నటుడు శ్రీహరి మృతి

కాల భైరవా … నీ ప్రేమని గెలుచుకోడానికి నువ్వు మళ్ళీ పుడతావురా అంటూ మగధీర సినిమాలో షేర్ ఖాన్ గా తెలుగు ప్రజలకు సుపరిచితుడు అయిన శ్రీహరి గుండె పోటుకి గురై ముంబై లోని లీలావతి ఆస్పత్రి లో బుధవారం మరణించారు. ముంబై లో జరుగుతున్న హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న శ్రీహరికి బుధవారం ఉదయం గుండె పోటు రావడం తో వెంటనే లీలావతి హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స చేసినా ప్రయోజనం లేక పోయింది.

హైదరాబాద్ లోని బాలా నగర్ లో ఆగస్ట్ 15, 1964 లో శ్రీ హరి జన్మించారు. దేహధారుడ్య పోటీల పట్ల విపరీతమైన ఆసక్తి కలిగిన శ్రీహరి మిస్టర్. హైదరాబాద్ టైటిల్ గెలుచు కొన్నారు. తెలుగు చలన చిత్ర సీమ లో మొదట ఆయన స్టంట్ మాస్టర్ గా ప్రవేశించారు. దర్శక రత్న దాసరి ప్రోత్సాహంతో నటుడిగా జీవితాన్ని ప్రారంభించారు. విలన్, కామెడీ విలన్, క్యారెక్టర్స్ లో అద్భుతం గా రాణించిన శ్రీ హరి తర్వాత హీరో గా మారారు. పోలీస్ సినిమాతో హీరో గా మారిన శ్రీహరి గణపతి వంటి పలు సినిమాల్లో నటించారు. అంతే కాకుండా నువ్వొస్తానంటే నేను వద్దన్నానా సినిమాలో హీరొయిన్ కి అన్న గా ప్రత్యెక పాత్ర లో నటించారు. ఆ తర్వాత డీ, రెడీ, మగధీర వంటి పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించారు. పల్లె కన్నీరు పెడుతూంది, గెలుపు పొందు వరకూ అలుపు లేదు మనకూ అంటూ తీసిన పాటలు ఆయన్ని ప్రజలకి దగ్గర చేసాయి.

డిస్కో శాంతి ని వివాహం చేసుకొన్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అనారోగ్య కారణం వల్ల కుమార్తె మరణించడంతో ఆమె పేరు తో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వై.ఎస్.ఆర్ చేస్తున్న సంక్షేమ పధకాలకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వై.ఎస్.ఆర్ మరణించిన తర్వాత ఇటీవల వై.ఎస్. జగన్ పార్టీ లో చేరారు. సినిమాలు మాత్రమే కాకుండా పలు సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుకు గా పాల్గొంటున్న శ్రీహరి హటాత్ మరణం చిత్ర పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది.

Send a Comment

Your email address will not be published.