితర చిత్రాలలో నటించిన జమున మాట్లాడుతూ “స్టేజీ మీద నటించి మెప్పించడం ఎంత కష్టమో తేరా మీద నటించడం అంతకన్నా కష్టం. కారణం….స్టేజీ మీద వెళ్ళాక ఆ సన్నివేశంలో పాత్ర ఉన్నంత వరకే ఆ పాత్ర మూడ్ లో ఉండాలి. అప్పుడే ఆ పాత్ర పండుతుంది. కానీ తెర విషయానికి వస్తే అలాకాదు. ముహూర్తం రోజునే క్లైమాక్స్ తీస్తారు. ఆ పాత్రను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడే క్లైమాక్స్ చేయడానికి వీలవుతుంది. అంటే, అంత అవగాహనా శక్తి నటీనటులకు ఉండాలి. అదీకాక సినిమా అబగానే ముందు వెనుకలు ఉంటాయి. ఓ వరుస క్రమంలో షూట్ చేయరు. మానసికంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగినప్పుడే ఆ పాత్రలో రాణించడం సాధ్యం. బాల్య నటిగా అనుభవం ఉన్నందువల్ల పాత్రను అర్ధం చేసుకుని నటించడం నాకు సులభమైంది. దర్శకులు నాకు కథ చెప్పినప్పుడే నేను వేయవలసిన పాత్ర స్వభావం ఏమిటి? ఎలా ప్రవర్తించాలి? అని రకరకాల ప్రశ్నలు వేసుకుని సమాధానాలు రాబట్టుకుని నటించేదానిని. నాతోపాటు నా తరువాత వచ్చిన నటీమణులు కూడా సహజత్వానికి దగ్గరగా నటించారు. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కున్నా షూటింగ్ కి వచ్చేసరికి అవన్నీ పక్కన పెట్టి పాత్రలోకి పరకాయప్రవేశం చేసేదానిని. అలా నటించాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ఈ విషయంలో సావిత్రిని మహా నటి అని అనకతప్పదు.కళాకారులకు అలాంటి ప్రతిభ ఉండటం నిజంగా వరమే…..కానీ ఈ రోజుల్లో కొందరు తారల్లో అంకితభావం కొంత కొరవడినట్టే అనిపిస్తుంది. నటన అనేది వరం. దానిని సద్వినియోగం చేసుకోవాలి….” అని అన్నారు.
– యామిజాల

Send a Comment

Your email address will not be published.