నవంబర్ చివరి వారంలో బిల్లు?

తెలంగాణాపై నవంబర్ 24న గానీ, 25న గానీ రాష్ట్ర శాసనసభలో బిల్లు పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యవసరంగా ఢిల్లీ పిలిపించిన అధిష్టానం ఆయనతో ఈ విషయమై చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఒక డ్రాఫ్ట్ బిల్లు రాష్ట్రానికి పంపిస్తుందని, దాని మీద శాసనసభలో చర్చించాల్సి ఉంటుందని తెలిసింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రికి ఈ సంగతి తెలియజేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ముసాయిదా బిల్లును రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేనప్పటికీ కనీస చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది.

అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఈ బిల్లును ఓడించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ బిల్లును వోటింగుకు పెట్టనవసరం లేకపోయినా ఆయన దీన్ని వోటింగుకు పెట్టి ఓడించాలనే ఉద్దేశంలో ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇది ఇలా వుండగా అధికారాలు, వనరులు, నీళ్ళు, ఆస్తుల పంపిణీ, బదలాయింపులు పరిశీలించడానికి నియమించిన ఏడుగురు సభ్యుల మంత్రుల బృందం ఈ నెలాఖరులో తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.